12. జ్ఞానేంద్రియ విచారము

12.   జ్ఞానేంద్రియ విచారము

1.         శ్రోత్రేంద్రియ మనఁగా, శబ్దంబు లెల్ల దేనిచేత గ్రహింపఁబడు చున్నవో అది శ్రోత్రేంద్రియము. ఆ శబ్దంబు లెన్ని విధంబులనిన, లౌకిక మనియు, వైదికమనియు రెండు విధములు. ఇందు లౌకికం బెయ్యది యనిన, ప్రాకృత రూపంబులయిన అష్టాదశ భాషలును లౌకికము. వైదికం బెయ్యది యనిన, సంస్కృత రూపంబులగు వేద శాస్త్రాదులు వైదికము. లౌకికం బెన్ని విధంబు లనిన, అనంత విధంబులు. వైదికం బెన్ని విధంబు లనిన, అదియు ననంత విధంబులు. ఇన్ని శబ్దంబులును దేనిచేత గ్రహింప బడుచున్నవో అది శ్రోత్రేంద్రియము. ఈ శ్రోత్రేంద్రియంబు కర్ణ శష్కుల్య వచ్ఛిన్న నభోదేశంబు నాశ్రయించుకొని యున్నది. ఆ నభోదేశమే శ్రోత్రేంద్రి యమని చెప్పుదమనిన, సుప్తమృతమూర్ఛిత శరీరంబులయందుండెడి నభోదేశముచేత శబ్దంబు లన్నియును గ్రహింపఁబడవలయును. అటుల గ్రహింపఁబడలేదు గాన, నానభోదేశవ్యతిరిక్తమై శబ్ద గ్రహణ శక్తిమత్తై సూక్ష్మమై యొక వస్తు వానభోదేశంబు నాశ్రయించుకొని యున్నది. దానికి శ్రోత్రేంద్రియమని పేరు. దాని కధిష్ఠాన దేవత దిక్కు. ఆ యధిష్ఠాన దేవతచేత ప్రేరేపింపఁబడిన శ్రోత్రేంద్రియము శబ్దంబులనెల్ల గ్రహించు చుండును.

2.       త్వగింద్రియం బనఁగా, స్పర్శంబు లన్నియు దేనిచేత గ్రహింపఁబడుచున్నవో, అది త్వగింద్రియము. ఆస్పర్శంబులెన్ని విధములనిన, శీతమనియు, ఉష్ణమనియు, శీతోష్ణమనియు, మృదువనియు, కఠినమనియు అయిదు విధంబులు. అందులో నొక్కొక్కటి యనంత విధంబులు. ఈ స్పర్శంబులన్నియు దేనిచేత గ్రహింపఁబడుచున్నవో అది త్వగింద్రియము. ఈ త్వగింద్రియము త్వక్కును సర్వత్ర వ్యాపించుకొనియున్నది.  అదే త్వగింద్రియమని చెప్పుదమనిన, సుప్తమృతమూర్ఛిత శరీరంబులయం దుండెడి త్వక్కు చేతను, స్పర్శంబులన్నియు గ్రహిఁపబడవలయును. అటుల గ్రహింపఁబడలేదు గనుక, ఆ త్వగ్వ్యతిరిక్తమయి స్పర్శగ్రహణ శక్తిమత్తై సూక్ష్మమయి యొక వస్తు వాత్వక్కు నాశ్రయించుకొనియున్నది. దాని కధిష్ఠాన దేవత వాయువు. ఆయధిష్ఠాన దేవత చేత ప్రేరేపింపఁబడిన త్వగింద్రియము స్పర్శంబుల నన్నింటిని గ్రహించుచుండును.

3.       చక్షురింద్రియ మనఁగా, సమస్త రూపంబులును దేనిచేత గ్రహింపఁబడుచున్నవో అది చక్షురింద్రియము. ఆ రూపంబు లెన్ని విధంబులనిన, తెలుపు, నలుపు, ఎఱుపు, పచ్చ, ఆకుపచ్చ, శబలము, హ్రస్వము, దీర్ఘము, స్థూలము, సూక్ష్మము అని పది విధములు. అందులో నొకటొకటి యనేక విధములు. ఇన్ని రూపంబులును దేనిచేత గ్రహింపఁబడుచున్నవో అది చక్షురింద్రియము. ఈ చక్షురింద్రియము కంటి నల్ల గ్రుడ్డు నాశ్రయించుకొని యున్నది. ఆ నల్లగ్రుడ్డే చక్షురింద్రియమని చెప్పుదమనిన సుప్తమృతమూర్ఛిత శరీరంబులయందుండు నల్లగ్రుడ్డు చేత రూపంబులు గ్రహింపబడ వలయును. అటుల గ్రహింపబడలేదు గాన, నల్లగ్రుడ్డునకు వేఱై రూపగ్రహణ శక్తిమత్తై సూక్ష్మమయి యొక వస్తు వానల్ల గ్రుడ్డు నాశ్రయించుకొని యున్నది. దానికి చక్షురింద్రియమని పేరు. సూర్యుం డధిష్ఠాన దేవత. ఆ యధిష్ఠాన దేవతచేత ప్రేరేపింపఁబడిన చక్షురింద్రియము రూపంబులన్నిఁటిని గ్రహించుచున్నది.

4.        రసనేంద్రియ మనఁగా, రసంబులన్నియు దేనిచే గ్రహింపఁబడు చున్నవో అది రసనేంద్రియము. ఆ రసంబులెన్ని విధంబులనిన, ఉప్పు, పులుపు, కారము, తీఁపు, వగరు, చేదు అని ఆఱు విధంబులు. వీనిలో నొక్కటొక్కటి యనేక విధంబులు. ఈ రసంబులన్నియు దేనిచే గ్రహింపఁబడుచున్నవో అది రసనేంద్రియము. ఇది కొన నాలుక నాశ్ర యించుకొని యున్నది. ఆ కొన నాలుకే రసనేంద్రియమని చెప్పుద మనిన, సుప్తమృత మూర్ఛిత శరీరంబుల యందుండెడి నాలుకచే రసంబులన్నియును గ్రహిఁపఁబడవలయును. అటుల గ్రహింపఁబడలేదు గాన, నాకొననాలుకకు వ్యతిరిక్తమై రసగ్రహణ శక్తిమత్తై సూక్ష్మమై యొక వస్తు వాకొననాలుక నాశ్రయించుకొని యున్నది. దానికి రసనేంద్రియమని పేరు. వరుణుం డధిష్ఠానదేవత. ఆ యధిష్ఠానదేవతచేత ప్రేరేపింపఁబడిన రసనేంద్రియము రసంబుల నన్నింటిని గ్రహించుచుండును.

5.        ఘ్రాణేంద్రియ మనఁగా, గంధములన్నియు దేనిచే గ్రహింపబడు చున్నవో అది ఘ్రాణేంద్రియము. ఆ గంధము లెన్ని విధములనిన సుగంధము, దుర్గంధము, మిశ్రగంధము అని మూఁడు విధములు. అందులో నొకటి యనేక విధంబులు. ఇన్ని గంధములును దేనివలన గ్రహింపబడుచున్నవో అది ఘ్రాణేంద్రియము. ఈ ఘ్రాణేంద్రియము నాసికాగ్రము నాశ్రయించుకొని యున్నది. ఆ నాసికాగ్రమే ఘ్రాణేంద్రియ మని చెప్పుదమనిన సుప్తమృత మూర్ఛిత శరీరంబుల యందుండెడి నాసికాగ్రముచేత గంధములన్నియు గ్రహింపఁబడవలయును. అటుల గ్రహింపఁబడలేదు గాన, నాసికాగ్రగా వ్యతిరిక్తమై గంధ గ్రహణ శక్తిమత్తై సూక్ష్మమై యొక వస్తు వానాసికాగ్రంబు నాశ్రయించుకొని యున్నది. దానికి ఘ్రాణేంద్రియమని పేరు. దాని కధిష్ఠాన దేవతలశ్వినీ దేవతలు. ఆ యధిష్ఠాన దేవతలచేత ప్రేరేపింపఁబడిన ఘ్రాణేంద్రియముచేత గంధములన్నియు గ్రహింపబడుచున్నవి.