9. రాగద్వేషాది ప్రకరణము

షష్ఠ వర్ణకము
9.   రాగద్వేషాది ప్రకరణము

            శ్లో||  రాగాద్యైశ్శ్రద్ధయా యుక్తో బద్ధో ముక్తో భవేన్నరః
                       తద్రాగాదిక త్రివిధం కేన స్యా దితి చింత్యతే

           ఏరాగ ద్వేషములవలన నరుఁడు ప్రేరేపిఁపబడినవాఁడై త్రివిధ కరణంబులును, త్రివిధకర్మములును చేయుచున్నాఁడో, ఆ రాగద్వేషాదులు ఎన్ని విధంబులని విచారించుదము. ఎటులనఁగా రాగ ద్వేష కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈర్ష్య అసూయ దంభ దర్ప అహంకార ఇచ్ఛా భక్తి శ్రద్ధలని బదియాఱు విధంబులు. వీనియొక్క భేదంబులం జెప్పుచున్నారము. స్త్రీ విషయమయి వచ్చెడి చిత్తవృత్తికి రాగమనియును, ఒకం డపకృతి యొనర్చిన నాయపకృతికి బ్రతిక్రియ సేయవలయునని తోఁచెడిది ద్వేషమనియును, గృహారామ క్షేత్ర ధనధాన్యాదులను సంపాదింప వలయు ననెడిది కామమనియును, తాను సంపాదించినట్టి పదార్థంబులకు విఘ్నము సేయునట్టి వానియందుగ్రము గలిగెడిది క్రోధమనియును, ఆర్జించిన పదార్థంబులను సెలవు సేయఁగూడదనియెడిది లోభమును, ఐశ్వర్యమదముచేత కృత్యాకృత్యంబుల నెఱుంగలేనిది మోహమనియును, సకల సంపదలు గలిగిన నేను ఏమి సేసినను చెల్లునని తోఁచెడిది మద మనియును, ఒకఁడు తనకంటె నధికుఁడై యుండెనేని వానియుత్కర్షమును సహింప నోపనిది మాత్సర్య మనియును, దుఃఖము పరునికి రాక తనకు రావచ్చునా ? యనెడిది ఈర్ష్య యనియును, మనవలెనే పరులు సుఖముగ
నుండవచ్చునా ? యని తోఁచెడిది అసూయ యనియును, తానొనర్చిన ధర్మము నలుగు రెఱింగి మెచ్చవలయు నని తోఁచెడిది దంభమనియును, తాను దొడ్డవాఁడనియు, నితరులెవరును తనకు సరికారనియును తోఁచెడిది దర్పమనియును, ‘‘ఓరీ నిన్ను శిక్షించెడివాఁడ నని యెఱుంగవా ? నేను పట్టిన కార్యమును విడువనట్టి వాఁడ’’ నని పరులను బెదరించెడిది  అహంకారమనియు, అనిర్వాచ్యంబులగు శౌచాదిక్రియలను జేయవలె ననెడిది యిచ్ఛ యనియును, గురు దేవతాదులయందుఁగల ప్రీతికి భక్తి యనియును, గురువులయందును, వేదాంత వాక్యములయందును, యా గాది క్రియలయందును గల విశ్వాసమునకు శ్రద్ధ యనియును పేళ్ళు. ఈ చందంబున రాగద్వేషాదులయొక్క స్వరూపంబుల నెఱుంగవలయును. ఈ విచారంబునకు ఫలం బేమనిన, రాగాదులు యత్నము సేయకయే వచ్చు చున్నవి. అహంకారవంతములగు రాగమాదిగాఁగల పదిమూఁడింటికిని వశ్యుడై త్రివిధకరణంబుల చేతను కర్మంబుల నొనర్చినచో వానికి నరకము వలన నివృత్తి లేదు గాన, రాగద్వేషాదులకు చిత్తవృత్తులను ద్రిప్పి సర్వ విధంబులచేతను శ్రద్ధాభక్తి రూపంబులుగాఁ జేసినచోఁ గ్రమముగా శీఘ్రంబున సంసారబంధంబు వలన విముక్తుండగును. కనుక శ్రద్ధా భక్తులను సంపాదింపవలయును. ఇచ్ఛచేతఁ జేయఁదగిన క్షుత్పిపాసాది నివృత్తియు, మూత్రపురీషాది విసర్జనంబునుం జేయకున్నఁ  దాత్కాలికంబు నందు బాధకం బగును. వీనివలన స్వర్గనరకాది ప్రాప్తి లేదని యెఱుంగుట ఈ విచారంబునకు ఫలంబు. సుషుప్త్యవస్థయందును, తూష్ణీంభూతావస్థ యందును, సమాధ్యవస్థయందును, రాగద్వేషంబులు లేవు గాన, కర్మంబును లేదు. జాగ్రత్స్వప్నంబులయందు రాగద్వేషంబులున్నవి గనుక కర్మంబు నున్నది. కనుక రాగద్వేషములు గలిగిన కర్మంబునుం గలదు. రాగద్వేషం బులు లేకుండిన కర్మంబును లేదనుట అన్వయ వ్యతిరేకంబుల చేత సిద్ధము. ఈ రాగద్వేషాదులు అభిమానముచే వచ్చుచున్నవి. సమస్త జనులకు అభిమాన పూర్వకంబగు రాగాది పూర్వకం బగుప్రవృత్తి వచ్చునా? యనిన, ఒక స్త్రీకి నేను స్త్రీని నను అభిమాన మెప్పుడు వచ్చుచున్నదో అప్పుడు రాగాది పూర్వకంబుగా భర్తృశుశ్రూష యందును గృహ సంరక్షణంబు నందును, పాకాది క్రియలయందును, ప్రవృత్తి కనబడుచున్నది. అటులనే పురుషునకును నేను పురుషుండ ననునభిమానం బెప్పుడు వచ్చుచున్నదో అప్పుడు రాగాది పూర్వకంబుగ దారాదిపరిగ్రహంబుల యందును, కృష్యాదులయందును, ధనధాన్యార్జనముల యందును ప్రవృత్తి కానఁబడుచున్నది. అటులనే, జనులకును వర్ణాశ్రమాద్యభిమానముల చేతను, స్వస్వోచిత వ్యాపారములయందు రాగాదిపూర్వకముగాఁ బ్రవృత్తి కనపడు చున్నది. కనుక రాగాదులకభిమానము కారణము. ఈ విచారంబునకు ఫలం బేమి యనిన, ముముక్షువు లగువారలు సర్వవస్తువుల యందును యభిమానమును పూర్తిగ విడువవలెను. విడిచినట్టయిన దుఃఖమునుండి విడువఁబడుదురని ఫలము. కనుక అభిమానంబుగలిగిన రాగాదులును గలవు. అభిమానంబు లేకున్న, రాగాదులును లేవనుటకు సుషుప్తి, జాగ్రత్త, తూష్ణీంభూతావస్థలయందు అనుభవము చూచుకొనవలసినది. అయిన నీయభిమానము అవివేకముచేత వచ్చుచున్నది. అది యెటులనిన, సమస్తమయిన వారలకును నేను బ్రాహ్మణుఁడను, నేను క్షత్రియుఁడను, నేను వైశ్యుఁడను, నేను శూద్రుఁడను అని బ్రాహ్మణత్వాద్యభిమానము వచ్చుచున్నది గదా! అది దేని నవలంబించి వచ్చుచున్నదని తెలుసుకొను వివేకము ఎవరికిని లేదు గనుక, అభిమానము వచ్చుచున్నది. దీనికి అవలంబనము లేదా అనిన, శరీరంబు నవలంబించుకొని వచ్చుచున్నదని చెప్పెద మనిన, శరీరము క్షత్రియాదులకు సాధారణమై యున్నది గనుక వారలకు నేను బ్రాహ్మణుండనని యభిమానము రాలేదు. కాఁబట్టి బ్రాహ్మణ త్వాదులు శరీరంబు నవలంబించి వచ్చుచున్నవని చెప్పఁగూడదు. అయిన శిఖాయజ్ఞోపవీతాదుల నవలంబించుకొని వచ్చుచున్నవని చెప్పెదమనిన శిఖాయజ్ఞోపవీతములు కులాలాదులకు సాధారణమయి యున్నది గనుక వారలకును నేను బ్రాహ్మణుఁడనని యభిమానము రాలేదు. కాఁబట్టి శిఖాయజ్ఞోపవీతాదుల నవలంబించుకొని వచ్చుచున్నదని చెప్పఁగూడదు. అయితే ఒక్కొక్క యవయవంబునకు బ్రాహ్మణత్వాదులను చెప్పెద మనిన ఆయాయవయవంబులకు భిన్నంబులయిన నామంబులున్నవి గనుక, ఆయాయవయవంబులకు బ్రాహ్మణత్వాది వ్యవహారంబు లేదు గనుక, ఆయాయవయవంబులకు బ్రాహ్మణత్వాదులు చెప్పఁగూడదు. అయిన విశిష్టమయిన మాతృపితృల వలన జన్యములయిన అవయవములకు బ్రాహ్మణత్వాదులు చెప్పెదమనిన విశిష్టమయిన మాతృపిత్రాదులచేత ద్యజింపఁబడిన కేశ, రోమ, నఖ, దంత, మల, మూత్రాదులకును బ్రాహ్మణత్వాది వ్యవహారము రావలెను. అట్లు రాలేదు గనుక, దేనికిని బ్రాహ్మణత్వాదులు నిర్ణయించి చెప్పఁగూడదు. బ్రాహ్మణత్వాది వ్యవహారమునకు  గతి యేమనిన, శోభనం బనియును, ఉత్సవమనియును అనేక వస్తు సమూహంబులకు ఆయా నామంబు లెటుల వచ్చుచున్నవో అటులనే అనిర్వచనీయమయిన దేహేంద్రియాది సంఘాతంబునకు వ్యవహరంబుల యందు బ్రాహ్మణుండని పేరు, అటులనే క్షత్రియుఁడనియు, వైశ్యుఁడనియు, శూద్రుఁడనియు, శాస్త్రజ్ఞుఁడనియు, పౌరాణికుడనియు, అవధానియనియు, శైవుఁడనియు, వైష్ణవుఁడనియు ఇవి మొదలైన సమస్త నామంబులును దేహేంద్రియాది సంఘాతమును విషయీకరించుకొని వచ్చుచున్నవి గనుక, దేహేంద్రియాదిసంఘాతమునకే కాని ఆత్మకు కాలత్రయంబునందును ఈ నామాదులు లేవని యెఱుంగకుండుట అవివేకము. ఈ యవివేకము చేతనే అభిమానంబు వచ్చుచున్నది. ఈ విచారంబునకు ఫలమేమనిన బ్రాహ్మణత్వాదులు దేహేంద్రియాది సంఘాతంబునకే యని యెఱుంగుట ఫలము. ఈ యవివేకమెందుచేత వచ్చినదనిన, అజ్ఞానము చేత వచ్చినది. అజ్ఞాన మనఁగా నెయ్యది యనిన, తన్ను ఁ దా నెఱుంగకుండుట. సదసత్తని చెప్పుదమనిన విరుద్ధము గనుక సదసత్తనియును చెప్పఁగూడదు. భిన్నమని చెప్పుదమనిన అద్వితీయ బ్రహ్మమునకు హాని వచ్చును. ఆత్మ అద్వితీయుడని చెప్పెడి శ్రుతులకు వైయర్థ్యము వచ్చును. ఇంతియ కాదు, మాయకు ఆత్మ సత్తకంటే వ్యతిరిక్తమైన సత్త లేదు గాన ఆత్మకంటె భిన్నమయిన పదార్థమని చెప్పగూడదు. భిన్నమని చెప్పినట్లయిన ఆత్మ శక్తియని ప్రతిపాదించెడి శ్రుతులకు వైయర్థ్యము వచ్చును. ఇంతియ కాదు, అభిన్నమని చెప్పినట్లయిన మాయకు చేతనత్వము రావలెను. అచేతనత్వము రాకపోవలెను. ఆత్మకు చేతనాచేతన స్వరూపత్వ మనెడి ప్రమాదదోషంబు వచ్చును. మాయయని చెప్పఁబడక యుండవలెను. ఆత్మయని చెప్పఁబడవలెను. ఆత్మయని చెప్పెదమనిన, మాయయనియు, ప్రకృతియనియు, తన్ను తానెఱుంగఁడనిన, ఎఱుంగఁడు. తన్నుఁదా నెఱుఁగడని చెప్పవచ్చుననఁగా, చెప్పవచ్చును. అది యెటులనఁగా, నేను బ్రాహ్మణుఁడననియు, నేను క్షత్రియుఁడననియు, నేను వైశ్యుఁడననియు, నేను శూద్రుఁడననియు, ఈ కుల గోత్రములయందుఁ బుట్టిన వాఁడననియు, ఈ శరీరమునే ఆత్మగా నెఱుంగుదురింతియె కాని, శరీర వ్యతిరిక్తుఁడైన ఆత్మనెవరును నెఱుంగరు. ఎఱుఁగరని చెప్పవచ్చునా? శాస్త్రజ్ఞులయినవారలు శరీర వ్యతిరిక్తుఁడైన ఆత్మ యున్నవాఁడని చెప్పుచుండఁగా ఎవరును నెఱుఁగరని యెటుల చెప్పవచ్చుననిన : చెప్పవచ్చును. అది యెటులనిన కర్తయు, భోక్తయు, పరిచ్ఛిన్నుండును, లోకాంతరగామియు నయిన జీవుని ఆత్మగా నెఱుంగు దురింతియకాని, యకర్తయు, నభోక్తయు, నపరిచ్ఛిన్నుఁడు, నసంగుఁడు, నద్వితీయుఁడు, వేదాంతవేద్యుఁడునైన ప్రత్యగాత్మ నెవరు నెఱుంగరు. ఇట్టి యాత్మ నెఱుంగమియే అజ్ఞానము. ఈ యజ్ఞానముచేత నవివేకము వచ్చుచున్నది. ఈ యజ్ఞాన మెందుచేత వచ్చిన దనిన అజ్ఞాన మనాది గనుక నొకటిచేత వచ్చుచున్నదని చెప్పఁగూడదు. ఈ యజ్ఞానం బునకు స్వరూప మేమనిన చెప్పెదము. ఈ యజ్ఞానము జ్ఞానముచేత బాధింపఁబడుచున్నది గనుక, సత్తని చెప్పఁగూడదు. అసత్తని చెప్పుద మనిన శశవిషాణాదులవలె తోఁచకపోవలెను. అహమజ్ఞుండనని, యజ్ఞాన మనుభవంబున్నది. అందువలన నజ్ఞాన మసత్తనియును జెప్పఁగూడదు. ప్రధానమనియు, అవిద్య యనియు, ప్రళయమనియు, మహాసుషుప్తి యనియు, తమస్సనియు, అజ్ఞానమనియు, ఆత్మ ప్రతిపాదక వ్యతిరిక్తము లయిన శబ్దములచేతఁ జెప్పఁబడుచున్నది గనుక ఆత్మయని చెప్పఁగూడదు. భిన్నాభిన్నమని చెప్పుదమనిన, విరుద్ధము గనుక చెప్పగూడదు. సావయవమని చెప్పుదమనిన మూలకారణము గాకపోవలెను. మూల కారణమయి యున్నది గనుక సావయవమని చెప్పఁగూడదు. నిరయవ మని చెప్పుద మనిన జగదాకారముగాఁ బరిణమింపకపోవలెను. జగదాకారంబుగాఁ బరిణమించుచున్నది గనుక నిరవయవమని చెప్పఁగూడదు. ఉభయాత్మకమనిన, విరుద్ధంబు గాన చెప్పఁగూడదు. మఱి యెటుల చెప్పవలెననిన, అనిర్వచనీయమని చెప్పవలెను. ఈ యనిర్వచనీయ మయిన అజ్ఞానముచేత అవివేకంబును, అవివేకముచేత నభిమానంబును, అభిమానమువలన రాగద్వేషాదులును, రాగద్వేషాదుల వలన కర్మంబును, కర్మంబు వలన శరీరంబును, శరీర పరిగ్రహంబు వలన దుఃఖంబును వచ్చుచున్నవి. దుఃఖమున కాత్యంతికవృత్తి యెప్పుడు వచ్చుననిన, సర్వాత్మనా శరీరపరిగ్రహంబు రాకపోయెనేని వచ్చును. ఈ శరీర పరిగ్రహము సర్వాత్మనా లేకపోవుట యెప్పటి కనిన, సర్వాత్మనా కర్మము లేకపోవునపుడు. కర్మము సర్వాత్మనా యెప్పుడు పోవుననిన సర్వాత్మనా రాగద్వేషాదులు పోవునపుడు. రాగద్వేషాదులు ఎప్పుడు పోవుననఁగా, సర్వాత్మనా అభిమానము పోవునపుడు. అభిమానము సర్వాత్మనా యెప్పుడు పోవుననిన, సర్వాత్మనా అవివేకము పోయిన పోవును. అవివేకము సర్వాత్మనా యెపుడు పోవు ననిన, సర్వాత్మనా అజ్ఞానము పోయిన పోవును. ఈ అజ్ఞానము సర్వాత్మనా యెప్పుడు పోవు ననఁగ అద్వితీయ బ్రహ్మాత్మైక్యాపరోక్షజ్ఞానము చేతనే కాక మరియెందుచేతను పోదు. కర్మము చేత అజ్ఞానంబునకు నివృత్తి వచ్చునని చెప్పుదమనిన, కర్మంబునకును అజ్ఞానంబునకును విరోధము లేదు గనుక, అజ్ఞానంబునకు నివృత్తి రానేరదు. వృద్ధినే కలుగఁజేయును.

ఇందుకు దృష్టాంతము :
            అమావాస్య చీఁకటి మేఘావరణము అంధకారము నిబిడంబుగా నెటులఁ జేయుచున్నదో, అటులనే కర్మం బజ్ఞానంబును వృద్ధిఁ బొందించును గాని నివృత్తి చేయనేరదు. అంధకారము తనకు విరోధంబగు సూర్య ప్రకాశము చేత నెటుల నివృత్తమగుచున్నదో అటులనే అజ్ఞానంబునకు విరోధంబగు నద్వితీయ బ్రహ్మాత్మైక్యాపరోక్షజ్ఞానము చేతను అజ్ఞానమునకు నివృత్తి వచ్చును. మరి యెందుచేతను ఈ యజ్ఞానంబునకు నివృత్తి గానేరదు. జ్ఞానము ఎటువలె వచ్చుననఁగా, ఆత్మానాత్మ వివేకము వలన వచ్చును. మఱియెందువల్లను రానేరదు. కర్మోపాసనాది యోగములచేత వచ్చు చున్నదని చెప్పుద మనఁగా చెప్పఁగూడదు. అది యెట్లనిన, జ్ఞానము వస్తు తంత్రంబు గాన, పురుష తంత్రంబగు కర్మంబువలన నంతఃకరణశుద్ధి వచ్చును గాని, జ్ఞానము రానేరదు. జ్ఞానము ప్రమాణజన్యంబు గావున మానస క్రియాత్మకంబగు ఉపాసనల వల్ల చిత్తైకాగ్య్రము వచ్చును గాని, జ్ఞానము రానేరదు. యోగంబును మానస క్రియారూపకంబు గావున అణిమాద్యైశ్వర్యంబులను సంపాదించి జ్ఞానంబునకును జ్ఞానఫలంబగు కృతకృత్యాదులకును విఘ్నమును లుగంజేయును గాన, జ్ఞానమును బుట్టింపనేరదు. అయితే ఆ జ్ఞాన మెటుల వచ్చుననిన, ఆత్మానాత్మ విచారము చేతనే రావలెను.

ఇందుకు దృష్టాంతము :
            గాయత్రీసాలగ్రామరత్నాదుల యొక్క తత్త్వజ్ఞానము, వాని కుచిత మయిన పరీక్ష నిఘర్షణాది విచారము చేత నెటులఁబుట్టుచున్నదో, స్నానధ్యాన ప్రాణాయామాదులచేత నెటులఁ బుట్టదో అటులనే ఆత్మానాత్మ విచారముచేత ఆత్మ తత్త్వ జ్ఞానము పుట్టును గాని, కర్మోపాసనాదుల వలన నుదయింపనేరదు. కాఁబట్టి ముముక్షువు లయినవారలు సర్వదా సర్వ ప్రయత్నములచేత ఆత్మానాత్మ విచారమే చేయవలయును. ఇటుల చేసిన సంసారబంధంబువలన విడువఁబడి శీఘ్రంబున జీవన్ముక్తి సుఖంబును బొందుదు రని సిద్ధాంతము.

శ్లో||  దుఁఖహేతుర్హి దేహస్స్యాద్దేహహేతుశ్చ కర్మ తత్‌
         కర్మ హేతుశ్చ రాగాదిర్మనో రాగాదికారణమ్‌
         అవివేకాన్మానహేతు రజ్ఞానం తస్య కారణమ్‌
         జ్ఞానాన్న శ్యేత్తదజ్ఞానం జ్ఞానం తస్య విచారతః

శ్లో||  అజ్ఞానవృక్ష మవివేక మహాంకురం యో
         దేహాభిమానవిటపం బహురాగశాఖమ్‌
         కర్మప్రదీప్త బహుదేహ కటాహమేతం
         జ్ఞానాసినార్తి రస మేషు సుధీశ్ఛినత్తి

ఇది షష్ఠ వర్ణకము