29. ఆధ్యాత్మికాధిభౌతికాధిదైవికములు

ఏకవింశతి వర్ణకము
29. ఆధ్యాత్మికాధిభౌతికాధిదైవికములు

            ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవికములను విచారించుచున్నారము. శ్రోత్ర మధ్యాత్మంబు. దీనికి అధిభూతము శబ్దంబు. దిక్కు లధిదైవతములు. త్వక్కు ఆధ్యాత్మంబు. దీని కధిభూతము స్పర్శంబు. వాయువధిదైవతంబు. చక్షుస్సు ఆధ్యాత్మము. దీనికి అధిభూతము రూపము. సూర్యుడు అధి దైవతము. జిహ్వ ఆధ్యాత్మము. దీనికి అధిభూతము రసము. వరుణు డధి దైవతము. ఘ్రాణ మధ్యాత్మము. దీనికి అధిభూతము గంధము. అశ్వినీ దేవత లధిదైవతములు. వాక్కు అధ్యాత్మము. దీనికి అధిభూతము పలుకు. అగ్ని యధిదైవము. హస్తము లధ్యాత్మము. దీనికి అధిభూతము దానము. ఇంద్రుఁడధిదైవతము. పాదము లధ్యాత్మము. దీనికి గమన మధిభూతము. ఉపేంద్రుఁడధిదైవతము. వాయువు అధ్యాత్మము. దీనికి విసర్గ మధిభూతము. మృత్యు వధిదైవతము. ఉపస్థ మధ్యాత్మము. దీనికి ఆనంద మధిభూతము. ప్రజాపతి యధిదైవతము. మనస్సు అధ్యాత్మము. దీనికి సంకల్పమధి భూతము. చంద్రుఁడధి దైవతము. బుద్ధి యధ్యాత్మంబు. దీనికి నిశ్చయమధి భూతంబు. చతుర్ముఖు డధిదైవతము. చిత్త మధ్యాత్మంబు. దీనికి స్మరణ మధిభూతము. క్షేత్రజ్ఞుఁడధిదైవతము. అహంకార మధ్యాత్మంబు. దీనికి అభిమాన మధిభూతంబు. రుద్రుఁడధి దైవతము. మనస్సు అధ్యాత్మంబు. దీనికి వికార మధిభూతము. ఈశ్వరుఁడధి దైవతము. ఇవియన్నియును గూడి జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు. వీనికి సాక్షియైన ఆత్మ నేనని యెవఁడెఱుగుచున్నాఁడో వాఁడే ముక్తుఁడని వేదాంత సిద్ధాంతము.

ఇది ఏకవింశతి వర్ణకము.