35. శ్రవణ మనన నిధిధ్యాసన నిరూపణము

సప్తవింశతి వర్ణకము
35. శ్రవణ మనన నిధిధ్యాసన నిరూపణము

            శ్రవణ మనన నిధిధ్యాసనంబులను నిరూపించుచున్నారము. శ్రవణ మనగా సమస్తమైన వేదాంతంబులకును షడ్విధలింగంబులచేతను బ్రహ్మ స్వరూపమయిన ఆత్మయందు తాత్పర్యమని బుద్ధియొక్క నిశ్చయమే శ్రవణ మని చెప్పఁబడును. మననమనఁగా శ్రుత్యర్థమును విని ఆ యర్థంబును యుక్తులచేతను ఏక వాక్యముచేత చింతించుట మననమని చెప్పఁబడును. నిధిధ్యాసనమనఁగా విజాతీయములైన కామక్రోధాదులను విడిచి సజాతీయ మయిన అహం బ్రహ్మస్మియనెడి నిరంతర చింతనము నిధిద్యాసమని చెప్పఁబడును. వీనికి ప్రయోజనం బెయ్యది యనిన, సర్వదా శ్రవణంబు చేయుట చేత సకల సంశయంబులును నశించును. మననము అసంభావ నలను పోఁగొట్టును. సర్వదా నిధిద్యాసనము విపరీత భావనంబును బోగొట్టును. ప్రతిబంధ బాహుళ్యంబు గలవానికి సర్వదా మూఁడునుం జేయవలయు. ప్రతిబంధ నివృత్తులయిన సూక్ష్మబుద్ధి గలవారికి శ్రవణ కాలమందే మనన నిధిధ్యాసనంబులు సిద్ధించును. అది యెటువలె ననిన, బుద్ధిశాలియైనవాఁడు గురువుల దగ్గర పాఠము చదివేటప్పుడు యుక్తుల చేతను వాక్యార్థాలోచన చేసి అర్థము నేకము చేయును గనుక, అదే వానికి మనన మాయెను. చిత్తము విషయములయందు బోనీయక శ్రవణ మనన నిధిధ్యాసనంబులు పలుమాఱును చేయవలెను. ఎవఁడు సూక్ష్మబుద్ధి గలిగి ప్రతిబంధంబులు లేనివాఁడయి యున్నాఁడో, వానికి శ్రవణ కాలమందే మనన నిధిధ్యాసనంబులు సిద్ధించును. ఈ యర్థమందు సంశయంబు లేదు.

ఇది సప్తవింశతి వర్ణకము.