21. అజ్ఞానస్వరూప నిరూపణ ప్రకరణము

త్రయోదశ వర్ణకము
21.అజ్ఞానస్వరూప నిరూపణ ప్రకరణము

            శ్లో||  యదజ్ఞానప్రభావేన దృశ్యతే సకలం జగత్‌
                       యద్‌ జ్ఞానాచ్ఛ్రేయ ఆప్నోతి తస్మై జ్ఞానాత్మనే నమః

            ఏ యజ్ఞానము వలన సమస్త ప్రాణులును జన్మ మరణ దుఃఖపరం పరను బొందుచున్నారో ఆ యజ్ఞానము యొక్క స్వరూపమును నిరూపించు చున్నారము. అజ్ఞానం బన నెయ్యది యనిన, తన్నుఁదా నెఱుఁగకుండుట అజ్ఞానము. ఎవరునుం దమ్ముందా మెఱుఁగరా యనిన, ఎఱుంగరు. ఎవ్వరును తమ్ముఁదా మెఱఁగరని చెప్పవచ్చునా ? యనిన, ఎఱుఁగకున్నారు గానఁ జెప్పవచ్చును. అయితే మఱియేమి యెఱుఁగుదురనిన నేను మనుష్యు ఁడను, నేను స్త్రీని, నేను పురుషుఁడను అనియు, నేను బ్రాహ్మణుఁడను, క్షత్రియుఁడను, వైశ్యుఁడను, శూద్రుఁడను అనియు, నేను బ్రహ్మచారిని, గృహస్థుండను, వానప్రస్థుండను, సన్యాసిని అనియు, నేను మురికినాటి వాడను, వెలనాటివాడను, వేగినాటివాఁడను, పాకనాటి వాఁడను, కాసలనాటి వాఁడను, నియోగపువాఁడను అనియు, నేను తెనుఁగువాఁడను అరవవాఁడను, కర్నాటకుఁడను, మహారాష్ట్రుఁడను అనియు, నేను తత్త్వ వాదిని, వైష్ణవుఁడను, శైవుఁడను, భాగవతుఁడను, పౌరాణికుఁడను, శాస్త్ర వాదిని అనియు, నేను కృష్ణుఁడను, రాముఁడను, నారాయణుఁడను అనియు, నేను వాని తండ్రిని, వీనిపుత్రుఁడను అనియు నెఱుఁగుదురు. అయితే ముందు ఎవరును తమ్ముఁదా మెఱుగరని చెప్పి యిప్పుడెఱుఁగుదురని చెప్పుటచేత ముందు చెప్పినందుకును నిప్పుడు చెప్పినందుకును విరోధము గదా ! యనిన, విరోధము కాదు.

            అది యెట్టులనిన, తాను మనుష్యుఁడు కాడు గనుక మనుష్యుఁడని యెఱుఁగుట కాదు.  స్త్రీయును, పురుషుండును కాకుండుట వలన స్త్రీ యనియు, పురుషుండనియు నెఱుఁగుట తాను బ్రాహ్మణుగాన బ్రాహ్మణుండని యెఱుఁగుట యెఱుఁగుట కాదు. కనుక నెవరును తమ్ముఁదా మెఱుఁగరని చెప్పవచ్చును. అయితే మనుష్యుఁడగు తన్ను మనుష్యునిగా నెఱుఁగుచున్నాఁడు గాని యెద్దుగా నెఱుఁగలేదు. స్త్రీయగు తన్ను స్త్రీ యని యెఱుఁగుచున్నది గాని పురుషుఁడని యెఱుఁగలేదు. పురుషుఁడగు తన్ను పురుషుఁడని యెఱుఁగుచున్నాఁడు గాని పిశాచముగా నెఱుఁగలేదు. బ్రాహ్మణ్ముండగు తన్ను బ్రాహ్మణుఁడని యెఱుఁగుచున్నాఁడు గాని శూద్రుఁడని యెఱుఁగలేదు. ఈ ప్రకారముగా సమస్తమైన వారలును తమ్ముఁదాము యథార్థముగా నెఱిఁగియుండఁగా నెవరును తమ్ముఁదా మెఱుఁగ రని యెటుల చెప్పనగుననిన, చెప్పవచ్చును. అది యెటువలెననిన, తాను మనుష్యుఁడే అయినట్టయితే, పోయిన జన్మమందును మనుష్యుఁడై యుండవలయు నింకవచ్చెడి జన్మమందును మనుష్యుఁడు గానే పుట్టవలెను. పోయిన జన్మమందు తాను దేవుఁడో యక్షుఁడో గంధర్వుఁడో మనుష్యుఁడో స్థావరమో పిశాచమో యెద్దో యెనుపోతో కుక్కయో నక్కయో తెలియఁబడలేదు. తనకు మనుష్యత్వమే స్వతస్సిద్ధ మైనట్టయితే మీఁదటి దేవాది శరీరములు కావలయునని యీ జన్మమందెవరును యాగోపాసనాది క్రియలను జేయక యుండవలయును. చేయుచున్నారు, కాఁబట్టి తన్ను మనుష్యుఁడని యెఱుఁగుట యెఱుఁగుట కాదు. ఈ ప్రకారముగానే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులును తమ్ముఁదా మెఱుఁగుట యెఱుఁగుట కాదని తెలిసికొనఁదగినది. అయితే అందఱు నిటువలెనే యెఱుఁగుదురా? యనిన, కొందఱు పారలౌకికులైన వారలు జీవుఁడని యెఱుఁగుదురు. ఆ జీవుని యొక్క స్వరూప మెయ్యది యని యడిగిన నుత్తరం బీయ నేరరు గాన, వారును ఎఱుఁగరు.

            అది యెటులనిన, మనుజుఁడు గాని తన్ను మనుజుఁడని యెఱిఁగినవాఁ డెటువలె నెఱిఁగినవాఁడు కాఁడో అటువలెనే జీవుఁడు గాని తన్ను జీవునిగా నెఱిఁగినవాఁడును ఎఱిఁగినవాఁడు కాఁడు. అయితే శాస్త్రజ్ఞులైన వారలును ఆత్మ నెఱుఁగరా ? వారాత్మ స్వరూప మిటువంటిదని నిశ్చయిం చుకొని యుండఁగా నెటువలె నెఱుఁగరని చెప్పవచ్చుననిన, శాస్త్రజ్ఞుల లోపల చార్వాకుఁడైన వాఁ డనాత్మస్వరూపమైన స్థూలదేహమును ఆత్మ యని యెఱిఁగినాఁడు గనుక, వాఁడు శాస్త్రజ్ఞుఁడైనప్పటికిని ఆత్మ నెఱిఁగినవాఁడు కాఁడు. మఱియును ప్రాణోపాసకులైన కొందఱు శాస్త్రజ్ఞులు అనాత్మ యగు ప్రాణుఁ డాత్మయని యెఱిఁగిరి గావున వారు శాస్త్రజ్ఞులయ్యు నాత్మ నెఱిఁగినవారు కారు. మఱికొందఱ నాత్మస్వరూపమగు నింద్రియం బుల నాత్మగా నెఱిఁగిరి గాన వారు శాస్త్రజ్ఞులైనప్పటికిని ఆత్మ నెఱిఁగినవారు కారు. మానసోపాసకులగు మఱికొందఱనాత్మయగు మనస్సును ఆత్మ యని యెఱిఁగిరి గాన, వారలు శాస్త్రజ్ఞులైనప్పటికిని ఆత్మ నెఱిఁగినవారలు కారు. ఇంతియగాక బౌద్ధుల లోపలఁ గొందఱు శాస్త్రజ్ఞులాత్మకాక క్షీణమైన బుద్ధిని ఆత్మయని యెఱిఁగిరి గావున, వారలు శాస్త్రజ్ఞులైనప్పటికిని ఆత్మ నెఱిఁగినవారలు కారు. మఱియును బౌద్ధులమని పేరు పెట్టుకొని యుండెడి కొందఱు మూఢులు శశవిషాణతుల్యమైన శూన్యమును ఆత్మగా నెఱిఁగిరి గనుక, వారు శాస్త్రజ్ఞులైనప్పటికిని ఆత్మ నెఱింగిన వారు కారు. అట్లయితే శాస్త్రజ్ఞులైన మీమాంసకులును శైవులును రామానుజులును మధ్వులును ఆత్మ నెఱుఁగరా ? యనిన, నెఱుఁగరు.  అ దెటువలెనిన మీమాంసకాదులు పరిపూర్ణుఁడగు ఆత్మ నణుపరిమాణఁడని  యెఱిఁగిరి గనుక వారలు శాస్త్రజ్ఞు లైనప్పటికిని ఆత్మ నెఱిఁగినవారలు కారు. అయితే శాస్త్రజ్ఞులైన తార్కికాదు లాత్మకు విభుత్వము నంగీకరించిరే! వారలాత్మ నెఱుఁగరా ? యనిన, ఎఱుఁగరు.

            అది యెటులనిన, తార్కికాదులాత్మకు విభుత్వము నంగీకరించినను ఆత్మకు నానాత్వంబును జడత్వంబును, ఆ జడుఁడగు ఆత్మకు చిత్తు గుణం బనియును, నిర్గుణుఁడైన ఆత్మకు ఇచ్ఛాది గుణంబులును, దృక్కైయుండునట్టి యాత్మకు దృశ్యత్వంబును నంగీకరించిరి గాన వారలు శాస్త్రజ్ఞులైనను ఆత్మ నెఱిఁగినవారు కారు. అయితే సాంఖ్య యోగులును ఆత్మ నెఱుంగరా ? యనిన, సాంఖ్యయోగు లాత్మకు విభుత్వ సచ్చిదానందత్వ స్వరూపాసంగత్వ ముల నంగీకించినప్పటికిని ఆత్మకు నానాత్వంబును జగత్తుకు సత్యత్వంబును జీవేశ్వరులకు భేదంబును నంగీకరించిరి గాన, వారలు శాస్త్రజ్ఞులైనను ఆత్మ నెఱింగినవారు కారు. అయితే యిందఱు శాస్త్రజ్ఞులు ఆత్మ నెఱుఁగకపోయినఁ బోనిమ్ము. వేదాంత శాస్త్రజ్ఞులాత్మ నెఱుంగరా ? యనిన, వేదాంత శాస్త్రజ్ఞులు ముముక్షువులనియు, నముముక్షువులనియును రెండు విధంబులు. ఈ రెండు విధముల వారలలోన ముముక్షువులు నాలుగు తెగలై యుందురు. వార లెవ్వరనిన, ప్రయోజనమునకై చదివిన వారలును, ప్రసిద్ధి కొఱకై చదివిన వారలును, పూజార్థులై చదివిన వారలును, ఇతర మత ప్రవిష్టులై యుండి వేదశాస్త్ర ధర్మము నెఱిఁగి పెద్దలను దూషింపవలెనని చదివిన వారలును, ఈ నాలుగు తెగల వారలును వేదాంత శాస్త్రజ్ఞు లైనప్పటికిని ఆత్మ నెఱింగినవారలు కారు. ఈ నాలుగు విధముల వారికిని గలిగెడి ఫలంబు లెవ్వి యనిన, వేదాంతమును దూషించుట కొఱకు చదివిన వారికి నరకంబును, తిర్యగాదియోనిప్రాప్తియుఁ గలుగును. తక్కిన మువ్వురకును వారి వారి సత్కర్మాచరణానుసారముగ స్వర్గాదిలోక ప్రాప్తి కలిగినను కలుగ వచ్చును. ముముక్షువులై చదివినవారు రెండు విధములుగా నుందురు. వా రెవ్వరనిన ప్రతిబంధ సహితులు, ప్రతిబంధ రహితులును. ప్రతిబంధ సహితులై వేదాంతము చదివినవారు కాలాంతరమందా ప్రతి బంధముచేత విడువఁబడి ఆత్మ స్వరూపము నెఱింగి ముక్తులగుదురు. ప్రతిబంధ రహితులై వేదాంతమును జదివిన వారలు అప్పుడే ఆత్మ స్వరూపంబు నెఱిఁగి ముక్తులగుదురు. ఓయీ ! పూర్వ మెవరును తమ్ముఁ దా మెఱుఁగరని చెప్పి యిప్పుడు ప్రతిబంధ రహితులైన వేదాంతు లాత్మ నెఱుఁగుదురని చెప్పెదవు. పూర్వము చెప్పినందుకును ఇప్పుడు చెప్పినందుకును విరోధము లేదా ? లేదు. ప్రతిబంధ రహితులై చదివి యాత్మ నెఱిఁగిన వారలు ఆత్మయే కాన నెఱుఁగరని చెప్పినందుకు విరోధము లేదు. అయితే పూర్వము తమ్ముఁ దా మెఱుఁగఱని చెప్పి వెనుక నాత్మ నెఱుఁగరని చెప్పుట  విరోధము గదా యనిన, తానే ఆత్మ గనుక యెవరును తమ్ముఁదా మెఱుఁగరని చెప్పినందుకు విరోధము లేదు. తన్నెఱుఁగని యా యజ్ఞాన మెట్లు తొలఁగుననిన, ఆత్మ జ్ఞానము వలనఁ దొలగును. ఆత్మ జ్ఞానము చేత పోవునని యేల చెప్పవలెను? కర్మముచేత పోవునని చెప్పుద మనిన, అటుల చెప్పఁగూడదు. అది యెట్లనఁగా, కర్మం బజ్ఞానంబునకు విరోధికాదు గాన కర్మం బాత్మజ్ఞానంబువలననే పోవును. మఱెందుచేతనుం బోదు. ఆత్మ జ్ఞానము చేతనే పోవునని యెందుకు చెప్పవలెను? కర్మం బజ్ఞానము వలనఁ దొలఁగునని చెప్పుదమనిన, అటుల చెప్పఁగూడదు. అది యెటులనఁగా దృష్టాంతపూర్వకముగ నిరూపించుచున్నారము. ఘటము ఘటారతరంబునకు విరోధికాదు గాన, ఘటమును ఘటాంతరం బెటువలె పోఁగొట్ట నేరదో అటువలెనే కర్మము అజ్ఞానంబునకు విరోధి కాదు గనుక అజ్ఞానమును బోఁగొట్టనేరదు. ఇంతమాత్రమే కాదు.  కర్మ మజ్ఞానంబునకు వృద్ధి కలుగఁజేయును. అది యెట్టులనిన, అమావాస్య నిశియందు వచ్చిన మేఘావరణమా యమావాస్య చీఁకటికి విరోధి గాక, యాచీఁకటి నెటులపోఁగొట్టనేరక మఱియును వృద్ధి నొందించునో, అటుల కర్మము అజ్ఞానంబును పోఁగొట్టనేరక అజ్ఞానంబును వృద్ధిచేయును. అది యెటువలె ననఁగా, అమావాస్య చీఁకటియందు మార్గమునుబట్టి పోవునట్టి పురుషునికి పసరమెదుర య్యెనేని అది వృషభమైనదియు, పశువైనదియు, నెనుమైనదియును దెలియక సామాన్యముగా మృగమని తోఁచుచున్నది. మనుష్యుఁ డెదురయ్యెనేని  వాఁడు బ్రాహ్మణుఁడైనదియు శూద్రుఁడైనదియును దెలియఁబడక పురుషుఁడని సామాన్యముగాఁ దోఁచుచున్నాఁడు. ఆ చీఁకటియందు మేఘమా వరించినట్టయితే ఆ మేఘ మా యంధ కారమును వృద్ధింజేసి సామాన్యముగ దోఁచిన ఆ మనుష్యాదులను గూడ సర్వాత్మనా యెటులఁ దోఁచనీయదో అటులనే కర్మమును అజ్ఞానమును వృద్ధిఁ బొందించి, ఆత్మను సర్వాత్మనా తోఁచనీయదు. అయితే దృష్టాంత మందు మేఘావరణ మహంకారమును వృద్ధి బొందించి మనుష్యాదులను సర్వాత్మనా తోఁచనీకుండుటను ప్రత్యక్షముగాఁ గనుచున్నారము. దార్ష్టాంతికమందు కర్మము అజ్ఞానమును వృద్ధిపొందించి నిత్యుఁడైన ఆత్మ నెటువలె తోఁచనీయ దనిన, మేఘముచేత నావరింఁపబడిన బిడాంధకార మందు మణిపుస్తకసాలగ్రామరుద్రాక్షాదులు చేతికి లబ్దమయి నపుడు ఈమణి కాచమణియో, మంచిమణియో యనియు, నీపుస్తకము వేదమో, శాస్త్రమో, పురాణమో యనియు, నీసాల గ్రామము సీతారామమో, లక్ష్మీనారాణమో, నారసింహమోయనియు, నీ రుద్రాక్ష షణ్ముఖియో, పంచముఖియో, భద్రాక్షియో యనియు, నాయంధకార మెటువలె స్పష్టముగాఁ దోఁచనీయదో అటువలెనే కర్మము చేత వృద్ధిపొందిన అజ్ఞానము ఆత్మను తోఁచనీయదు. అయితే యాయంధకారమందు చేతికి లబ్దమైన మణిపుస్తకాదులయొక్క యథార్థమైన జ్ఞానమెప్పుడు కలుగు ననిన సూర్యోదయమైన తర్వాత నాయంధకారము నశించిపోవుచుండగా చేతికి లబ్ధమయిన మణి పుస్తకాదుల యొక్క యథార్ధజ్ఞాన మెటువలె వచ్చుచున్నదో అటువలెనే దార్షా ్టంతికమందును కర్మముచేత వృద్ధిఁబొందింపఁబడిన ఆత్మావరకమైన జ్ఞానము బ్రహ్మాత్మజ్ఞానముచేత నశించిపోవుచుండఁగా తర్వాతను యదార్థము తోఁచును. ఈ దృష్టాంతమందు సూర్యోదయము చేతను నివృత్తమైన దెయ్యది, యుండెడిదెయ్యది యని శంకరాఁగా సూర్యోదయముచే తను మణిపుస్తకాదులయొక్క స్వరూపమును దెలియ నీయని యంధకారము నశించి మేఘావరణముండెను. ఆ మేఘావరమేమి సేయుననినఁ గొందఱికి సుఖంబును కొందఱికి దుఃఖంబును గలుగఁజేయుచుండును. అది యెట్టులనిన, మార్గమున నడిచిపోవునట్టి వారికిని కృష్యాదులను చేయునట్టివారికిని సుఖంబును, వడ్లు మొదలైనవాని నెండఁబోసెడి వారికి స్నానము సేయునట్టి వారికిని వాత శరీరము గలవారికిని దుఃఖంబునుం జేయును. అయితే దార్షా  ్టంతికమందు పోవునట్టి దెయ్యది యుండెడి దెయ్యది యనిన, జ్ఞానముచే నజ్ఞానము నశించిపోవును. అజ్ఞాన కార్యములయిన దేహేంద్రియాదులుండును. అయితే యీ యుండెడి దేహేంద్రియాదులు జ్ఞానులకేమిసేయుననిన, సుఖదుఃఖములను చేయు చుండును. అయితే దృష్టాంతమందు మేఘావరణ మంధకారము యొక్క కార్యము కాదు. కనుక ఆ యంధకారము నశించి మేఘావరణం బుండవచ్చును. దాష్ట్రాంతికమందు దేహేంద్రియాదు లజ్ఞానము యొక్క కార్యములు గనుక, కారణము నశించిపోయిన తర్వాత కార్యమయిన దేహేం ద్రియము లెటువలె నుండుననిన, దృష్టాంతపూర్వకముగ నిరూపించు చున్నారము.

            కలబందయును, ధూమంబును, ఇషువేగంబును దృష్టాంతము. అది యెట్టులనిన, కలబందకు కారణమయిన మూలము నశించిపోయి నప్పటికిని ఆకలబంద యెటువలె నశింపక యున్నదో, ధూమమునకుఁ గారణమైనయగ్ని నశించినప్పటికిని ఆ ధూమ మెటువలె నశింపకున్నదో, ఇషు వేగమునకు కారణమయిన యాకర్షణముతోఁ గూడిన యల్లెత్రాటి యొక్క ఇషు బాణ సంయోగము నశించినప్పటికిని ఆ యిషు వేగ మెటులు న్నదో అటువలెనే దార్షా  ్టంతికమందును దేహేంద్రియములకుం గారణమైన అజ్ఞానము నశించినప్పటికిని దేహేంద్రియాదులుండవచ్చును. అయితే యీ దేహేంద్రియాదులకు నాశమెప్పుడనిన, దృష్టాంతమందు మేఘావరణాదుల యొక్క నాశమున కెటువలె నియమము లేదో అటువలెనే దేహేంద్రియా దుల యొక్క నాశమునకు నియమము లేదు. ప్రారబ్ధమెప్పుడు నశించుచున్నదో అప్పుడే దేహేంద్రియాదులకు నాశము. దృష్టాంతమందు మేఘావరణ మంధకారమును వృద్ధిచేయుట ప్రత్యక్షముగఁ గన్నారము. దార్షా  ్టంతికమందైతే కర్మ జ్ఞానమును వృద్ధిచేయుట కానము గాన, నీదృష్టాంత మెటువలె కూడు ననిన, త్రివిధకరణములచేత చేయఁబడిన కర్మ మకర్తయగు నాత్మను కర్తగాను, అభోక్తయగు నాత్మను భోక్తగాను, సుఖదుఃఖములు లేని ఆత్మను దుఃఖముగల వానిగాను జేయుచున్నది. కాఁబట్టి ఇటువలెఁ జేయుటచే అజ్ఞానమునకు వృద్ధియని యెఱుంగవలయు గావున, నజ్ఞానమునకు వృద్ధిని జేయు కర్మమజ్ఞానమును దొలగఁజేయ నేరదు. అయితే యీ అజ్ఞాన మెటుల నశించుననిన, ఆత్మ జ్ఞానము చేతనే నశించును. మరి యెందుచేతను నశింప నేరదు. జ్ఞానమెటుల వచ్చుననిన, విచారము చేతనే వచ్చును. విచారమువలన జ్ఞానము గలుగునని యెందుకు చెప్పవలెను. కర్మము వలననే జ్ఞానము గలుగునని చెప్పుదమనిన, అటుల చెప్పఁగూడదు. అది యెటువలెననిన, అగ్నిచేత క్షుత్తు పోఁగొట్టఁబడక వృద్ధిపొందినప్పటికిని తండులములను ఆకారముగాఁ బరిణమింపఁజేసి క్షుత్తు నెటువలె పోఁగొట్టుచున్నదో అటువలెనే కర్మము చేత అజ్ఞానము పోఁగొట్టఁబడక వృద్ధి బొందినప్పటికి కర్మ జన్యజ్ఞానమాత్మజ్ఞానముగాఁ బరిణమించి అజ్ఞానమును బోఁగొట్టుచున్నదని చెప్పుదమనిన, అటుల చెప్పఁగూడదు. దృష్టాంతమందు అగ్ని తండులములను అన్నాకారముగాఁ బరిణమింపజేసి క్షుత్తును పోఁగొట్టుటను ప్రత్యక్షముగాఁ గన్నారము. కాఁబట్టి యీ యర్థము కూడదు.

            అది యెటువలె ననఁగా, కర్మ మజ్ఞానమును దొలగఁజేయునట్టి జ్ఞానమునుబుట్టించి యాజ్ఞానము ద్వారా అజ్ఞానమును పోఁగొట్టునని చెప్పుదమనిన, చెప్పఁగూడదు. మఱి యెట్టులనిన జ్ఞానమనఁగా చిత్త వృత్తికి అకర్త్రాద్యాకారముగాఁ బరిణామము. కర్మమైతే కర్త్రాద్యాకారముగాఁ బరిణమింపం జేసెడిది గనుక, అజ్ఞానమును దొలంగం జేయనేరదు. అందువలన కర్మముచేత జ్ఞానము రానేరదు. మఱియెందువలన వచ్చు ననిన, విచారము వలననే రావలయును. ఏ విచారము వలన రావలయు ననిన, ఆత్మానాత్మ విచారము వలన రావలయును. అయితే ఆత్మ జ్ఞానము విచారము ద్వారా రావలసినదే కాని మఱియెందుచేతను రాదనుటకు దృష్టాంతము కలదా? యనిన, కలదు. అది యెట్టియనిన, అర్థముతోఁ గూడుకొని యుండెడి గాయత్రి పురుషునిచేత పొందఁబడి యున్నప్పటికిని, ఆ గాయత్రి యొక్క అర్థమును తెలియవలెనిన, సేతు స్నానము చేసినప్పటికిని గంగాసాగర సంగమంబునందు వేయేండ్లు తపస్సు చేసిన ప్పటికిని అనేక శివవిష్ణు దేవోపాసనలు చేసినప్పటికిని పంచాగ్ని మధ్య యందు పదివేలయేండ్లు తపస్సు చేసినప్పటికిని నూఱశ్వమేధములు చేసినప్పటికిని, లక్షగాయత్రీ జపము చేసినప్పటికిని, గాయత్రి యొక్క అర్థము తెలిసినవారి యొద్ద తెలిసికొను పర్యంతము తెలియక అర్థము తెలిసినవారి నడిగి వారు చెప్పిన యర్థమును మనస్సు చేత విచారించి, ఆ గాయత్రి యొక్క అర్థము నెటువలె తెలిసికొనుచున్నాఁడో అటువలెనే దార్షా   ్టంతిక మందును మృత్తికాస్నానము మొదలయినవి చేసిననందున జ్ఞానము రానేరదు. ఆత్మానాత్మ విచారము చేతనే ఆత్మ జ్ఞానము రావలెను. ఈ యర్థమందనుభము గలదా యనిన, సర్వానుభవ సిద్ధమయిన అనుభవము గలదు. అది యెట్టిదనిన, కర్మద్వారా చెప్పుచున్నారము. కర్మమనఁగా నెయ్యది యనిన, స్నానసంధ్యావందన జపోపాసన స్వాధ్యాయ దేవతార్చనాతిథి పూజన వైశ్వదేవ తీర్థస్నానాదులు కర్మములని చెప్పఁబడుచున్నది. ఈ కర్మములను మన మేమాత్రమైన జేసికొనుచు వచ్చితిమి గదా ! ఆ కర్మముల యొక్క స్వరూపము మన కెఱుకపడలేదే, కాఁబట్టి కర్మములు చేసికొనుచు వచ్చినందుచేత నెవ్వరికిని ఆత్మజ్ఞానము రానేరదు. విచారముచేతనే ఆత్మ జ్ఞానము రావలెను. మఱియును విచారముచేతనే బ్రహ్మజ్ఞానము రావలయు ననుటయందు సర్వానుభవములగు దృష్టాంతములను చెప్పెదము.

            అవి యేవియనిన, ఒక పురుషుండు నేడు తిథివార నక్షత్ర యోగకరణంబులేవియని యడిగినట్టయితే విచారించి నేఁడీతిథి, యీవార, మీనక్షత్ర, మీయోగ, మీకరణమని చెప్పుచున్నాఁడు. విచారింపకపోతే నేను విచారింపలేదు గనుక నెఱుఁగనని చెప్పుచున్నాఁడు. అటువలె నేను స్నాన సంధ్యావందనాదులు చేయలేదు గనుక నెఱుఁగనని చెప్పలేదు. మఱియును గుడియందుండెడి దేవున కభిషేకపూజా నైవేద్యములాయెనా యని యడిగితే విచారించినట్లాయెనా, కాలేదు అని చెప్పుచున్నాఁడు. విచారింపకున్న నాకు తెలియదని చెప్పుచున్నాఁడు. గాని సంధ్యావంద నాదులు చేయలేదు గనుక యెఱుఁగనని చెప్పఁడు. ఈ ప్రకారముగా లోకమందు సమస్త ప్రాణులచేతను ఏయే వస్తువు విచారింపబడుచున్నదో ఆయా వస్తుజ్ఞాన మాప్రాణులకు యథార్థముగానే కలుగుచున్నది. ఈ కర్మాదులచేతను వారలకు ఆయా వస్తుజ్ఞానము రానేరదు. అటువలెనే దార్షా ్టంతికందును సమస్త ప్రాణులకు ఆత్మ జ్ఞానము విచారణచేతనే రావలెను గాని కర్మోపాసన చేతను రానేరదు. ర్మచేత జ్ఞానము వచ్చునని శ్రుతుల యందు జెప్పఁబడియుండఁగా, రాదని చెప్పుటచేత శ్రుతులకు వైయర్థ్యము వచ్చునంటివేని వైయర్థ్యము రాకుండఁ జెప్పెదను. అది యెటులనగా కర్మైకదేశమే జ్ఞానమునకు పరంపరాసాధనము గాని నానా విధ కర్మములను జ్ఞానమునకు సాధనములు కావు. కనుక శ్రుతికి విరోధము కాదు. అట్లయితే కర్మ లెన్ని విధంబులనిన లౌకిక మనియు వైదిక మనియు రెండు విధములు. ఈ రెంటి లోపలను సగము లౌకికకర్మ. లౌకిక కర్మ జీవనమునకు హేతు వాయెను. అందువలన జ్ఞానము పుట్టనేరదు. కడమ సగమయిన వైదికకర్మ నిత్యమనియు, నైమిత్తికమనియు కామ్యమనియు, నిషిద్ధ మనియు, ప్రాయశ్చిత్తమనియు నైదువిధములు. వానియందు కామ్యకర్మచేత జ్ఞానము రానేరదు. స్వర్గాదులు వచ్చును. నిషిద్ధ కర్మచేత కాలసూత్రాది నరకములు వచ్చును. ప్రాయశ్చిత్తకర్మ పురుషునకధి కారత్వమును సంపాదించి ప్రత్యవాయమును బోఁగొట్టును. ఈ త్రివిధ కర్మములను రాజస తామస కర్మములని చెప్పఁబడును. ఇవి జన్మ సుఖ దుఃఖముల నిచ్చుచుండును. ఈ రాజస తామస కర్మలచేత జ్ఞానము రానేరదు. శేషించిన సాత్విక కర్మలయందైతే చిత్తశుద్ధి కలుగును. ఆచిత్తశుద్ధి జ్ఞానమునకు పరంపరా సాధనమని చెప్పఁబడును.

            అది యెటులనఁగా, ఈ నిత్యనైమిత్తిక రూపమయిన సాత్విక కర్మ వలన చిత్తశుద్ధి, చిత్తశుద్ధి ద్వారా నిత్యానిత్య వస్తు వివేకము, నిత్యా నిత్య వస్తు వివేకము ద్వారా ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, ఇహాముత్రార్థ ఫలభోగవిరాగము ద్వారా శమాదిషట్కసంపత్తి, శమాదిషట్కసంపత్తి ద్వారా ముముక్షుత్వము, మోక్షేచ్చద్వారా సద్గురు లాభము, సద్గురు లాభముద్వారా శ్రవణము, శ్రవణము ద్వారా మననము, మననము ద్వారా నిధిధ్యాసనము కలిగి నిధి ధ్యాసనము ద్వారా జ్ఞానము వచ్చును. ఈ ప్రకారముగా కర్మైక దేశము జ్ఞానమును గూర్చి పరంపరాసాధనము. విచారమో సాక్షాత్సా ధనము. ఈయర్థమందు దృష్టాంతము: ఆఁకలి కొన్నవాని కయ్యాఁకలి పోవుటకు పక్వమైన అన్న మెటల సాక్షాత్సాధనమో ఆ యన్నమునకై దున్నుట విత్తుట మొదలైనవి యెటుల పరంపరా సాధనములో అటులనే విచారము జ్ఞానమునకు సాక్షాత్సాధనము. కర్మైకదేశము పరంపరాసాధనము. ఈ యర్థమందు సందేహము లేదు. ఈ ప్రకారముగా అజ్ఞానము యొక్క స్వరూపంబును ఆత్మయొక్క స్వరూపంబును లెస్సగా విచారించి, ఆ యాత్మ నే నని యెవఁడెఱుఁగుచున్నాఁడో వాఁడే జీవన్ముక్తుఁడు, వాఁడేవిద్వాంసుఁడు, వాఁడే యోగి, వాఁడే సచ్చిదానంద స్వరూపమయిన బ్రహ్మమని వేదాంత శాస్త్ర సిద్ధాంతము.

ఇది త్రయోదశ వర్ణకము.