16. చిజ్జడంబులకు లక్షణము

16.   చిజ్జడంబులకు లక్షణము

            చిల్లక్షణం బేదియనిన, ఒక సాధనంబు నేదియు నపేక్షింపక తానే తోఁచుచు తనయం దారోపింపఁబడిన పదార్థంబులను తోఁపింపఁజేయునది చిల్లక్షణము. జడలక్షణంబెద్దియనిన, తాను తోఁపక అన్య వస్తువును తోఁపింపఁజేయక యుండునట్టిది జడలక్షణము. ఇందుకు ఆదిత్యుండును ఆదిత్యునిచేత భాస్యమయిన ఘటంబును దృష్టాంతము. ఆదిత్యుని యందు చిల్లక్షణము గలదా? యనిన, దృష్టాంత మంతయు నేకదేశము గనుక, యేకదేశ దృష్టాంతమయిన ఆదిత్యునియందు చిల్లక్షణము కలదు. అది యెటులనిన, సూర్యుఁడు ప్రకాశాంతరము నపేక్షింపక తాను దోఁచుచు తన ప్రకాశమును సంబంధించుకొని యుండెడి ఘటమును తోఁపింపఁ జేయుచున్నాఁడు గనుక, ప్రకాశ స్వరూపుఁడయిన ఆ యాదిత్యునియందు చిల్లక్షణము కలదు. అయితే, ఘటంబునందు జడలక్షణంబుకలదు. అది యెటులనిన, ఘటము తాను తోఁపక అన్య వస్తువును తోఁపింపఁజేయ లేదు గావున ఘటంబునందు జడలక్షణము గలదు. ఆదిత్య లక్షణము ఘటంబునందును, ఘటలక్షణం బాదిత్యునియందును లేదు గనుక, ఆదిత్యునికిని ఘటమునకును శబ్దార్థ లక్షణ ప్రతీతి వ్యవహారంబులచేత నెటువలె వైలక్ష్యణ్య మున్నదో అటులే చిల్లక్షణము జడమయిన దేహేంద్రి యాదుల యందును జడలక్షణము చిత్తైన యాత్మయందును లేదు గనుక చిత్తునకు జడమునకు శబ్దార్థ లక్షణ ప్రతీతి వ్యవహారములచేతను వైలక్షణ్యము కలదు. ఇందువలన సిద్ధించుటేమియనిన, అప్రకాశ్య నిష్ఠమయిన వికారముల చేతను ప్రకాశ్యమయిన వస్తువునకు కాలత్రయంబులయందును సంబంధంబు లేదని సిద్ధించెను. అది యెటులనిన, అప్రకాశ్యఘటాదినిష్ఠమయిన ఛిద్రత్వాచ్ఛిద్రత్వంబుల వలన హానిలాభంబులును, సృష్టి మత్త్వా సృష్టిమత్త్వంబుల వలన ప్రత్యవాయాభ్యుదయంబులును, శ్లక్ష్ణత్వాశ్లక్ష్ణత్వంబుల వలన హర్ష విషాదంబులును, సమీచీనాసమీచీనత్వంబుల వలన నతిశయానతి శయత్వంబులును ప్రకాశ స్వరూపుండగు నాదిత్యు నెటుల స్పృశింపలేదో అటులే అప్రకాశ్య దేహాదినిష్ఠమైన వికారంబులును గుణంబులును ధర్మంబులును జాతినామాదులును వర్ణాశ్రమాదులును కర్తృత్వ భోక్తృత్వాదులును కామ క్రోధాదులును ప్రకాశ స్వరూపుండై సాక్షియై చిద్రూపుఁడయిన యాత్మను కాలత్రయంబులయందును స్పృశింపలేవని సిద్ధించెను. ఆనందబునకును దుఃఖంబునకును లక్షణం బెటులనిన నిరుపాధికమయి నిత్యమయిన సుఖస్వరూపత్వ మానందలక్షణము. తాపత్రయాత్మకమయిన క్లేశత్వము దుఃఖలక్షణము. ఇందుకు క్రొత్త మృత్కుంభములోని శీతలజలంబును, కంచుకుండలోని చింతనిప్పులును దృష్టాంతము. ఆ జలంబునం దానంద లక్షణము కలదు. అది యెటులనిన ఆతపంబుచేత కొట్టువడి తపించుచు వచ్చిన పురుషుం డాశీతల భాండమును స్పృశించి నేత్రముల నొత్తుకొనిన మాత్రము చేతనే వానియొక్క తాప మణఁగిపోవుచున్నది. అది జలము యొక్క యావేశమే కాని సాక్షాజ్జలము కాదు. ఈ జలావేశమునకే తాపనివర్తకత్వము ప్రత్యక్షంబుగఁగనుపడు చుండఁగా, నాజలపానముఁ జేసినచో సకలతాపంబులును పోవు ననునది సర్వానుభవసిద్ధంబగుట వలన ఆ జలంబునం దానంద లక్షణంబున్నది. చింతనిప్పులయందు దుఃఖలక్షణము కలదు. అది యెట్లన దాహతాపంబులు లేనివాఁడు ఆ చింత నిప్పులతో కూడుకొని యుండెడి కంచుభాండమును స్పృశించినట్లయిన ఆభాండనిష్ఠమయిన చింతనిప్పుల యొక్క ఆవేశము వానికి దాహతాపములను కలుగఁజేసి చేతులు బొబ్బలగునట్లు చేయుచున్నది. అది చింతనిప్పుల యొక్క యావేశమేగాని ప్రత్యక్షమగు నగ్ని కాదు. చింతనిప్పుల యొక్క యావేశము వలననే తాపము కలుగు చుండఁగా, నా చింతనిప్పులను స్పృశించినచో సమస్త ప్రాణులను భస్మము సేయు ననెడిది సర్వానుభవ సిద్ధము.  కనుక ఆ చింతనిప్పులయందు దుఃఖలక్షణంబు గలదు. ఇందుకే మఱియొక దృష్టాంతముఁ జెప్పెదము. అమృతంబునుం గాలకూటవిషంబును దృష్టాంతము. అమృతంబునం దానందలక్షణం బున్నదాయనిన, అమృతంబు తాను సుఖ స్వరూపమయి యుండి తన్ను పానంబొనర్చిన వారలకు నితరతిశయ సుఖంబు నిచ్చు చున్నది. కనుక ఆ యమృతంబునం దానందలక్షణం బున్నది. కాలకూట విషంబునందు దుఃఖలక్షణ బున్నదా యనిన, కాలకూట విషంబు తాను పాపాత్మకంబయి యుండి తన సమీపంబునొందిన వారలకు మిక్కిలి దుఃఖకరమయిన ప్రాణహానిని కలుగఁజేయుచున్నది. కనుక ఆ కాలకూట విషంబునందు దుఃఖలక్షణంబున్నది. అమృత లక్షణము కాలకూట విషంబునందును, కాలకూటవిష లక్షణం బమృతంబు నందును, జల లక్షణం బగ్నియందును, అగ్ని లక్షణంబు జలంబునందును లేదు గనుక జలాగ్నులకును అమృత కాలకూటవిషంబులకును శబ్దార్థ లక్షణ ప్రతీతి వ్యవహారములచేత అన్యోన్య వైలక్షణ్యమెటువలె నున్నదో, అటువలెనే ఆనంద సల్లక్షణము దుఃఖాత్మకమెనౖ దేహేంద్రియాది ప్రపంచంబునందును, భార్యా పుత్రాది ప్రపంచంబునందును లేదు. కాఁబట్టి ఈ దుఃఖలక్షణము సుఖ స్వరూపుఁడగు ఆత్మయందు లేదు. కనుకను ఆ యానందబునకును దుఃఖంబునకును శబ్దార్థ లక్షణ ప్రతీతి వ్యహారంబువలన నన్యోన్య వైలక్షణ్యము కలదు. ఇందువలన సిద్ధించెడి దేమియనిన, కాలకూటనిష్ఠమయిన తాపము, జలము నెటుల స్పృశింపలేదో అటులే దేహేంద్రియాది ప్రపంచ నిష్ఠమయిన తాపత్రయములు సుఖస్వరూపుఁడయిన ఆత్మను కాలత్రయ మందును స్పృశింప వనుట సిద్ధించెను.

            ఈ విచారమునకు ఫలమెయ్యది యనిన, రజ్జువువలె సద్రూపుఁడయి ఆదిత్యునివలె చిద్రూపుఁడయి జలామృతమువలె ఆనందస్వరూపుఁడయిన ఆత్మ సర్పమువలె ననృతమును, ఘటమువలె జడమును, అగ్ని కాలకూటవిషమువలె దుఃఖస్వరూపమునగు దేహేంద్రియాది ప్రపంచంబున కంటె విలక్షణుండని యెఱుంగుట ఫలము. ఇటుల నెవ్వరెఱుంగుచున్నారో వారు జీవన్ముక్తు లని వేదాంద సిద్ధాంతము.

            శ్లో||  అనేకావయవః స్థూల శ్శుక్లశోణితసంభవః
                       దేహస్సూక్ష్మస్తథా సప్తదశావయవలక్షణః
                       కారణం చాజ్ఞానసంజ్ఞో ఽనృతదుఃఖాత్మకా అమీ
                       తేభ్యో విలక్షణస్త్వాత్మా సత్యజ్ఞానాదిలక్షణః
                       ఆత్మలక్షణసత్యాదే స్తథాభిన్నో ఽనృతాదితః
                       పీయూషవిషవద్భాను భాండవద్రజ్జుసర్పవత్‌
                       ఇతి యస్తు వినిచ్యేత విజానాతి పునఃపునః
                       స సంసారా ద్విముక్తస్స్యాత్‌ నాన్యథా కర్మకోటిభి

ఇది అష్టమ వర్ణకము