33. వాసనాత్రయ నిరూపణము

పంచవింశతి వర్ణకము
33. వాసనాత్రయ నిరూపణము

            జ్ఞానమునకు ప్రతిబంధకమైన వాసనాత్రయమును నిరూపించు చున్నారము. వాసనాత్రయ మనఁగా లోకవాసనయనియు శాస్త్రవాసన యనియు దేహవాసనయనియు మూఁడు విధంబులు. అందు లోకమందు సమస్తమయినవారు తన్ను నిందింపక యుండవలయుననియు అందఱును తన్ను సర్వదా స్తోత్రంబు సేయవలయుననియు ననెడి యభినివేశంబు లోకవాసన యని చెప్పఁబడును. ఈ లోకవాసనా ప్రతిబంధంబునకు నివృత్తి యెప్పుడనిన, నే నొకని చేతను నిందింపఁబడక ఉండవలెను. తన్ను అందరును స్తోత్రంబు చేయవలెననెడి అభినివేశం బీశ్వరునికైనను గూడదు గనుక అజ్ఞాన జీవులు నిందించినను నిందింతురు. స్తోత్రము చేసినను చేయుదురు, అని నిందాస్తుతులయందొకరి నిందచేత హానియేమి? స్తోత్రము చేత ఫలమేమి? యని యెఱుఁగుటయే ప్రతిబంధంబునకు నివృత్తి. అయితే యీశ్వరుని నింద చేసెడి వారు కలరా యనిన గలరు. అది యెటులనిన సర్వలోకేశ్వరుఁడై చతుర్ముఖుఁడైనట్టి బ్రహ్మ శివుని చేతను కుమార స్వామి చేతను శిక్షింపబడియెనని ఆ బ్రహ్మదేవుని మహిమ యెఱుఁగని వారలు నిందించుచున్నారు. మరియును లోకమందలి సమస్తమైన వారలకును ఆత్మస్వరూపుఁడును లోకపాలకుఁడును లక్ష్మీపతియు నయిన విష్ణువును జీవుల లోపల నొకడనియు శివునిచేత శిక్షింపబడియె ననియు నెంచి యతని మహిమంబు నెఱుగని శివపాషండులు నిందించుచున్నారు. వెండియు సమస్తమైన  వారలకును గురువై యుండునట్టి మహాదేవుఁడు దక్ష ప్రజాపతి మొదలయినవారి చేతను దూషింపఁబడినాఁడని నిందించి యతని మహిమంబు నెఱుంగని విష్ణు పాషండులు నిందించుచున్నారు. ఇటులనే అంతర్యామిని నిరీశ్వర సాంఖ్యులనెడి కొందరు మీమాంసకులు అంతర్యామి లేఁడని నిందించుచున్నారు. ఇటువలెనే ఈశ్వర సమ్మతిగల రామకృష్ణాదులు రావణశిశుపాలాదులచేత నిందింపఁబడిరని పురాణంబులయందు కానఁబడుచున్నది. కాఁబట్టి పామరులను బహిర్ముఖులు నయిన జనులు మనల నిందించుచున్నారు. ఆ నిందను గురించి చింత సేయఁబనిలేదు. అయితే ఈ నింద యెవరికని విచారింపుదము? ఆత్మకు అని చెప్పిన, అద్వితీయుఁడును పరిపూర్ణుఁడును సర్వాత్మకుఁడు నయిన ఆత్మ యెవరిచేతను నిందచేయఁబడకూడదు. ఎందుచేత ననిన, ఆ యాత్మ సర్వ ప్రాణులకును స్వరూపంబు గనుక తన్ను దాఁనే నిందించుకొన్నట్టవును. అయితే కానీ యనిన, లోకమందొకఁడు మరియొకని నిందింపఁగా కన్నారము. తన స్వరూపంబును తానే నిందించుకొనుట కానము. తన్నే తాను నిందించు కొనినచో ఆ నిందచేత తనకు హాని లేదని యెఱుంగఁదగినది. అయితే దేహంబును నిందించుచున్నారని చెప్పుదమనిన, దేహము ముముక్షువు చేత పూర్వమే నిందింపఁబడెను. కాఁబట్టి ఆ దేహమును పరులు నిందించినచో ఆ నింద ముముక్షువులకు లాభమాయెను.

            అది యెటులనిన, ఒకని యొక్క శత్రువును మఱియొకఁడు నిందించినచో వాఁడు వాని కెటువలే ప్రియుఁడో అటువలెనే వివేకికిని తన దేహమును నిందించినవాఁడు తనకు ప్రియుఁడని యెఱుఁగఁదగినది. ఈ మూఁడు శరీరముల లోపలను స్థూలశరీరమే నిందింపఁబడుచున్నది. కొదవ రెండుశరీరములును దృశ్యములు కావు. గనుక నిందకు విషయములు కావు. ఈ శరీరములే నిందకు విషయములాయెను. కనుక సర్వాతీతుఁడై సమస్తమైన వారిని ఆత్మస్వరూపుఁడై అసంగుఁడై సాక్షియై స్వప్రకాశ స్వరూపుఁడై తన్ను ఏ నిందలును స్పృశింప నేరవనుట చెప్పవలెనా అని విచారించు పురుషునికి లోకవాసనాస్వరూపమైన ప్రతిబంధము నశించిపోవును. ఈ యర్థమందు సంశయము లేదు. దేహవాసన యనఁగా జీవించి యుండెడి శరీరమునకు చిరకాలావస్థానము. ఆ దేహస్థితియు కర్మాధీనము గనుక, పురుషఁ యత్నముచేత సంపాదింపనే కూడదు. ఇటువలె కూడదని చెప్పఁగూడదు. లోకమందు కొందఱు యోగాభ్యాసము చేసి దీర్ఘమైన ఆయుస్సును సంపాదించుచున్నారని పురాణములయందుఁ గానఁబడుచున్నదని చెప్పితిరా! ఆ యోగాభ్యాసము అనాత్మ విషయము గనుక జ్ఞానము రాకుండఁ జేయును. కాబట్టి దేహము కర్మాధీనము గనుక, కర్మము ఎంతపర్యంత మున్నదో అంతపర్యంతమును దేహమునుండును. కాఁబట్టి దేహము బహుకాల ముండవలెనని యెట్టి యత్నము చేయవలసిన పని లేదు అని ముముక్షువు దేహమందుపేక్ష చేయఁదగినది. ఈ యర్థమే శ్రుతి స్మృతీతిహాస పురాణములచేతను చెప్పఁబడ్డది. ఇటువలె ఆరోగ్యమును పురుషునిచేత సంపాదించఁగూడనిదయ్యె.

            అది యెటువలె ననిన, ఆరోగ్యమును కర్మాధీనము గనుక పురుషుల యత్నముచేత సంపాదింపఁగూడదు. సిద్ధించినప్పటికిని ముముక్షువునకు దాని వలన లాభమేమియు లేనందుచేత హాని మాత్రమే యగును. ఆయు రారోగ్య సిద్ధివల్లను హర్షస్వరూపుఁడైనటువంటి తనకు వికారమును సిద్ధింపక పోయినందున దుఃఖస్వరూపుఁడైతిననే విచారమును అంతఃకరణ సాక్షియైన నాకు లేవని విచారించి ఆయురారోగ్యములు సిద్ధించవలె ననుట యందు ముముక్షువు అభిలాష సేయఁదగదు. ఈ యర్థమే శ్రుతులచేతను చెప్పఁబడ్డది. ఇటువలెనే లావణ్యము గలిగిన పురుషునియందు కాలాంతర మందు రూపప్రాప్తికన్నారము గనుకను, లావణ్యము రావలెనని యత్నము చేసినప్పటికిని ఆయత్నము వ్యర్థమయి పోయినది కన్నారము గనుకను, లావణ్యమును సంపాదింపఁగూడదు. ఆ లావణ్యమును సంపాదింపవలెనని అభినివేశముగా వచ్చెడి ప్రవృత్తి సమస్తమయన పారలౌకికవృత్తికి విఘాతమయి అనర్థ పరంపరకు హేతువాయెను గనుక, ఆ లావణ్యము సిద్ధింపవలెననుట, యందలి అభినివేశము ముముక్షువుచేత విడువఁదగినది. ఈ యర్థమే శ్రుతి స్మృతీతిహాస పురాణములచేతఁ జెప్పఁబడ్డది. శాస్త్ర వాసనయనఁగా శాస్త్ర పాఠమందును, శాస్త్రార్థ జ్ఞానమందును శాస్త్రానుష్ఠాన మందును వ్యసనము. శాస్త్రవిషయమయిన వాసనాస్వరూప ప్రతిబంధము మోక్ష సాధనమయిన శాస్త్రమువలె ప్రతిబంధమని చెప్పఁబడినదనిన, భారద్వాజనారదాదులు వేద శాస్త్రములను సాకల్యముగా నధ్యయనము చేసెదమని యుపక్రమించి బహు దుఃఖమును పొంది అసాధ్యమని విడిచి పెట్టినారని శ్రుత్యాదులయందు వినఁబడినది గనుకను, వేదాంత వ్యతిరిక్త మయిన అన్యశాస్త్రాభ్యాసము ఆత్మ విచారమునకు విరోధము గనుకను, అది ప్రతిబంధమని చెప్పవచ్చును. కాఁబట్టి అన్య శాస్త్రపఠన మందును శాస్త్రార్థ జ్ఞానమందును శాస్త్రానుష్ఠానంబును సాకల్యముగా ప్రజ్ఞ సంపాదింపగూడదు గనుక, ముముక్షువు చేతను వీటిని సాకల్యముగా సంపాదింపవలెననెడి అభినివేశము విడువఁదగినది. లోకమందు శాస్త్రాభ్యాసము చేసినవారికి పూర్వము అభ్యసించినది మఱచుటచేతను దుఃఖమయి తోఁచుచున్నది. తాను పరులతో వాదించి జయించినప్పటికిని ఓడినప్పటికిని దుఃఖమే తోఁచుచున్నది. కాఁబట్టి శాస్త్రాభ్యాసము సర్వానర్థ హేతువుగాన ముముక్షువు చేతను అన్యశాస్త్రాభ్యాసము వల్ల నుపరతి యభ్యసింపదగినది. ఇటు లభ్యసించిన శాస్త్రములనర్థమని విచారించి అన్య శాస్త్రములవలనను ఉపరతి పొందినచో శాస్త్రవాసనా విషమయిన ప్రతి బంధము నశించిపోవును. ఈ యర్థమే శ్రుతుల యందు చెప్పఁబడినది. ఎవఁడు ఈ ప్రకారంబుగా విచారించి యీ ప్రతిబంధంబులను రాకుండ చేసికొని ఆత్మ ప్రతిపాదకమయిన శాస్త్రార్థ విచారంబుచేతను జ్ఞానంబును సంపాదింపుచున్నాఁడో వాఁడే ముక్తుఁడని వేదాంత శాస్త్ర సిద్ధాంతము.

ఇది పంచవింశతి వర్ణకము.