26. షడ్విధలింగ ప్రమేయము

అష్టాదశ వర్ణకము
26. షడ్విధలింగ ప్రమేయము

            లింగమనఁగా అంతరార్థము : 1) ఉపక్రమోపసంహారములు (2) అభ్యాసము (3) అపూర్వత్వము (4) ఫలము (5) అర్థవాదము (6) ఉపపత్తి యనునాఱును తాత్పర్య నిర్ణయమునందు లింగములు.

            1. ప్రపంచోత్పత్తికిఁ బూర్వము నామరూప రహితమై సత్తా మాత్రమగు పరబ్రహ్మము మాత్రమే యుండెను. అది అద్వితీయము అని ఉపక్రమించి, ఈ దృశ్య  ప్రపంచమంతయు ఆయాత్మయే. అదియే సత్యము అని ఉపసంహరించుట ఉపక్రమోపసంహారములు.

            2. ‘తత్త్వమసియను వాక్యమును తొమ్మిదిమార్లుచ్చరించి దాని నభ్యసించుట అభ్యాసము.

            3. అఖండైకరసస్వరూపుఁడగు బ్రహ్మము ప్రత్యక్షాది ప్రమాణ గోచరుఁడు కాఁడు అనెడి వివేకము అపూర్వత్వము.

            4. అఖండైకరసానుభవము గలిగి ప్రారబ్ధ భోగానంతరము విదేహముక్తినిఁ బొందుట ఫలము.

            5. ప్రకరణ ప్రతిపాద్యమగుదాని విషయమై ప్రశంసించుట అర్థవాదము.

            6. మట్టివలనఁ గలిగిన ఘటాదులు మట్టికంటె వేఱుకానియట్లు కారణమువలన గలిగిన జగత్తు కారణముకంటె వేఱుకాదనెడి యుక్తి ఉపపత్తి.

            లోకమందుఁగల శ్రుతి స్మృతీతిహాస పురాణాగమాభియుక్త వచనం బులు నీవే ఆత్మ, నీవే బ్రహ్మమని చెప్పినప్పటికిని గురువులు నీవే ఆత్మ, నీవే బ్రహ్మమని శ్రుతియుక్త్యనుభవంబుఁ వలన బహు ప్రకారంబులుగా నుపదేశించినప్పటికిని ఈశ్వర కటాక్షంబును పెద్దల కటాక్షంబును సంపాదింపలేని పాపాత్ముని యొక్క దుర్గార్మపు బుద్ధి సచ్చిదానందస్వరూపుఁడైన ఆత్మనేనని గ్రహింపఁజాలక జడమైన దేహేంద్రియాదులే తానని పరిభ్రమించును. ఇందుకు దృష్టాంతమయిన కథయొకటి కలదు. ఆ కథ యెట్టులనిన ఈ లోకమందు ధర్మగుప్తుఁడనురాజొకడు కలఁడు. వాఁడు మిక్కిలి ధర్మంబు కలిగి సకల ప్రాణులను రక్షించుచుండ కొంతకాలంబునకు వంచకుఁడును పాపాత్ముఁడు నైన భర్జువను పేరుగలవాఁ డొకఁడారాజునకు ప్రధానియై అధర్మంబులు మెండుగా నతనికి బోధింపసాగెను.

            అది యెటులనఁగా: ఈ విద్వాంసులను చుట్టు కూర్చుండఁ బెట్టుకొని జీతము లిచ్చుట వలన వీరు మనకుఁ గలుగఁజేసెడి లాభమేమి? సేనాపతులు, సంప్రతులు వాఁకిటి కావలివాండ్లు మొదలయిన ప్రజలకు విశేషంబుగ జీతము లియ్యనేల ? కొంచెపు జీతంబు దీసుకొని మనకు భ్రీతికరంబులైన పనులు సేయుచుండునట్టి నలుగురు సేవకుల నుంచు కొనినఁ జాలదా అని ఈ రీతిగా నాయాసమయంబులయందు రాజునకు బోధించి సకలమైన వారిని జీవనంబు లేనివారినిఁగాఁ జేసి యందఱికిని ద్వేషియై రాజు తనవాఁడయి యుండఁగా నితరులవలనఁ బనియేమి యని గర్వించి యెట్టివారినైన నవమానించుచు సడ్డలేక మెలఁగుచుండగా నాపట్టణంబు నందలి జనులందఱు నేకీభవించి వాని నెట్టులేనియు రాజ సన్నిధిఁ జేరకుండునట్లొనర్ప వలయునని నిశ్చయించుకొని యెకనాఁడు సంఘీభవించి రాజద్వారమందు నిలిచి వాఁడు రాజదర్శనమునకై వచ్చు చుండ నెదురుగాఁ బోయి చుట్టుముట్టి బడియలతోఁ గొట్టి తరిమిరి. వాఁడును పౌరులవలన దెబ్బలు పడఁజాలక యాపట్టణంబును విడిచి పారి పోయెను.

            తర్వాత రాజు భర్జువు కొలువునకు రాని కారణమేమి యని విచారింపఁగా సన్నిధానమందున్న వారు వానికి జ్వరంబు వచ్చినందున రాలేదని విన్నవించిరి. ఆ మాట విని రాజు వానికి మంచి ఔషధంబులిచ్చి వ్యాధిరహితునిగాఁ జేయుఁడని వైద్యుల కాజ్ఞాపించెను. వైద్యులు చెప్పిన ప్రకార మొనర్చుచున్నామని చెప్పి మరుసటి దినంబున రాజసభకు వచ్చి యో రాజేంద్రా ! భర్జువునకు సమస్తౌషధంబులును నిచ్చి బహు శ్రమలు పడితిమి గాని వానికి కలిగియుండెడి దోషగుణంబులను జూడఁగా  బ్రతుకు నని తోఁచలేదని చెప్పిరి. రాజు ఆ మాట విని మిక్కిలి దుఃఖితుఁడై వాని యింటికిఁ బోయి చూచి రావలయునని ప్రయాణమయి పోవుచుండఁగా కొందఱు బ్రాహ్మణు లారాజున కెదురుగ వచ్చి మీరేల పోయెదరు. భర్జువు చచ్చినాఁడు, రాజ్యాధిపతులగు మీ బోటివారు శవంబు నవలోకించిన రాజ్యంబునకు కీడు సంభవించును. తిరుగా నగరు ప్రవేశించుట మంచిది. రండని పిలుచుకొని వచ్చి భర్జువును గూర్చి దుఃఖించుచున్న రాజునకు తగిన మాటలు చెప్పి దుఃఖంబుం దొలఁగించిరి. తరువాత భర్జువు ఈ వృత్తాంతంబుఁ  దెలిసికొని యాగ్రహించి, యెవ్విధంబుననైన రాజ సాన్నిధ్యం బునొంది వీరి నందఱిం దగిన దండనంబులకు పాత్రులనుగాఁ జేయుదు నను దీక్ష వహించి తలవెంట్రుకలు పెంచి రాజదర్శన మెప్పుడగునో యని యెదురు చూచుచుండెను.

            ఇవ్వింధంబునఁ గొంతకాలంబు గడిచెను. అంత నొకనాఁడు రాజు స్వారి తరలిపోవుచుండఁగా నామార్గమందొక రావి మ్రానిమీఁద నెక్కి యెవరి కిని కనపడకుండ ఆకుల నడుమ నొదిగియుండి రాజా చెట్టు సమీపంబు కును రాఁగా జయ విజయీ భవయని కూఁతలు పెట్టుచు నేను భర్జువును నన్ను మీ సన్నిధికిఁ జేరకుండఁజేయవలయునని పురజనులందరును సంకేతం బొనర్చికొని నన్నుఁ గొట్టితఱిమి మీకు దూరస్తునిగాఁ జేసిరి అని కూఁతలు పెట్టనారంభించెను. అప్పుడురాజు అశ్వత్థంబుమీఁద నున్న భర్జువును జూచి యాశ్చర్యపడి దగ్గఱనున్న ఉద్యోగస్థులను చూడఁగానే వారు మహాప్రభూ చచ్చిపోయిన భర్జువు బ్రహ్మరక్షస్సై యీ రావిచెట్టు మీఁద చేరియున్నాఁడు. వాని దృష్టి మీపైని సోఁకరాదు. ఇచట నిలువ వలదు. పదండని వేగిరించుచు నయ్యవనిపాలకునికి వస్త్రంబులు కప్పి విభూతి నుదుటఁబెట్టి బాలాబగళాది మహామంత్రంబులు జపించుచు భయహరంబులగు మాటలవలన నతని జడుపుఁ దీర్చుచు పట్టణంబునకుఁ దోడ్కోనిపోయిరి. తర్వాత కొందఱు భర్జువును చబుకులతోఁ గొట్టి తఱిమిరి. ఆరాజు దోష రహితంబులయిన చక్షుస్సుల వలన భర్జువును జూచిన వాఁడయ్యును సమీపమందుండిన వారి యొక్క మాటల వలన భ్రమించి వానిని బ్రహ్మరక్షస్సని యెటుల నిశ్చయించెనో అటులే శ్రుతిస్మృతీతిహాస పురాణా గమాభియుక్త వచనంబులు నీవే ఆత్మ, నీవే బ్రహ్మమని చెప్పినప్పటికిని గురువులు బహువిధంబులుగా నుపదేశించినప్పటికిని ప్రతిబంధంబు గలవారు విఫలంబయిన దేహేంద్రి యాదులేనని గ్రహించుచున్నారు. ఈ యర్థంబు నెవరెచ్చట నిరూపించి రనిన, సంక్షేపకాచార్యుల వారు పురాణంబు లన్నియు శోధించి ఆ పురాణార్థంబు సంక్షేపరూపంబుగ శారీరంబునందు నిరూపించియున్నారు. ఆ వాక్య మెయ్యది యనిన,

 శ్లో|| పురుషాపరాధవతీ నారీ ఫణినిరవద్యచక్షురుదయాపి యథా
        విఫలాయ భర్జువిషయా భవతి శ్రుతిసంభవాపి తథాత్మవిదః|

ఇది అష్టాదశ వర్ణకము