45. బ్రహ్మవిద్వరవరీయవరిష్ఠ లక్షణ నిరూపణము

సప్తత్రింశద్వర్ణకము
45. బ్రహ్మవిద్వరవరీయవరిష్ఠ లక్షణ నిరూపణము

            లోకమందు జ్ఞానియైనవాఁడు సదా సమాధినిష్ఠుండయి యుండ వలయుననియును, యోగంబు లేకయే, వచ్చిన జ్ఞానంబు దృఢంబు గాదనియును, వ్యవహారంబుతోఁ గూడుకొనియుండెడి వారికిఁ గూడదని యును, వివేకులైనవారిలో కొందఱి కనేకవిధంబులయిన సంశయంబు లున్నవి. వారి యొక్క సంశయంబులను పోఁగొట్టుట కొఱకై బ్రహ్మవిద్వర వరీయ వరిష్ఠుల స్థితి ప్రకారము చెప్పుచున్నారము.

            బ్రహ్మవేత్తయైన వాఁడు తనకు కాలత్రయాబాధ్యత్వంబును ప్రపం చంబునకు స్వప్నతుల్యత్వంబును సర్వదా చూచుచు యజ్ఞాదికర్మంబులును అతిథి పూజనంబును సర్వధర్మంబులయిన సంధ్యావందనాది క్రియలును సర్వదా చేసికొనుచున్నప్పటికిని నేను సాక్షిని, ఏ కర్మమును చేసిన వాఁడను కాను, అహంకారాదులు తమతమ విషయంబులయందు ప్రవర్తించు చున్నవి. నేను అసంగుఁడను, నాకు సాక్షిత్వము కల్పితమని నిశ్చయించుకొని సకల వ్యవహారంబులును జేయుచుండును. వానికి బ్రహ్మవేత్త యనిపేరు.

            బ్రహ్మవిద్వరుని యొక్క స్థితి ప్రకారంబును జెప్పెదము : బ్రహ్మ విద్వరుండయినవాఁడు ఈ బాహ్య వ్యాపారంబులన్నియు దుఃఖదములని యెంచి వ్యాపారంబుల వలనఁ దనకు ప్రయోజనం బేమియు లేదని విచారించి యీ వ్యాపారమందంతర్ముఖుండయి నిద్రపోవు వానివలె నుండి కాలత్రయమందును ప్రపంచంబు తోఁచినప్పటికిని అది మిథ్య, నాకు సాక్షిత్వము కల్పితమని నిశ్చయించుకొని ముముక్షువులైన వారల కుపదేశము చేయుచు, అనివార్యములైన శౌచాన్న పానాది క్రియలయందును మాత్రము ప్రవృత్తిగలవాఁడై యున్నప్పటికిని సకల వ్యవహారంబులను అహంకారము చేసికొని పోవుచున్నది. తానొక కర్మమును చేసినవాఁడు కాఁడని నిశ్చయించు కొని బాహ్య వ్యాపారంబులను విడిచిపెట్టి సర్వదా యేకాంత నిష్టుఁడయి యుండును. వానికి వరుండని పేరు.

            వరీయుని యొక్క స్థితి ప్రకారంబుఁ జెప్పెదము : వరీయుఁడైన వాఁడు బాహ్య ప్రపంచంబంతయు దుఃఖప్రదమనియు, మిథ్యయనియు, నిశ్చయించి బాహ్యంబును విడిచిపెట్టి సర్వదా నిధిధ్యాసనపరుండై యుండి పరులచేత ప్రేరేపింపబడినవాఁడయి అన్నపానాది క్రియలను చేసినప్పటికిని సకల వ్యవహారంబులును అహంకారము చేత చేయఁబడుచున్నవనియు తానొక వ్యాపారంబును చేయలేదనియు, తాను సాక్షి ననియును, ఆ సాక్షిత్వం బునుం గల్పితమే యనియు, తాను అసంగుఁడు, దేనితోను తనకు సంబంధం లేదనియును నిశ్చయించుకొని సకల సంశయ రహితుఁడయి సర్వదా నిధిధ్యాసనపరుండయ్యే యుండుము. వానికి వరీయుఁడని పేరు.

            వరిష్ఠుని యొక్క స్థితి ప్రకారంబును జెప్పెదము : వరిష్ఠుఁడైన వాఁడు బాహ్యము సమస్తంబును మిథ్యయని తలంచి సకల సంశయ రహితుఁడై సర్వదా నిధిధ్యాసనపరుఁడై నిర్వికల్ప సమాధినిష్ఠుఁడై అంతర వ్యాపారంబును బాహ్య వ్యాపారంబును మఱచి స్వరూపానందమగ్నమయిన చిత్తంబు గలవాఁడై యుండును. వానికి స్వతః వ్యుత్థానంబును, పరతః వ్యుత్థానంబును లేదు. వానికి అన్నపానాది క్రియలు సర్వాత్మనా లేవు. అనేక పుణ్యకర్మ పరిపాకంబు వలన వానికి సమాధి సిద్ధించెను. కనుక వరిష్ఠుఁడని పేరు. ఈ నలుగురికిని ముక్తి సమానమే. అయితే వీరిటువలె నున్నందుకు ప్రయోజనమేమి యనిన కర్మంబు నానావిధంబులు గనుక, దృష్టాంత సౌఖ్యమే ప్రయోజనము. జ్ఞానులయిన వారలందఱును ఈ ప్రకారంబుగా నుండవలెనని చెప్పఁగూడదు. ఇందుకు ప్రమాణమేమి యనిన జనకుఁడు నిస్సంగుఁడై రాజ్యంబు చేసెననియు, జడభరతుం డసంగుఁడై యుండె ననినయును, శ్రీశుకులుపనయనాత్పూర్వమే సంసారమును త్యజించి యోగియై, వెడలిపోయె ననినయును, దూర్వాసులు తపోనిధియ య్యును వాసనారహితుఁడు కానందున కొందఱిని శపించి, కొందఱి నను గ్రహించు చుండెననియు స్మృతీతిహాస పురాణాదులు చెప్పుచున్నవి. కర్మంబు నానా విధంబులు గనుక జ్ఞానులందఱు నొకతీరుననే యుండరనుటయందు యీజనకాదులును బ్రమాణము.
వివేకులయినవారు ‘‘జ్ఞానులు ఇటువలె నున్నారు, అటువలె నున్నారు’’ అని సందేహపడవలసినది లేదు. వారియొక్క కర్మంబు ఎటువలె నుండునో అటువలెనే యుందురు. సందేహంబు లేదు. ఇది సిద్ధము.

ఇది సప్తత్రింశద్వర్ణకము.