3. స్థూలసృష్టి ప్రకారము

3.   స్థూలసృష్టి ప్రకారము

ఈశ్వరుని యొక్క వీక్షణముచేతను తమోగుణ ప్రధానంబులైన యపంచీకృత భూతము లొక్కొక్కటి రెండేసి భాగంబులై యందులో సగము విడిచి కడమ సగములో నొక్కొక్క భాగంబు నాలుగేసి విధంబులై ఆయా భాగంబులు స్వాంశంబును విడిచి యితర భాగంబులతోఁ గూడి పంచీకృత భూతంబులాయెను. వీనికి స్థూలభూతంబులని పేరు. ఈ భూతములనుండి యీశ్వరుని యొక్క వీక్షణంబుచేత బ్రహ్మాండంబును, ఈ బ్రహ్మాండంబులో నతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళంబు లనెడి యేడైన యధోలోకంబులును, భూలోక, భువర్లోక, సువర్లోక, జనలోక, మహాలోక, తపోలోక, సత్యలోకంబనెడి యేడు ఊర్ధ్వలోకంబులును, ఆయా లోకంబుల కుచితమయిన ఉద్భిజ, స్వేదజ, అండజ, జరాయుజంబు లనెడి చతుర్విధ భూత గ్రామాదులును బుట్టెను. ఇంతయును గూడి స్థూలప్రపంచ మని చెప్పఁబడెను. దీనియందభిమాని యగు నీశ్వరునకు విరాట్టని పేరు. ఇతనికే వైరాజనుండనియు, వైశ్వానరుండనియు రెండు పేళ్ళు గలవు.

            వ్యష్టి  సమష్టిలోనే యంతర్భూత మయినప్పటికిని విశేషంబు నెఱుంగ వలసి మఱల నిరూపించుచున్నారము. అది యెటులనఁగా, జాగ్రదవస్థ యందును, స్థూలశరీరంబునందును, అభిమానించిన ఆత్మకు విశ్వుండని పేరు. ఇతనికే వ్యావహారికుఁడనియును, చిదాభాసుఁడనియును రెండు పేళ్ళు కలవు.

            స్వప్నావస్థయందును, లింగశరీరమందును, అభిమానించిన ఆత్మకు తైజసుఁడని పేరు. ఇతనికే ప్రాతిభాసికుఁడనియును, స్వప్న కల్పితుఁడనియును రెండు పేళ్ళు. సుషుప్త్యవవస్థయందును, కారణ శరీరమందును అభిమానించిన ఆత్మకు ప్రాజ్ఞుఁడని పేరు. ఇతనికే పారమార్థికుఁడనియును, అవచ్ఛిన్నుఁ డనియును రెండు పేళ్ళు. ఇది స్థూల ప్రపంచము యొక్క యుత్పత్తి.

            ఈ ప్రపంచము యొక్క అవాంతర సృష్టి ప్రళయముల కొఱకై ఆ యీశ్వరుఁడే మాయావరణ సహితుఁడై మూఁడుమూర్తులై సత్త్వ గుణంబుతోఁ గూడుకొని రక్షకుండయిన విష్ణువును, రజో గుణంబుతోఁ గూడుకొని సృష్టికర్తయగు బ్రహ్మమును, తమో గుణంబుతోఁ గూడి సంహార కర్తయైన రుద్రుండు నగును. విరాడంతర్భూతుండు బ్రహ్మయును, హిరణ్య గర్భాంతర్భూతుండు విష్ణువును, అవ్యాకృతాంతర్భూతుండు రుద్రుండును నీ ప్రకారంబు ప్రపంచోత్పత్తి. ఇదే యధ్యారోపమని చెప్పఁబడును.