40. పంచభ్రమ నిరూపణము

ద్వాత్రింశద్వర్ణకము
40. పంచభ్రమ నిరూపణము

            పంచభ్రమలను నిరూపించుకొనుచున్నాము : ప్రత్యగాత్మ వేఱు పరమాత్మ వేఱునని యనుకొనుట, ఆత్మయందు ప్రతీయమానమగు కర్తృత్వా దులు వాస్తవముగా ఆత్మవే యని అనుకొనుట, శరీరత్రయమునకు విలక్షణుఁడగు ఆత్మకు శరీరత్రయముతో సంబంధముకలదని యనుకొనుట, జగత్కారణమగు బ్రహ్మమునకు షడ్భావ వికారములు ఉన్నవని అనుకొనుట, కారణము (బ్రహ్మము) కంటె భిన్నమగు కల్పిత ప్రపంచము సత్యమని అనుకొనుట, ఇవి పంచభ్రమలనబడును. ఈ భ్రమలకు నివృత్తి యెట్లన, దర్పణమందలి ముఖ ప్రతిబింబము కంఠస్థముఖముకంటె భిన్నము కాదనియు, శుద్ధమగు స్ఫటికమునకు రక్త కాంతిగల పుష్పాదుల చేరిక వలన స్ఫటికమఁదు దోఁచు రక్తిమ నిజము కాదనియు, ఘటమఠాదుల యందుగల ఆకాశము, మహాకాశము కంటె భిన్నము కాదనియు, రజ్జువందు భ్రమచే గల్పింపఁబడిన సర్పము మిథ్యయై, కారణమగు రజ్జు మాత్రమే సత్యమైనటుల జగత్కారణమగు బ్రహ్మము నిర్వికారియనియు, మనఃకల్పితమగు గంధర్వనగరము వలెనే, భ్రమమూలమగు దృశ్య ప్రపంచము సత్యము కాదనియుఁ దెలిసికొనుట వలన నీపంచభ్రమలు నివర్తించును.

ఇది ద్వాత్రింశద్వర్ణకము.