18. పంచకోశ వివరణ ప్రకరణము

దశమ వర్ణకము
18.పంచకోశ వివరణ ప్రకరణము

        శ్లో||  కింరూపాః పంచకోశాస్స్యుః కా వా తద్వ్యతిరిక్తతా
                 ఆత్మ వచ్చేతి తత్సర్వం సదృష్టాంతం విచార్యతే

            ఆత్మ పంచకోశవ్యతిరిక్తుఁడని శ్రుతులు చెప్పుచున్నవి. కనుక పంచ కోశముల నెఱుంగకయే పంచకోశవ్యతిరిక్తమయిన ఆత్మ నెఱుంగఁ గూడదు గాన, ముందు పంచకోశ స్వరూపమును విచారింపుదము. అది యెటు లనఁగ, పంచకోశములనఁగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములని యైదువిధంబులు. వీనియం దన్నమయకోశ మనఁగా, అన్నమువలన జన్యమై స్తంభమువలె స్థూలమైన కరచరణాద్యవయవాకారమై షడ్భావ వికారమై షట్కోశాత్మకమై తోఁచునట్టి స్థూల శరీరము అన్నమయకోశ మని చెప్పఁబడును. ప్రాణమయకోశమనఁగా కర్మేంద్రియంబు లైదును, ప్రాణము లైదును. ఈ పదియునుంగూడి ప్రాణమయకోశమాయెను. మనోమయకోశమనగా మనస్సును, జ్ఞానేంద్రియంబులైదును, ఈ యారునుంగూడి మనోమయకోశమాయెను. విజ్ఞానమయకోశమనఁగా బుద్ధియును, జ్ఞానేంద్రియంబు లైదును. ఈ యాఱునుంగూడి విజ్ఞానమయకోశమాయెను. ఆనందమయకోశ మనఁగా ప్రియ మోద ప్రమోదవృత్తిమత్తై, అజ్ఞాన ప్రధానమైన అంతఃకరణము ఆనందమయకోశమని చెప్పఁబడును. ప్రియ మోద ప్రమోదములనఁగా ఇష్టమైన వస్తువును చూచినమాత్రముననే వచ్చునట్టి సంతోషమునకు ప్రియమని పేరు. ఆ చూచిన వస్తువు లభించిన తర్వాత వచ్చిన సంతోషంబు నకు మోదమని పేరు. ఆ లభించిన వస్తువు ననుభవించిన తర్వాత వచ్చిన సంతోషమునకు ప్రమోదమని పేరు.

            వీనికి కోశములను పేరు ఎందుకు వచ్చినదనిన, కోశములు ఆత్మ నెఱుఁగనీక కప్పుచున్నవి గనుక, వీనికి కోశములని పేరు. ఇందుకు దృష్టాంతము : ఖడ్గమును ఒఱ కప్పినట్టును, తంబురను గవిసెన కప్పి నట్టును, పసిరికెపురుగును పసిరికెతిత్తి కప్పినట్టును, చింతగుల్ల చింత పండును గప్పినట్టును, ఆత్మను పంచకోశంబులును గప్పియున్నవి గాన  వీనికి కోశములని పేరు వచ్చెను. అయితే ఈ దృష్టాంతమందు ఒఱయుం కత్తియును, గవిసెనయుం దంబురయును, పసిరికెత్తియుం జంతువును, చింతగుల్లయుం జింతపండును, పరిచ్ఛిన్నంబు లగుటవలనను సమాన సత్తాకంబులు కావు గనుకను, ఒకటి నొకటి యుపజీవించుకొని యుండలేదు గనుకను, ఆ యొర మొదలైన పదార్ధంబులు కప్పునట్టి వగును. దార్షా ్టంతికమందైతే సమాన సత్తాకములు కావు గనుకను, ఆత్మ సత్తనుపజీవించు కొని తోఁచెడి పంచకోశములు ఆత్మను కప్పుట కెటుల సమర్థములగు ననిన, ఆదిత్య కిరణపరిణామ విశేషమైన మేఘంబు లాయాదిత్యుని నెటుల కప్పుచున్నవో, అగ్నిసత్త నుపజీవించుకొని తోఁచెడి ధూమం బగ్ని నెటుల కప్పుచున్నదో రజ్జుసత్తనుప జీవించుకొని తోఁచెడి సర్ప మారజ్జువు నెటుల కప్పుచున్నదో, మృత్సత్త నుపజీవించుకొని తోఁచెడి ఘటము మృత్తు నెటుల కప్పుచున్నదో, స్వర్ణసత్త నుపజీవించుకొని తోఁచెడి కుండలంబు లాస్వర్ణము నెటుల కప్పుచున్నవో అటులనే ఆత్మసత్త నుపజీవించుకొని తోఁచెడి పంచ కోశంబులును ఆత్మను కప్పవచ్చును. ఇటువలె పంచకోశంబులును ఆత్మను కప్పును గాన వీనికి కోశములని పేరు చెప్పవచ్చును.

            అయితే ఆత్మకు సంకోచవ్యతిరిక్తత్వ మెటు లనిన దృష్టాంతమందు ఖడ్గము మొదలగునవియును, ఒర మొదలగునవియును ఏకముగా వ్యవహ రింపఁబడునవియై తోఁచినప్పటికిని ఆఖడ్గాదులు ఒఱ మొదలైనవాని కంటె భిన్నంబులయి యెటుల దోఁచుచున్నవో అటులనే ఆత్మయును పంచ కోశంబులు నేకముగా వ్యవహరింపఁబడునవియై తోఁచినప్పటికిని ఆత్మ కాలత్రయమందును పంచకోశంబులకంటె వ్యతిరిక్తుఁడయి తోఁచుటయే  పంచకోశ వ్యతిరిక్తత్వము. పంచకోశంబులతోఁ గూడియుండెడిది ఆత్మను గదా, పంచకోశవ్యతిరిక్తుఁడని చెప్పవలెను? ఈ యాత్మకు పంచ కోశములతో  కూటమి కలదు. ఆ కూటమి యెందుచేత వచ్చిన దనిన, అన్యోన్యాధ్యాసచేత వచ్చినది. అన్యోన్యాధ్యాస యేదియనిన, ఒక వస్తువు నందలి ధర్మము మరి యొక వస్తువునందు తోఁచుట అన్యోన్యాధ్యాసము. అన్యోన్యాధ్యాస ద్వారా పంచకోశములకును ఆత్మకును కూటమి కలదు. అది యెట్లనిన, అన్నమయ కోశమునకును ఆత్మకును అధ్యాస ద్వారా కూటమి వచ్చిన ప్రకారమును సంక్షేప రూపంబుగాఁ జెప్పెదము. జీవ సామాన్య జాతివికార లింగవర్ణ విశేష జాత్యాశ్రమనామరూప సంస్కార వేషక్రియాది ద్వారా కూటమి వచ్చినది. అది యెట్లనిన, నేను జీవుండనని జీవాధ్యాసము. నేను మనుష్యుండనని సామాన్యజాత్యధ్యాసము. నేను పుట్టి పెరిగియుండి యింతపొడవై క్షీణించి నశించిపోవుచున్నాననియెడి వికారముద్వార వికారా ధ్యాసము. నేను పురుషుండను, స్త్రీని యని లింగముద్వారా లింగాధ్యాసము. నేను బ్రాహ్మణుండ, క్షత్రియుండ, వైశ్యుండ, శూద్రుండ నని వర్ణముద్వారా వర్ణాధ్యాసము. నేను తెలుఁగువాఁడను, అరవవాఁడను, కన్నడవాఁడను, వెలనాఁటివాడను, వేగినాఁటివాఁడను, మురికినాఁటివాఁడు, పాకనాఁటివాఁడను, నియోగివాఁడను, గుజరాతివాఁడను, మహారాష్ట్రుఁడను, నేను కాశ్యప గోత్రిని, భారద్వాజ గోత్రిని, ఆశ్వలాయన సూత్రము గలవాఁడనుఆపస్తంబ సూత్తము గలవాడను, బోధాయన సూత్రము గలవాడను, కాత్యాయన సూత్రము గలవాఁడనని విశేష జాతిద్వారా విశేష జాత్య ధ్యాసము. నేను బ్రహ్మచారిని, గృహస్థుండను, వానప్రస్థుండను, సన్యాసిని యని ఆశ్రమముద్వారా యాశ్రమాధ్యాసము. నేను కృష్ణాదాసుఁడను, రామదాసుఁడను, ఎల్లంభట్టను, తిప్పంభట్టను, పోలంభట్టను, నల్లని వాఁడను, ఎఱ్ఱనివాఁడ నని నామరూపముద్వారా నామరూపాధ్యాసము. నేను దీక్షితుఁడను, సోమయాజిని, ప్రతివసంత యాజిని, మహావ్రతయాజిని, వాజపేయయాజిని, పౌండరీకయాజినని సంస్కారముద్వారా కర్మాధ్యాసము, నేను మాయావాదిని, సత్యవాదిని, విశిష్టా ద్వైత వాదిని, పరమ భాగవతుఁడను, శైవుఁడను, శాస్త్రజ్ఞుఁడను, పౌరాణికుఁడను, యోగీశ్వరుఁడను, గంగా యాత్ర చేసినవాఁడ నని వేషము ద్వారా వేషాధ్యాసము. నేను ఉపాధ్యాయుఁడను, శిష్యుఁడను, భక్తుఁడను, యాజ్ఞికుఁడను, జ్ఞానిని, పెండ్లి కుమారుఁడను, వడ్లవాఁడను, కుమ్మరివాఁడను, మంగలవాఁడను, చాకలివాఁడను, మణియగాఁడను, కరణమువాఁడనని క్రియద్వారా క్రియాధ్యాసము. ఇవి మొదలైన అన్నమయకోశనిష్ఠములయిన ధర్మములు ఆత్మయందును, ఆత్మ నిష్ఠమయిన సచ్చిదానంద లక్షణంబులు స్థూలంబుగాఁ దోఁచెడి అన్నమయ కోశంబునందును దోఁచుచున్నవి గాన, ఈ అన్యోన్యాధ్యాసము చేతను అన్నమయకోశంబునకును ఆత్మకును కూటమి వచ్చినది.

            ప్రాణమయకోశమునకును ఆత్మకును కూటమి యెట్లనిన, అధ్యాస పూర్వకముగానే వచ్చినది. అది యెట్లనిన, నేను క్షుత్పిపాసలు గల వాఁడను, శక్తి వీర్యబలములు గలవాఁడను, వక్తను, దాతను, మూగను, పంగు వును ననునివి మొదలయిన ప్రాణమయకోశనిష్ఠమయిన ధర్మంబు లాత్మ నిష్ఠములుగాను, ఆత్మనిష్ఠములయిన సచ్చిదానంద ధర్మములు, ప్రాణమయ కోశనిష్ఠములుగాను ప్రాణము లెస్సగాఁ దోఁచుచున్నదని ప్రాణమయ కోశంబునందును తోఁచుచున్నది గనుక, ప్రాణమయకోశంబునకును ఆత్మకును అన్యోన్యాధ్యాసచేత కూటమి వచ్చినది.

            మనోమయకోశంబునకు అన్యోన్యాధ్యాసము ఎట్లనిన, నేను సంకల్ప వాసిని, వికల్పవాసిని, శోకిని, మోహిని, కామిని, క్రోధిని, ద్వేషిని, శ్రోతను, స్రష్టను, ఇచ్ఛగలవాడను, రసయితను, ఘ్రాతను, బధిరుఁడను, అజిహ్వుం డను, కారణుండను, విగతనాసికుండనను నివి మొదలయిన మనోమయ కోశనిష్ఠమయిన సంకల్పాదిధర్మంబులు ఆత్మయందును, ఆత్మధర్మంబు లయిన సచ్చిదానందంబులు మనస్సున లెస్సగాఁ దోఁచుచున్నవని మనోమయకోశంబునందును తోఁచుచున్నది. కాఁబట్టి మనోమయకోశంబు నకును ఆత్మకును అన్యోన్యాధ్యాసము చేత కూటమి వచ్చినది.

            విజ్ఞానమయకోశంబునకును ఆత్మకును అన్యోన్యాధ్యాసము చేత కూటమి యెటుల వచ్చిన దనిన, నేను కర్తను, నిశ్చయవాసిని, బుద్ధిమంతు డను, ఊహాపోహాచతురుఁడను, ఏకసంథాగ్రహిని, శ్రోత్రియుఁడను, విరక్తుఁడను, పండితుఁడను, లోకాంతరంబునకుఁ బోవువాఁడనని విజ్ఞానమయ కోశనిష్ఠమయిన ధర్మంబు లాత్మయందు ఆత్మధర్మంబులైన సచ్చిదానందం బులు బుద్ధిని లెస్సగాఁ దోఁచుచున్నవని విజ్ఞానమయకోశంబునందును తోఁచుచున్నది గనుక విజ్ఞానమయకోశంబునకును ఆత్మకు నన్యోన్యా ధ్యాసము చేత కూటమి వచ్చినది.

            ఆనందమయకోశంబునకును ఆత్మకును కూటమి యెట్లు వచ్చిన దనిన, నేను భోక్తను, అసంతుష్టుండను, సుఖిని, సాత్వికుఁడను, రాజసుఁడను, తామసుఁడను, అజ్ఞుఁడను, మూఢుఁడను, భ్రాంతుఁడ నను నివి మొదలగు నానందమయకోశ ధర్మంబులగు అజ్ఞానము ఆత్మయందును, ఆత్మధర్మంబులగు సచ్చిదానందంబులు లెస్సగాఁ దోఁచుచున్నవని ఆనందమయకోశనిష్ఠముగాఁ దోఁచుచున్నది. కాఁబట్టి ఆనందమయ కోశంబునకును ఆత్మకును అన్యోన్యాధ్యాసముచేత కూటమి వచ్చినది. ఈ అభ్యాసము చేత ఆత్మకు పంచకోశములతో కూటమి వచ్చెను గనుక, పంచకోశముల కంటె ఆత్మకు పృథక్పర్చి యెఱుంగవలసి వచ్చెను. అయితే పంచేంద్రియక్రమం బెట్లనిన, దృష్టాంతపూర్వకముగా నెఱింగించు చున్నారము.

            నా యావు, నా దూడ, నాభార్య, నాపుత్రుఁడు అని తన్ను సంబంధించుకొని తోఁచు పశ్వాదులు తానెటుల కాఁడో అటులనే దార్ష్టాంతిక మందును నా శరీరము నా ప్రాణము నా మనసు నా బుద్ధియని తన్ను సంబంధించుకొని తోచు పంచకోశంబులును తాను కాఁడు. పంచ కోశంబులకంటె వ్యతిరిక్తుండనే యెఱుంగవచ్చును. దృష్టాంతమందు ఆవు బలిసియున్నది. దూడ చిక్కిపోయినది. కోడె బ్రతుకదు. కుమారుఁడు చెప్పినట్లు వినలేదు. భార్య యింటికి స్వతంత్రురాలయినను బిడ్డలు లేనిది. నాయర్థము నెవరికిని సెలవు సేయకుము. అవి తనకు హితమయిన కార్యము లొకటియును సేయలేదు. కొమార్తె మిక్కిలి మూఢురాలై యున్నది.  నా కుమారుఁడు దుర్బీజుఁడై యున్నాఁడు అను నివి మొదలైన పశ్వాది నిష్ఠవికారములును విషయములును తన్ను ఎటుల స్పృశింపలేవో అటుల దాష్ట్రాంతికమందును అన్నమయకోశనిష్ఠమైన జీవత్వమానుషత్వాది వికారంబులును, ప్రాణమయకోశనిష్ఠమైన క్షుత్పిపాసాదివికారంబులును మనోమయకోశనిష్ఠమైన సంకల్పాది వికారంబులును, విజ్ఞానమయకోశ నిష్ఠమైన కర్తృత్వాది వికారంబులును, ఆనందమయకోశనిష్ఠమైన భోక్తృత్వాది వికారంబులును పంచకోశవ్యతిరిక్తుఁడును సాక్షియునైన తన్ను (ఆత్మను) కాలత్రయంబునందును స్పృశింపలేవు. ఇటుల ప్రత్యేకించి యెఱుంగునది పంచకోశవ్యతిరిక్త జ్ఞానము.

            పంచకోశవ్యతిరిక్త జ్ఞానము రావచ్చునా యనిన, రావచ్చును. ఎటువలె రావచ్చుననిన, అధ్యయన కాలంబునందు అధ్యయనము చేయు పురుషులచేత ఉచ్ఛరింపఁబడి కూడుకొని పుట్టిన శబ్దంబులను పంచుటకు వశము గాకున్నప్పటికిని విచారించి వివేక యుక్తమయిన బుద్ధి చేతను ఇది దీని శబ్దము, ఇది దీని శబ్దముఅని యెటుల యెఱుంగుచున్నాఁడో, జలముతో కూడుకొని యుండెడి ఉష్ణత్వమును తనచేత పంచుటకు వశము గాక పోయినప్పటికిని త్వగింద్రియము చేత స్పృశించి వివేక యుక్తమయిన బుద్ధి చేతను జలంబును ఉష్ణత్వంబును ప్రత్యేకంబుగా నెటుల  యెఱుంగు చున్నాఁడో, గోడయందు వ్రాయఁబడిన చిత్తరువులోని నీలపీతాది రూపంబు లను పంచుటకు శక్యము గాకపోయినను చక్షురింద్రియము చేత చూచి వివేకయుక్తమయిన బుద్ధిచేత ఇది గోడయనియు, దీనియందుఁ దోఁచెడి చిత్తరు ప్రతిమలు నీలపీతాదులనియు నెటువలె నెఱుంగుచున్నాఁడో, జలముతోఁ గూడుకొని యుండెడి ఉప్పు, పులుసు, తీపు మొదలయిన రసములను పంచుటకు శక్యముగాకపోయినను రసనేంద్రియంబు వలన ననుభవించి వివేకయుక్తమయిన బుద్ధిచేత ఇది ఉప్పు, ఇది పులుసు, ఇది తీపు, ఇది వగరు, ఇది చేదు, ఇది కారము అని ప్రత్యేకంబుగా నెటుల యెఱుఁగు చున్నాఁడో, వస్త్రము నాశ్రయించుకొని యుండెడి గంధ విశేషములను పంచుటకు శక్యము గాకపోయినప్పటికిని ఘ్రాణేంద్రియము చేత నాఘ్రాణముచేసి వివేకశీలమయిన బుద్ధిచేత నిది సుగంధమిది దుర్గంధమని గంధ విశేషములను ప్రత్యేకంబుగ నెటు లెఱుంగుచున్నాడో, అటులనే దాష్ట్రాంతికమందును పంచకోశంబుల నున్నవానితోఁ గూడుకొని యుండెడి ఆత్మను పంచుటకు శక్యముగాక పోయినప్పటికిని వివేక యుక్తంబగు బుద్ధిచేత పంచకోశస్వరూపంబు లిట్టివనియు ఆత్మస్వరూప మిట్టిదనియు విచారించిన యెడల పంచకోశంబులతోడ ఆత్మకు కాల త్రయంబుల యందును సంబంధంబు లేదని ప్రత్యేకంబుగా విభజించి యెఱుఁగవచ్చును.

            ఇంత పర్యంతంబును వ్యవహార కాలంబునందు పంచకోశంబుల నొక్కొక్క వస్తువుగాఁ బెట్టుకొని ఆత్మను పంచకోశంబులకంటె వ్యతిరిక్తుఁడని వివేచించి యెఱిఁగెడి ప్రకారమును చెప్పితిమి. వస్తుతః విచారించు నప్పుడు రజ్జ్వాదులయం దారోపింపఁ బడిన సర్పాదులు రజ్జ్వాది వ్యతిరిక్త ముగా నెట్లో, అటులనే ఆత్మయం దారోపింపఁబడిన పంచకోశంబులును అధిష్ఠానంబగు ఆత్మకంటె వ్యతిరిక్తముగా లేవు. అయినచో నీదృష్టాంత మందు రజ్వాదిజ్ఞానము వచ్చినతర్వాత సర్పాది ప్రతీతి యెటుల లేదో అటులనే దార్షా ్టంతికంబునందును ఆత్మజ్ఞానము వచ్చిన తర్వాత ఆత్మ పంచకోశముల యొక్క ప్రతీతి రాకపోవలెను. అటుల రాలేదు గనుక ఆరోపితంబులగు పంచకోశంబులు నధిష్ఠానమయిన ఆత్మకంటె వ్యతిరిక్తం బుగ లేవనుట బుద్ధి కెటువలె ద్రఢిమ కలుగుననిన, కలుగును. అది యెట్లనిన, మరుమరీచికలయందు జలభ్రాంతి వచ్చిన వెనుక ఆ జలమందు పానాది క్రియలను చేయవలెనని వర్తించిన పురుషుఁడు విచారించి, ఇది జలముగాదు మరుమరీచికలని తెలియక భ్రమగొంటి నని మరుమరీచికా జ్ఞానము వచ్చిన తర్వాత తిరుగా జలప్రతీతి యెటుల వచ్చునో, అటులనే ఆత్మయం దారోపింపఁబడిన పంచకోశంబులు నధిష్ఠానమయిన యాత్మ కంటె వేఱుగా లేదని యెఱింగినప్పటికిని తిరుగా పంచకోశముల యొక్క ప్రతీతి రావచ్చును. అయినచో దృష్టాంతమయిన మరుమరీచికల యందు జలప్రతీతి మాత్రమే కాని పాన స్నానాదిక్రియలు సేయుట కానమే. దాష్ట్రాంతికమందును అధిష్ఠానమయిన, యాత్మకంటె వేఱుగా పంచకోశములు లేవని యెఱింగిన తర్వాత పంచకోశముల యొక్క ప్రతీతియు వ్యవహారంబును వచ్చుచున్నదే, రావచ్చునా యనిన, రావచ్చును. అది యెట్లనిన, మృత్తునందారోపింపఁబడిన ఘటశరావాదులు మృద్వ్యతి రిక్తంబుగా లేవని యెఱింగినప్పటికిని ఆ ఘట శరావాదుల యొక్క ప్రతీతి యును వ్యవహారంబును ఎటుల వచ్చునో, అటులనే ఆత్మయందారోపింప బడిన పంచకోశములును అధిష్ఠానమయిన ఆత్మకంటె వ్యతిరిక్తముగా లేవని యెఱింగినప్పటికిని పంచకోశముల యొక్క ప్రతీతియును, వ్యవహారంబును ఎటుల వచ్చుచున్నదో, స్వర్ణంబునం దారోపింపఁబడిన కటకమకుటాదులు  స్వర్ణవ్యతిరిక్తంబుగా లేవని యెఱిఁగినప్పటికిని ఆ కటకమకుటాదులయొక్క ప్రతీతియును వ్యవహారంబును రావచ్చును. అయినను ఈ దృష్టాంతమందు ఘటాదులు తోఁచుచు వ్యవహారంబునకు వచ్చినప్పటికిని సూక్ష్మబుద్ధిగల వానికి మృద్వ్యతిరిక్తముగా ఘటాదులు లేవని యెటుల బుద్ధియందు ధృడమగుచున్నదో అటులనే దాష్ట్రాంతికమందును పంచకోశములు తోఁచుచు వ్యవహారమునకు వచ్చినప్పటికిని సూక్ష్మబుద్ధియైన వానికి ఆత్మ వ్యతిరిక్తముగా పంచకోశములు లేవని బుద్ధియందు ధృడపడవచ్చును. ఇటు లెఱుంగుటయే పంచకోశ వ్యతిరిక్తత్వ జ్ఞానము. ఈ విచారమునకు ఫలం బేమనిన, ఆత్మ అవస్థాత్రయంబునందు ననుస్యూతుఁడై యున్నాఁడు. పంచకోశంబులవస్థాత్రయంబులయందెందును అనుస్యూతములయి యుండలేదు. కాఁబట్టి వ్యావృత్తములయిన పంచకోశములు తోఁచుచు వ్యవహారములకు వచ్చినప్పటికిని ఈ పంచకోశములు ఆత్మ వ్యతిరిక్తముగా లేవనుటయే యీ విచారమునకు ఫలము. ఈ ప్రకారమున పంచ కోశములను ఆత్మను భిన్నములుగా విచారించి పంచకోశములు తోఁచినప్పటికిని ఆత్మ వ్యతిరిక్తముగా  లేవని  యెవఁడెఱుఁగుచున్నాఁడో, వాఁడే కృతార్థుండును, విద్వాంసుండును, జీవన్ముక్తుండును, బ్రహ్మము నని వేదాంతశాస్త్ర సిద్ధాంతము.

            శ్లో||  శుక్ల శోణితసంభూత దేహో ఽన్నమయఉచ్యతే
                       ప్రాణాదిపంచకం ప్రాణమయః కర్మేంద్రియై ర్యుతమ్‌
                       జ్ఞానేంద్రియై ర్మనో యుక్తం మనోమయ ఇతీరితః
                       బుద్ధి జ్ఞానేంద్రియై ర్యుక్తం విజ్ఞానమయకోశకమ్‌
                       ప్రియాదియుక్త మజ్ఞాన మానందమయ ఉచ్యతే
                       ఏ తేభ్యో వ్యతిరిక్తో ఽయ మాత్మా సర్వాంతరత్వతః
                       కోశాశ్చై తేహ్యనాత్మానో మహతా విషయత్వతః
                       ధేనుతద్వత్స పుత్రస్త్రీ కన్యాదయ ఇవానిశమ్‌
                       మృదారోపితకుంభాద్యా భాతా అపి న తత్పృథక్‌
                       ఆత్మన్యారోపితాః కోశాః ధాతా అపి పృథఙ్మహీ
                       ఏవం కోశాతిరిక్తత్వం స్వాత్మనో యో విబుధ్యతి
                       స సంసారీ భవాతో ఽపి పరం బ్రహ్మైవ నాన్యథా
 ఇది దశమ వర్ణకము.