8. కర్మవిచార ప్రకారము

పంచమ వర్ణకము
8.   కర్మవిచార ప్రకారము

            పుణ్యకర్మంబనియు, మిశ్రకర్మంబనియు, పాపకర్మంబనియు కర్మంబు త్రివిధంబు. ఈ పుణ్య పాపమిశ్రకర్మంబులకు ఫలంబు లెట్లనిన, పుణ్య కర్మంబునకు దేవాది శరీరప్రాప్తి, పాపకర్మంబునకు తిర్యగాది శరీరప్రాప్తి, మిశ్రకర్మంబునకు మనుష్య శరీరప్రాప్తి, పుణ్యోత్కర్షంబునకు హిరణ్యగర్భ శరీరప్రాప్తి, పుణ్యమధ్యమంబున నింద్రాది శరీరప్రాప్తి, పుణ్య సామాన్యంబునకు యక్షరక్షః పిశాచాది శరీరప్రాప్తి, పాపోత్కర్షంబునకు పరులకు సంతాపకరంబైన గుల్మ వృశ్చిక యాకవనమక్షికాది శరీరప్రాప్తి, పాపమధ్యంబునకు ఆమ్లపనసనారికేళ మహిషాశ్వగర్దభాది శరీరప్రాప్తి, పాపసామాన్యంబున గోగజాశ్వత్థవృక్షాది శరీరప్రాప్తి, మిశ్రోత్కర్షంబునకు నిష్కామకర్మానుష్ఠానము చేతను చిత్తశుద్ధి, తద్ద్వారా సాధన చతుష్టయ సంపత్తి, తద్వారా సద్గురు లాభపూర్వకంబుగాఁ జేయఁబడిన శ్రవణమనన నిధిధ్యాసనములచేతను గలిగిన జ్ఞానము ద్వారా జీవన్ముక్తి సుఖంబు నిచ్చు నట్టి శరీరప్రాప్తి, మిశ్రమధ్యంబునకు స్వాశ్రమోచిత కామ్యకర్మంబులకు యోగ్యమైన శరీరప్రాప్తి, మిశ్రసామాన్యంబునకు చండాల వ్యాధాది శరీర ప్రాప్తియు నగును. కనుక వివేకియైనవాఁడు కర్మఫల తారతమ్యమును విచారించి మిశ్రోత్కర్షం బెవ్విధంబున సిద్ధించునో యని, అందుకుం దగిన యత్నమును చేయవలయును. ఈ పుణ్య పాప మిశ్ర రూపంబులైన కర్మంబు లెందుచేతఁ జేయఁబడుచునున్నవనిన, త్రివిధ కరణంబులచేతఁ జేయఁబడుచున్నవి. సమస్తమైన వారలును నీకర్మంబు నొనర్చితిమని చెప్పు చున్నారు గనుక, వారలయొక్క అనుభవముచేతను ఆత్మనిష్ఠముగా కర్తృ త్వము తోచుచున్నది. కనుక కర్తృత్వం బాత్మనిష్ఠముగానే చెప్పుద మనఁగా ఆత్మ నిర్వికారుఁడు గనుక, నిర్వికారుఁడైన యాత్మకు కర్తృత్వము చెప్పఁగూడదు. అట్లయితే ఈ కర్తృత్వం బాత్మయందు తోఁచుచున్నది గదా? దీనికి గతి యేమి యనిన, అన్యనిష్ఠమైన కర్తృత్వంబాత్మయందు తోఁచుచున్నది. కాఁబట్టి ఆత్మకు కర్తృత్వ మాగంతుకమని చెప్పవలెను. అన్య నిష్ఠమయిన కర్తృత్వ మాత్మయందుఁ దోఁచుచున్నదని యెందుకు చెప్పవలెను? స్వాభావికమే యని చెప్పుదమన, అటులను చెప్పఁగూడదు. మంచిది స్వాభావికమని చెప్పిన కర్తృత్వము పోవుట కొఱకు యత్నము చేయక యుండవలెను. అటులగాదు, ముముక్షువులయిన వారలు అనేకులు యత్నము సేయుచున్నారు గనుక, కర్తృత్వము స్వాభావికమని చెప్పఁగూడదు. కర్తృత్వము స్వాభావికము, కర్తృత్వము పోవుటకై యత్నంబునుం జేయనీ అంటే, స్వాభావికమనఁగా స్వరూపమాయెను గనుక, స్వరూపనాశ నార్థంబుగా యత్నం బొనర్చుచున్నారని చెప్పఁబడును. స్వరూప నాశనార్థ మెవరును యత్నము సేయరు గాన, స్వాభావిక కర్తృత్వ నివృత్త్యర్థమై యత్నము చేయుచున్నారని చెప్పఁగూడదు. మంచిది, స్వాభావికమయిన కర్తృత్వంబునకు నివృత్తి చెప్పునప్పుడు స్వరూపమే నశించిపోవుచున్నది. కాఁబట్టి కర్తృత్వము విడువఁబడి అకర్తయైనవాఁడు యెవఁడును లేకపోవును గావున, కర్తృత్వము స్వాభావికమని చెప్పఁగూడదు. కర్తృత్వము స్వాభావికము గానీ, నివృత్తియును గానీ అనిన, అగ్నికి ఉష్ణత్వంబు స్వాభావింబు, ఉష్ణత్వంబునకు మణిమంత్రౌషధంబుల వలన నెటుల నివృత్తి వచ్చుచున్నదో అటులనే ఆత్మకును స్వాభావికమైన కర్తృత్వంబునకు నుత్కృష్ట కర్మోపాసనాద్యనుష్ఠానంబుల వలన నివృత్తి వచ్చుచున్నదని చెప్పుదమన, అగ్నికి ఉష్ణత్వము కాలాంతరమందు మణిమంత్రాది వియోగంబు వలన నెటుల యావిర్భవించుచున్నదో అటులనే ఆత్మకును కర్తృత్వము ఉత్కృష్ట కర్మోపాసన ఫలంబునకు నాశము కాఁగా తిరుగా నావిర్భవించును. ఇటువలె చెప్పినట్టయిన కర్తృత్వ నివృత్తి రూపమయిన ముక్తికి జన్యత్వంబును అనిత్యంబును వచ్చును. ఇంతియ గాదు. ఆత్మ కర్తయని వచించునట్టి శ్రుత్యాదులకు వైయర్థ్యంబును సంభవించును.  సుషుప్తియం దాత్మ యున్నాఁడు గనుక, అందునుం గర్తృత్వము దోఁపవలయును. అటుల దోఁచలేదు కాఁబట్టి ఆత్మకు కర్తృత్వంబు స్వాభావికం బని చెప్పఁగూడదు. సుషుప్తియం దాత్మయుండిన నెందుకు కర్తృత్వంబు దోఁపవలయు? అక్ష్యాదులకు స్వకార్యంబులఁ గూర్చి కర్తృత్వంబుండి నప్పటికిని స్నానభోజన శయన విహార కాలాదులయందు దాస్యాది కరణ సంయోగంబు లేదు గాన, కర్తృత్వం బెటుల తోఁచలేదో, దాస్యాది కరణ యోగానంతరంబునం దెటుల తోఁచుచున్నదో అటులనే ఆత్మకును సుషుప్త్యవస్థయందు కర్తృత్వంబు నున్నది. ఉండినను త్రివిధకరణ సంయోగంబు లేదు. కాఁబట్టి తోఁచలేదు. జాగ్రత్స్వప్నంబుల యందు కరణసంయోగం బున్నది గనుక, కర్తృత్వంబు దోఁచుచున్నదని చెప్పుద మనిన, తూష్ణీంభూతావస్థయందును కరణ సంయోగం బున్నది గనుక, అక్కడను కర్తృత్వంబు దోఁచవలెను. అటుల తోఁచలేదు  గనుక కర్తృత్వంబు స్వాభావికంబు గాదు. మఱియెటులనిన, ఆగంతుకం బనియే  చెప్పవలయును. ఆగంతుక మనఁగా అన్యనిష్ఠమయిన ధర్మము. అన్య నిష్ఠంబుగాఁ దోఁచునది యాగంతుకము. అటుల తోఁచునా ? యనిన తోఁచును. అది యెటులనఁగా, ఓడయెక్కి పోయెడి పురుషునకు నజ్ఞానము చేతను ఓడయందున్న చాంచల్యము తీరస్థములయిన వృక్షాదులయందును, తీరస్థవృక్షాదినిష్ఠమయిన అచాంచల్యమును ఓడయందు నెటుల తోచు చున్నదో, అటులనే త్రివిధకరణనిష్ఠమయిన కర్తృత్వము అజ్ఞానము చేతను ఆత్మనిష్ఠముగాఁ దోఁచుచున్నది. ఆత్మనిష్ఠమయిన అకర్తృత్వము త్రివిధకరణ నిష్ఠముగాఁ దోఁచుచున్నది.

ఇందుకు దృష్టాంతము :
            చంద్రునిఁజూచు పురుషునికి మేఘనిష్ఠమయిన చాంచల్యము చంద్ర నిష్ఠముగాను, చంద్రనిష్ఠమయిన చాంచల్యము మేఘనిష్ఠముగాను యెటుల తోఁచుచున్నదో, అటుల త్రివిధకరణనిష్ఠమయిన కర్తృత్వము అజ్ఞానము చేతను ఆత్మ నిష్ఠముగాఁ దోఁచుచున్నది. కనుక ఆత్మకు కర్తృత్వము ఆగంతుకమే అయిన, త్రివిధకరణంబులకును కర్తృత్వము కలిగినఁగదా! అది ఆత్మనిష్ఠంబుగాఁ దోఁచుచున్నదని చెప్పవచ్చును. త్రివిధకరణంబులును అచేతనంబులు గాన, వానికి కర్తృత్వము చెప్పనే కూడదు. అది యెటు లనిన, లోకంబునందు చేతనులకు కరణసాపేక్షంబుగాఁ గర్తృత్వము కానఁబడుచున్నది గనుక, అచేతనంబు లయిన త్రివిధకరణంబులకు కర్తృత్వము చెప్పనే కూడదు. చెప్పినచో చేతనత్వంబును కరణాంతరంబునుం గల్పింపవలయును. అటుల కల్పింపఁగూడదు గనుక, త్రివిధ కరణంబులకును కర్తృత్వమే కూడదని చెప్పుద మన, అటుల చెప్పఁగూడదు. అది యెట్టులనిన, లోకంబునం దచేతనంబులకే కర్తృత్వము కానఁబడుచున్నది గనుక, అచేతనంబులయిన త్రివిధకరణంబులకును కర్తృత్వము చెప్పవచ్చును. లోకమునందచేతనంబులకుఁ గర్తృత్వం బెక్కడ కానఁబడుచున్నదనిన, వాయ్వాదులయందు కానఁబడుచున్నది. ఎటువలె ననిన, అచేతనమయిన వాయువునకు కరణంబులును, చేతనత్వంబును అపేక్షింపకయే వృక్షాదులను విఱచుటయనెడి క్రియను గూర్చి కర్తృత్వము కానఁబడుచున్నది. ఇంతమాత్రమే కాదు. ప్రవాహమునకుఁ గరణంబును, జేతనత్వంబును అపేక్షింపకయే వృక్షాదులను పెరుకుట యనెడి క్రియను గూర్చి కర్తృత్వము కానఁబడుచున్నది. కనుక అచేతనంబులయిన త్రివిధ కరణంబులకును జేతనత్వంబును కరణాంతరంబును కల్పింపకయే త్రివిధ కర్మములను గూర్చి కర్తృత్వము కూడును. అయితే త్రివిధ కరణములచేతం జేయఁబడిన పుణ్యపాప మిశ్రకర్మంబు లెవ్వి యనిన, సవిశేషచింతయు, నిర్విశేషచింతయు, పరలోకచింతయు, పరహితచింతయు, భక్తిజ్ఞాన వైరాగ్యచింతయు, మనస్సు చేతఁ జేయఁబడిన పుణ్యకర్మంబులు. సర్వదా విషయచింతయు, పరాహితచింతయు, వేదశాస్త్ర ప్రామాణ్యచింతయు, ధర్మాధర్మాద్యభావచింతయు, పరలోకాద్యభావచింతయు ననునివి మొదలగు నవి మనస్సుచేతఁ జేయంబడిన పాపకర్మంబులు. సవిశేష నిర్విశేషధ్యాన కాలాదులయందుఁ జేయఁబడిన విషయాదిచింత మనస్సు చేతఁ జేయఁబడిన మిశ్రకర్మము. వేదాధ్యయనంబును, శాస్త్ర పఠనంబును, గీతాసహస్ర నామాదిపఠనంబును, గాయత్రీ పంచాక్షర్యాది జపంబులును, భగవన్నామ సంకీర్తనంబును, పరోపకార వార్తాదులును ఇవి మొదలగునవి వాక్కుచేతఁ జేయఁబడిన పుణ్యకర్మంబులు. పెద్దలను దూషించుటయు, పరుల నాడరానిమాట లాడుటయు, అసత్యములు పలుకుటయు, చాడీలు చెప్పు టయు నివి మొదలగునవి వాక్కువలనఁ జేయఁబడిన పాపకర్మంబులు. వేదాధ్యయన జపాది కాలంబులయందు లౌకిక వార్తయు, ప్రమాణములు సేయుటయును, వాక్కుచేతఁజేయఁబడిన మిశ్రకర్మంబులు. పుణ్యతీర్ధంబు లందు స్నానం బొనర్చుటయు, గురు దేవతా నమస్కారంబులాచరించు టయు, పరులను పీడింపకుండుటయు, అంగప్రదక్షిణంబును ఇవి మొదలగు నవి కాయముచేతఁ జేయఁబడిన పుణ్యకర్మంబులు. సర్వదా పరులను పీడించుటయును, పరస్త్రీ సంగమంబును, పరధనాపహరణంబును, దొంగిలుటయును, విటకాండ్రంగూడి సంచరించుటయును ఇవి మొదలైనవి కాయముచేతఁ జేయఁబడిన పాపకర్మములు. బ్రాహ్మణజన భోజన నిమిత్తమయి బ్రాహ్మణులను పీడించుటయు, పరుల ద్రవ్యము నపహరించి చలివెందరలు పెట్టుటయు, గుడి గోపురములును, మఠాదులును గట్టు టయు, వెట్టి మనుష్యులచేత గుంటలు మొదలైన వానిని త్రవ్వించుటయు, బ్రాహ్మణ వృత్తుల నపహరించి దేవాలయంబులకు విడుటయు ఇవి మొదలైనవి కాయముచేతఁ జేయఁబడిన మిశ్రకర్మములు. ఇటువలెనే త్రివిధ కరణములచేతను, త్రివిధకర్మములును చేయఁబడుచున్నవి. ఈ విచారణకు ఫలమెద్ది యనిన, ముఖ్య ఫలమనియు, అవాంతర ఫలమనియు రెండు విధములు. ఇందున ముఖ్యఫల మేమనిన, ఈ త్రివిధకర్మంబులును త్రివిధ కరణంబులే చేయుచున్నవి. ఆత్మ యొక కర్మంబునుం జేయదు. ఆ యకర్తయైన యాత్మ నే నని దృఢ నిశ్చయము కలుగుటయే ముఖ్య ఫలము. అవాంతరఫలం బెయ్యది యనిన, ఇటు వలెనే నిశ్చయ జ్ఞానము గలిగినను త్రివిధకరణములను పుణ్యకర్మంబులయందే వర్తింపఁ జేయ వలయును. ప్రమాదవశంబున పుణ్యకర్మంబుల యందు త్రికరణంబులును వర్తింపక పోయినను, ఆ త్రివిధకరణములను మిశ్రకర్మలయం దైనను వర్తించు నటులఁ జేయింపవలయును. సర్వవిధముల చేతను పాపకర్మల యందు కరణములను వర్తింపకుండఁ జేయవలయును. ఇది యీ విచారణకు అవాంతర ఫలము. ఒకటికి రెండు ఫలములు కలుగునా యనిన, కలుఁగును. అది యెటువలెనంటే అరఁటిచెట్టు పైరు పెట్టినవానికి అరఁటిపండ్లు తనకు కావలసినట్లు వినియోగము చేసికొనుట యెటుల ముఖ్యఫలమో, ఆకులు, పువ్వులు, కాయలు, నార, బొందె, పిలకలు మొదలైనవి యనుభవించుట యెట్లు అవాంతర ఫలమో అటులనే ఈ విచారణకును ముఖ్యఫలమనియు, నవాంతర ఫలమనియు రెండు విధంబులు. అయితే త్రివిధకరణంబును ఒకదానివలన ప్రేరేపింపఁబడి త్రివిధంబులగు కర్మంబులం జేయుచున్నవో, లేక తానే చేయుచున్నదో యనిన, తానే చేయు చున్నదని చెప్పుదమనిన, అటుల చెప్పఁగూడదు. చెప్పినట్లయిన పరుసవేది మొదలయినవి కారణంబులు గనుక, వానికిని ప్రేరకుని యపేక్ష లేకయే కర్తృత్వము రావలెను. అటుల లేదు. కనుక ఒకటిచేత ప్రేరేపింపఁబడుచున్న దని చెప్పవలెను. అయితే చేతనుని వలన ప్రేరేపింపఁబడి చేయుచున్నదని చెప్పుదమనిన, చేతనుఁడైన యాత్మ నిర్వికారుఁడు గనుక చేతనునిచే ప్రేరేపింపఁబడి చేయుచున్నదని చెప్పఁగూడదు. మరి యెటులనిన ఆ చేతనునిచేతనే ప్రేరేపింపఁబడి చేయుచున్నదో, అచేతనుని వలనం ప్రేరేపింపబడి చేయుచున్నదో అనిన, చేతనుని చేత ప్రేరేపింపబడి చేయుచున్నదని చెప్పవలయును. ఇటుల నచేతనునిచేత ప్రేరేపింపబడ్డదని చెప్పవచ్చుననిన, చెప్పఁగూడదు. అటుల చెప్పిన ఘటము ఘటాంతరంబుచే ప్రేరేపింపఁబడినదై జలాహరణాది క్రియలను  చేయ వలయును. అటుల కానము గనుక, నేను గుడి గట్టించితి, సహస్ర బ్రాహ్మణ భోజనము సేయించితినని యాత్మనిష్ఠముగానే కారయితృత్వము తోఁచుచున్నదని చెప్పుదమనిన, ఆత్మ నిర్వికారుఁడు గాన, ఆత్మకు కారయితృత్వము చెప్పఁగూడదు. అయిన ఈ కారయితృత్వానుభవంబునకు గతి యేది యనిన, అన్యనిష్ఠమైన కారయితృత్వము ఆత్మయందు తోచుచున్నది గనుక, ఆత్మకు కారయితృత్వము ఆగంతుకమనియే చెప్పవలెను. అన్యనిష్ఠమైన కారయితృత్వము ఆత్మయందు తోఁచుచున్నదని యెందుకు చెప్పవలెను? ఆత్మకు స్వాభావికమేయని చెప్పరాదా అనిన, అటుల చెప్పరాదు. స్వాభావికమని చెప్పినట్టులయితే కారయితృత్వ నివృత్త్యర్థమై యెవరును యత్నము సేయక యుండవలయును. ముముక్షువులయినవారలు యత్నము సేయుచున్నారు గనుక, ఆత్మకు కారయితృత్వము స్వాభావికమని చెప్పఁగూడదు. ఆత్మకు కారయితృత్వము స్వాభావికంబునుం గానీ, యత్నంబునుం జేయనీ అనిన, స్వాభావికమనఁగా స్వరూపము గనుక, స్వరూప నాశనార్థము గానే చేయుచున్నారని ప్రమాద దోషము వచ్చును. అటుల స్వరూప నాశనార్థముగా నెవరును యత్నము సేయరు గనుక, స్వాభావిక కారయితృత్వ నివృత్యర్థమై యత్నము సేయుచున్నారని చెప్పఁగూడదు. ఇంతియ కాదు. స్వాభావికమైన కారయితృత్వమునకు నివృత్తి వచ్చునప్పుడు స్వరూపమే నశించి పోవుచున్నది గనుక, కారయితృత్వముచేత విడువబడి అకారియితయై ఉండేవాడు ఎవడును లేకపోవలయును. కాన కారయితృత్వము స్వాభావికమని చెప్పగూడదు. కారయితృత్వము స్వాభావిమును గానీ, నివృత్తియుఁ గానీ అనిన, అగ్నికి ఉష్ణత్వము స్వాభావికము గదా ! స్వాభావికమైన ఉష్ణత్వమునకు మణి మంత్రౌషధముల చేత నెటుల నివృత్తి వచ్చుచున్నదో అటులనే ఆత్మకును స్వాభావికమయిన కారయితృత్వమునకును ఉత్కృష్ట కర్మోపాసనాద్యనుష్ఠానములచేత నివృత్తి వచ్చుచున్నదని చెప్పుదమనిన, అగ్నికి ఉష్ణత్వము కాలాంతరమందు మణిమంత్రాది వియోగము చేత నెటుల నావిర్భవించుచున్నదో అటులనే యాత్మకును కారయితృత్వము ఉత్కృష్టకర్మోపాసనా ఫలమునకు నాశము వచ్చుచుండఁగా తిరుగా నావిర్భవించును. ఇటుల చెప్పినట్టులయిన కారయితృత్వ నివృత్తి రూపమయిన ముక్తికి జన్యత్వంబును అనిత్యత్వంబును వచ్చును. ఇంతియ కాదు. ఆత్మ అకారయితఅని చెప్పు శ్రుతులకు వైయర్థ్యము సంభవించును. సుషుప్తియం దాత్మ ఉన్నాఁడు గనుక, అచట కారయితృత్వము తోఁచవలయును. సుషుప్తియం దాత్మ యున్నచో కారయితృత్వమెందుకు తోఁచవలయును అనిన, ఉపాధ్యాయులకు అధ్యాపకత్వంబు స్వాభావికంబుగా నున్నను నియమ్యులయిన శిష్యులు సన్నిధానంబునందు లేకున్న పక్షంబున నెటుల నధ్యాపకత్వము తోపకున్నదో శిష్యులు సన్ని ధానమందుండుటవలన నెటుల నధ్యాపకత్వము తోఁచుచున్నదో రాజ ప్రభృతులకు నియంతృత్వము స్వాభావికంబుగా నున్నను నియమ్యులయిన మంత్రిపురోహితాదులు సన్నిధానమునందు లేకున్న పక్షమందు నియంతృత్వ మెటుల తోఁచలేదో, ఆ మంత్రి పురోహితాదులు సాన్నిధ్యమునందున్న నియంతృత్వం బెటులదోఁచుచున్నదో, అలాగుననే ఆత్మకును సుషుప్త్యవస్థ యందు కారయితృత్వము స్వాభావికమై యున్నప్పటికిని నియమ్యులగు త్రివిధకరణ సంపర్కము లేనందున కారయితృత్వము తోఁచలేదు. జాగ్రత్స్వ ప్నంబులయందు నియమ్యంబులగు కరణ సంయోగంబున్నది గనుక కారయితృత్వంబు దోఁచుచున్నదని చెప్పిన, తూష్ణీంభూతావస్థయందును కరణ సంపర్కంబున్నది గాన, నచ్చట ఆత్మకు కారయితృత్వము స్వాభావికమని చెప్పఁగూడదు. ఆగంతుక మనియే చెప్పవలయును. ఆగంతుక మనఁగా, అన్యనిష్ఠమయిన ధర్మం బన్యనిష్ఠంబున దోఁచును. అది యెటులనిన, జపా కుసుమము యొక్క లోహితత్వము స్ఫటిక నిష్ఠముగా నెటుల దోఁచుచున్నదో, అగ్నినిష్ఠమయిన ఉష్ణ ప్రకాశత్వములు అయఃపిండనిష్ఠము గాను, అయఃపిండనిష్ఠమయిన దీర్ఘత్వవర్తుల త్వాదులు అగ్నినిష్ఠముగాను, రాగద్వేషాది నిష్ఠమయిన కారయితృత్వము అజ్ఞానము చేత నాత్మనిష్ఠము గాను, ఆత్మనిష్ఠంబయిన అకారయితృత్వము రాగద్వేషాదినిష్ఠముగాను తోఁచుచున్నవి. అచేతనంబులకు కారయితృత్వము చెప్పఁగూడదు. చెప్పినచో ఘటంబు ఘటాంతరంబును ప్రేరేపింప వలయునుగదా. అందుకు సమాధానంబేమి యనిన, అక్కడ యోగ్యత లేదు గనుక, ప్రేరకత్వము కూడదు. యోగ్యత కలదానియందు ప్రేరకత్వము కూడునని తోఁచుచున్నది. యోగ్యత గలచోటను ప్రేరేపకత్వ మెక్కడ కనుపడిన దనిన, అగ్ని హోత్రము మందుతోఁ గూడుకొనియుండు ఫిరంగి గుండ్లచేత చతురంగ బలమును సంహారము చేయుచున్నది. కనుక అచేతనంబగు నగ్నికి అచేతనములయిన పాషాణాదులను గూర్చి ప్రేరకత్వము కానఁబడుచున్నది. ఇంతియగాక, ప్రేత శరీరంబునకును స్వకీయ జ్ఞాతిజనులచేతఁ జేయఁబడిన క్రియలను గూర్చి కారయితృత్వంబు గానఁబడుచున్నది. అటులనే అచేతనంబులగు రాగ ద్వేషాదులకును త్రివిధకరణంబుల వలనఁ జేయఁబడిన త్రివిధ కర్మంబులం గూర్చి కారయితృత్వంబుఁ జెప్పవలయును. ఇటుల చెప్పిన పక్షమందు ఆత్మకు సర్వాంతర్యామిత్వమును జెప్పునట్టి శ్రుత్యాదులకు తాత్పర్యంబేమి యనిన, ఆత్మ నిర్వికారుఁడు గనుక ఆత్మకు నస్మదాదులవలె కారయితృత్వము చెప్పఁగూడదు. మఱియెట్టులనిన, ఆదిత్యుని యొక్క సన్నిధానము చేతను, సమస్త ప్రాణులును, స్వకార్యంబులం దెటుల ప్రవర్తించుచున్నారో, అయస్కాంత సాన్నిధ్యముచేత అయస్సు ఎటుల చలించుచున్నదో, అటుల నాత్మసాన్నిధ్య మాత్రముచేత సమస్తమయిన జగత్తును చలించుచున్నదని, శ్రుతి స్మృత్యాదులకు తాత్పార్యమని చెప్పవలయును. అటుల చెప్పినందు వలన ఆత్మకు నిర్వికారత్వము సిద్ధించునా! యనిన, సిద్ధించును. అది యెటులనఁగా ఆదిత్య ప్రకాశ సాన్నిధ్యము చేతను సకల ప్రాణులును వ్యాపారము సేయుచున్నప్పటికిని ప్రాణనిష్ఠములయిన వికారములు ఆ సూర్యు నెటుల నంటవో, అయస్కాంత సాన్నిధ్యము వలన అయస్సు చలించినను అయోనిష్ఠములయిన వికారములా అయస్కాంతము నెటుల స్పృశింపలేవో అటులనే ఆత్మ సన్నిధానము వలన సమస్తేంద్రియంబులు చలించినప్పటికిని ఇంద్రియ నిష్ఠములయిన వికారంబులాత్మను కాలత్రయంబుల యందును  స్పృశింపనోపవు. కాఁబట్టి ఆత్మకు నిర్వికారత్వము కూడును.

            ఈ విచారణంబునకు ఫలం బేమనిన, రథము నడిపించుటయందు నధికారులైనవారిచేత తేరు నడపించు వ్యాపారంబభిమానము వలన వారలకు నియంతలై స్వస్థులైన ప్రభువులయందు నేను రెండు గడియలలోనే తేరు పఱచునటుల చేసితి నని యెటువలెఁ దోఁచుచున్నదో, అటులనే రాగద్వేషాదినిష్ఠమయిన కారయితృత్వము అభ్యాసము చేత ఆత్మనిష్ఠముగాఁ దోఁచుచున్నది. విచారించిన యెడల ఆత్మకు కారయితృత్వము లేదు గనుక, అకారయితయైనను, నిర్వికారుఁడై తన్ను ఆత్మ నేననెడి దృఢనిశ్చయము గలుగుటయే యీ విచారమునకు ఫలము. ఈ యర్థంబునందు సంశయంబు లేదు. సిద్ధము.

            శ్లో||  త్రివిధై రేవ కరణైః పుణ్యపాపం చ మిశ్రకం
                       క్రియతే న మయా కర్మేత్యేవం బుద్ధిర్విముచ్యతే
                       రాగాద్యై రేవ నిర్వర్త్యం ప్రేరకత్వం న మే క్వచిత్‌
                       ఇతి యస్య దృఢా బుద్ధి స్సముక్త స్సచ పండితః

ఇది పంచమ వర్ణకము