42. సంచిత ప్రారబ్ధాది నిరూపణము

చతుస్త్రింశద్వర్ణకము
42. సంచిత ప్రారబ్ధాది నిరూపణము

            సంచితప్రారబ్ధాగాములను వానికి నాశనంబులును దృష్టాంత పూర్వకంబుగా నిరూపించుచున్నారము. ఆ దృష్టాంత మెయ్యది యనిన, ఒక ప్రాణికి పది క్షేత్రంబులు గలవు. ఈ పది క్షేత్రంబులును తానే పైరు పెట్టు కొనును. క్షేత్రమొకటి వేయితూముల లెక్కను సంవత్సరంబునకు పదివేల తూములు పండును. అందులో వేయి తూములు ఇంటిలో గ్రాసంబునకు పట్టును. ఏనూఱు తూములు విత్తనము కట్టును. మఱియు నేనూఱు తూములు ధర్మవ్యయము చేయును. వేయి తూములు వ్యవసాయంబునకు సెలవు చేయును. వేయి తూములు కప్పమునకై అమ్మును. ఈ ప్రకారంబుగా సెలవు అయినది పోగా సంవత్సరంబునకు ఆఱువేల తూముల వడ్లు మిగులును. ఈ మిగిలిన ధాన్యంబును పదిలము చేయును. ఈ ప్రకారంబుగా ప్రతి సంవత్సరంబును మిగిలిన ధాన్యంబును చేర్చిపెట్టి హెచ్చుధర కలిగినప్పుడు అమ్ముదమని యుండును. ఆ ధాన్యంబునకు సంచితంబని పేరు. ఇంటి గ్రాసంబునకు నిలిపిన వేయి తూముల ధాన్యంబునకు ప్రారబ్ధమని పేరు. పెద్ద పైరు, మొలకపైరు, ఎన్ను పైరు, పండినపంట, వీనికి ఆగామియని పేరు. ఇటులుండగా ఒక సమయమందు కలహంబు ప్రాప్తమయ్యెను. ఆ సమయంబునందు పరులు సంచితమయిన ధాన్యంబు నంతయుఁగొని పోయిరి. రాఁబోవు పంటను కొల్లగాండ్రు కొనిపోయిరి. పైరంతయు అశ్వములు మొదలైన వానిచే మేపిరి. అంతట యజమానుఁడు విచారపడినవాఁడై గృహమందున్న పదార్థంబులను దాఁచి వానిని భుజించుచుండెను. ఇట్లుండఁగా బంధువులందఱును గ్రాసమునకేమి చేసెదవని యడిగినచో సంచితంబు బహుదినములుగా నుండెను. ఆ సంచితంబు నంతయు పరరాష్ట్రంబు వారు గొనిపోయిరి. రాఁబోవు పంట కొల్లగాండ్ర పాలాయెను. పైరంతయు అశ్వంబులు మొదలైనవి మేసిపోయె. గృహంబునందును కొంత పదిలము చేసు కొని యుంటిని. దాని భుజించి తీరవలెనని చెప్పెను.

            ఇందువలన నేమి చెప్పఁబడినట్లాయె ననిన, ఆగామి సంచితంబులకు నాశనము చెప్పినట్లాయెను. ప్రారబ్ధంబును భుజియించి తీరవలెనని చెప్పినట్లాయెను. ఇటుల దృష్టాంతమందు సంచిత ప్రారబ్ధా గాములు. ఇటులనే దార్షా  ్టంతికమందును సమస్త ప్రాణులకును సంచిత ప్రారబ్ధాగాములను స్పష్టంబుగా నిరూపించుచున్నారము. అది యెటులనఁగా లోకమందు అనాదియైన జీవుఁడు పుణ్యపాపకర్మంబులను చేసికొనుచు వచ్చును. ఇట్లు చేసికొనుచు రాఁగా నొకదినమందు చేసిన పుణ్యపాప కర్మమే బహు జన్మంబులకు కారణమయి యుండును. అటువలె జన్మావధి చేసికొనుచు నుండును. ఆయా పుణ్యపాపకర్మంబులన్నియు రాసులు రాసులుగా కూడును. వీనికి సంచితమనిపేరు. అటు తరువాత మరణంబును పొందును. మరణంబు పొందిన తరువాత తిరుగా జన్మ మెత్తు నిమిత్తమయి ఆసంచితంబులో కొంత గ్రహించుకొనును. ఆ సంగ్రహంబుబగు కర్మంబు భావి శరీరంబునకు కారణంబులయిన పంచీకృత పంచమహాభూతంబుల శరీరాకారంబుగా పరిణమింపఁజేసి యా శరీరంబు చేత కొన్ని కర్మంబులను చేసి యాకర్మముల వలనఁ గొన్ని సుఖ దుఃఖంబుల ననుభవించును. దీనికి ప్రారబ్ధమని పేరు. ఈ ప్రారబ్ధంబును అనుభవించు కొనుచు మరణ పర్యంతంబును చేసిన పుణ్యపాపంబులకు నాగామియని పేరు. ఇదియు నా సంచితంబుతోఁ గూడును. ఈ ప్రకారముగా జీవుఁడు అనాదిగా కర్మంబులఁ జేయుచురాఁగా సంచితము వృద్ధిఁ బొందుచు వచ్చును. కాఁబట్టి జీవుల యొక్క జన్మంబులకు అవధి లేదు. అయితే ఈ జన్మంబులకవధి యెప్పుడు వచ్చుననఁగా, ఈ ప్రకారముగా కర్మంబులు చేయుచు రాఁగా నొక జన్మమందొక పుణ్య కర్మ పరిపాకము వలన దీనికి సంసారంబు రాకుండఁ జేసుకోవలెనని వివేకంబు పుట్టును. ఇది యెటువలె ననఁగా, తనకు కామ్యకర్మంబులను జేయుట వలన చిత్తశుద్ధి రానేరదు. సంసారంబు పోనేరదని విచారించి కామ్య కర్మంబులను విడిచి, విహితములైన కర్మంబుల నీశ్వరార్పణంబుగాఁ జేయవలయునను వివేకంబు పుట్టును. ఆ కర్మంబుల వలన భక్తి కలుగును. భక్తి ద్వారా చిత్తశుద్ధి జనించును. చిత్తశుద్ధి ద్వారా సద్గురు లాభమగును. పిదప సద్గురువులయొద్ద నుండుకొని శుశ్రూష చేయుచు శ్రవణమనన నిధిధ్యాసంబుల నెల్లఁ జేయు చుండును. ఈ ప్రకారంబుగాఁ జేసి జ్ఞానంబు సంపాదించును. అప్పుడు జ్ఞానాగ్ని చేత నజ్ఞానంబు దగ్దమైపోవును. అజ్ఞాన మెప్పుడు పోవునో అప్పుడే అజ్ఞాన కార్యంబులైన సంచితకర్మంబులన్నియు దగ్గమై పోవును. జ్ఞానము వచ్చిన తర్వాతను చేయఁబడిన పుణ్యపాపంబులు అకర్తయైన వీనిని స్పృశింప లేవు. అయితే ఆ పుణ్యపాపంబులకు గతి యేది యనిన, ఈ జ్ఞానిని నెవఁడు భూషించుచున్నాఁడో వాఁడు పుణ్యమును కొనిపోవును. ఎవఁడు దూషించుచున్నాఁడో వాఁడు పాపంబును గొనిపోవును. ప్రారబ్ధంబు భుజించి తీరవలెను.
            ఈ యర్థమందు సమ్మతి వచనంబులు :

      శ్లో||  ప్రారబ్ధం భోగతో నశ్యేత్తత్త్వజ్ఞానేన సంచితమ్‌
            ఆగామి ద్వివిధం కర్మ తద్ద్వేషి ప్రియవాదినః

            ఈ ప్రకారంబుగా సంచిత ప్రారబ్ధాగాములను కూలంకషంబుగా విచారించి, యీ సంచిత ప్రారబ్ధాగాములు అహంకారంబునకే కాని, అహం కార సాక్షియైన తనకు లేవని యెవఁడెఱుఁగుచున్నాఁడో వాఁడే ముక్తుఁడని వేదాంత సిద్ధాంతము.

ఇది చతుస్త్రింశద్వవర్ణకము.