13. కర్మేంద్రియ విచారము

13.   కర్మేంద్రియ విచారము

1.         వాగింద్రియ మనఁగా, శబ్దము లన్నియు దేనిచేత నుచ్చరింపఁబడుచున్నవో అది వాగింద్రియము. ఆ వాగింద్రియమెక్కడ నున్నదనిన ఎనిమిదిస్థానముల నాశ్రయించుకొని యున్నది. ఆ యెనిమిది చోటులు నెయ్యవి యనిన, రసనయు, తాలుమూలంబులును, ఉత్తరోష్ఠ అధరోష్ఠంబు లును, కంఠ హృదయంబులును, బ్రహ్మరంధ్రంబును అను నీ యెనిమిది స్థానంబుల నాశ్రయించుకొని యుండును. ఈ యష్టస్థానములే వాగింద్రియ మని చెప్పెదమనిన, సుప్తమృతమూర్ఛిత శరీరంబులయందుండునట్టి యెనిమిది చోటుల చేతను శబ్దంబు లుచ్చరింపఁబడవలయును. అటుల నుచ్ఛరింపఁబడలేదు గనుక ఆ యష్టస్థాన వ్యతిరిక్తమై వచన గ్రహణ శక్తిమత్తై సూక్ష్మమై యొక వస్తు వాయెనిమిది చోటుల నాశ్రయించుకొని యున్నది. దానికి వాగింద్రియమని పేరు. దాని కధిష్ఠాన దేవత చతుర్ముఖుఁడు అగ్నియని శ్రీ శంకరాచార్యులు. ఆ యధిష్ఠాన దేవతచేత ప్రేరేపింపఁబడిన వాగింద్రియము శబ్దముల నన్నింటిని నుచ్చరించుచుండును.

2.        ప్రాణింద్రియ మనఁగా, హానోపాదానాదిక్రియలు దేని చేతఁ జేయఁబడుచున్నవో అది పాణీంద్రియము, ఆ పాణీంద్రియ మెచ్చట నున్నదనిన, అరచేతి నాశ్రయించుకొనియున్నది. అరచెయ్యే పాణీంద్రియమని చెప్పుద మనిన, సుప్తమృతమూర్ఛిత శరీరంబులయం దుండెడి అరచేతిచేత హానో పాదానాదిక్రియలు చేయఁబడవలెను. అటుల చేయఁబడలేదు కాఁబట్టి అరచేతికంటె వ్యతిరిక్తమైన హానోపాదానాది క్రియాశక్తిమత్తై సూక్ష్మమై యొక వస్తు వాయరచేతి నాశ్రయించుకొని యున్నది. దానికి పాణీంద్రియమని పేరు. దీనికి ఇంద్రుం డధిష్ఠాన దేవత. ఆ యధిష్ఠాన దేవతచేతఁ బ్రేరేపింపఁబడిన వాగింద్రియము హానోపాదానాది క్రియలను జేయుచుండును.

3.        పాదేంద్రియమనఁగా, గమనాది క్రియలు దేనిచేతఁ జేయఁబడు చున్నవో, అది పాదేంద్రియము. అది అరకాలి నాశ్రయించి యున్నది. ఆ యరకాలే పాదేంద్రియమని చెప్పుదమనిన, సుప్తమృతమూర్ఛిత శరీరంబు లయందుండు నరకాలిచేతఁ గమనాగమనాది క్రియలు సేయంబడవలెను. అటుల చేయఁబడలేదు గాన, ఆ యరకాలికంటె వ్యతిరిక్తమై గమనాది క్రియా శక్తిమంతమై సూక్ష్మమై యొకవస్తు వాయరకాలి నాశ్రయించుకొని యున్నది.  దానికి పాదేంద్రియమని పేరు.  దీని కధిష్ఠానదేవత యుపేంద్రుఁడు (విష్ణువు). ఆ యధిష్ఠానదేవతచేతఁ బ్రేరేపింపఁబడిన పాదేంద్రియము గమనాగమనాది క్రియలను జేయుచుండును.

4.        పాయ్వింద్రియ మనఁగా, పురీష విసర్జనము మొదలైన క్రియలు దేనిచేతఁ జేయఁబడునో అది పాయ్వింద్రియము. అది గుదము నాశ్రయించు కొని యున్నది. ఆగుదమే పాయ్వింద్రియమని చెప్పుదమనిన, సుప్తమృత మూర్ఛిత శరీరంబులయందుండెడి గుదముచేత పురీష విసర్జనము మొదలైన క్రియలు సేయఁబడవలెను. అటుల చేయఁబడలేదు గాన, ఆ గుద వ్యతిరిక్తమై పురీష విసర్జనాది క్రియాశక్తిమంతమై సూక్ష్మమై యొకవస్తు వాగుదము నాశ్రయించుకొని యున్నది. దానికి పాయ్వింద్రియమని పేరు. దీనికి మృత్యు వధిష్ఠానదేవత. ఆ యధిష్ఠానదేవత చేతఁ బ్రేరేపింపఁబడిన పాయ్వింద్రి యము పురీష విసర్జనము మొదలైన క్రియలను జేయుచుండును.

5.        ఉపస్థేంద్రియ మనఁగా, శుక్ల మూత్రములు విసర్జనము సేయుట మొదలైన క్రియలు దేనిచేతఁ జేయఁబడుచున్నవో అది యుపస్థేంద్రియము. అది యోనిలింగముల నాశ్రయించుకొని యున్నది. ఆ యోనిలింగములే ఉపస్థేంద్రియమని చెప్పుదమనిన, సుప్తమృతమూర్ఛిత శరీరంబులయం దుండెడి యోని లింగములచేత శుక్ల మూత్ర విసర్జనము సేయుట మొదలైన క్రియలు చేయఁబడవలెను. అటుల చేయలేదు గనుక శుక్ల మూత్ర విసర్జనాది క్రియాశక్తిమంతమై సూక్ష్మమై యొక వస్తు వాయోనిలింగముల నాశ్రయించు కొని యున్నది. దానికి ఉపస్థేంద్రియమని పేరు. ప్రజాపతి యధిష్ఠాన దేవత. ఆ యధిష్ఠాన దేవతచేతఁ బ్రేరేపింపఁబడిన ఉపస్థేంద్రియము శుక్ల మూత్ర విసర్జనము మొదలైన క్రియలను చేయుచుండును.