17. అవస్థాత్రయసాక్షిత్వ ప్రకరణము

నవమ వర్ణకము
అవస్థాత్రయసాక్షిత్వ ప్రకరణము

  శ్లో||  జాగ్రత్స్వప్న సుషుప్త్యాఖ్యా అవస్థాః కాః కిమాత్మనః
           సా క్షేత్ర మాసా మిత్యేత త్సదృష్టాంతం విచార్యతే

            ఆత్మకు అవస్థాత్రయసాక్షిత్వము శ్రుతులయందుఁ జెప్పఁబడి యున్నది. అవస్థాత్రయంబు నెఱుంగకయే అవస్థాత్రయసాక్షిత్వంబు నెఱుంగరాదు గాన, ముందుగ నవస్థాత్రయం బన నెయ్యదియో విచారింపు దము. అవస్థాత్రయ మనఁగా జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ అని మూఁడు విధంబులు. అందులో జాగ్రదవస్థ యనఁగా సకలేంద్రియంబుల వలనను బాహ్యార్థజ్ఞానం బెంతపర్యంతంబు గలుగుచున్నదో అంత పర్యంతంబును జాగ్రదవస్థ. స్వప్నావస్థ యనఁగా సకలేంద్రియంబుల వలనను బాహ్యార్థజ్ఞానము రాక మనస్సే విషయాకారంబుగాఁ బరిణమించి కర్త్రాద్యాకారంబుగా నెంతపర్యంతంబు దోఁచుచున్నదో అంత పర్యంతంబును స్వప్నావస్థ. సుషుప్త్యవస్థ యనఁగా సకలేంద్రియంబుల వలనను బాహ్యార్థ జ్ఞానంబు లేక, మనస్సునుం గర్త్రాద్యాకారంబుగాఁ బరిణ మింపక, విషయాద్యాకారంబుగానైననుం దోఁపింపక, బుద్ధి కారణాద్యా కారంబుగా నెంతపర్యంతం బుండునో అంతపర్యంతంబును సుషుప్త్యవస్థ. ఈ యవస్థాత్రయసాక్షిత్వం బాత్మకు ఎటుల వచ్చినదనిన, అవస్థాత్రయంబు తోడం గూడుకొని యుండియు నామూఁడవస్థలను వాని యొక్క వ్యాపారం బులను, అవస్థాత్రయవాసులను నెఱుంగునదియే యవస్థాత్రయసాక్షిత్వమని చెప్పఁబడును. ఈ సాక్షిత్వంబున కీవిశేషంబులన్నియు గావలయును.

            ఇందుకు దృష్టాంతము : ఏకాంతముగా మఠాదిస్థల విశేషంబు లందు జపంబు చేసికొనుచుండునట్టి యొక పురుషుని సన్నిధియందు అప్పు ఇచ్చి పుచ్చుకొనిన యిద్దరు పురుషులు అచ్చట నొక ముహూర్త కాలము జపము చేయుచుండి తరువాత అప్పు యిచ్చినవాఁడు పుచ్చుకొనిన వాఁడు, లేకయే చేత నప్పుగాఁదీసుకొనిన ద్రవ్యంబు నిమ్మని యడుగ నతండీతరుణంబునం దియ్యఁజాలనని చెప్పుటయు, నా విషయమయి యొక ముహూర్తమాత్ర మాయిరువురును వాదించుచుండి, యటు తరువాతను అప్పు యిచ్చినవాఁడు పుచ్చుకొన్న వానిని పైక మిమ్మని యిబ్బంది చేయఁగా, నతఁడు నీకు నేను బాకీ లేదని పలుక, నాఋణదాత యా ఋణస్థుని మీఁద కోపించి కలహించి న్యాయస్థలంబునకుఁబోయి న్యాయాధిపతితో ఫలానివాఁడు నాయొద్ద అప్పు తీసికొనిన ద్రవ్యమును నే నడుగఁగా ధనము నిచ్చుటకు బదులుగా నన్నుఁగొట్టి నీకు నేను పైకంబు నియ్యవలసినది లేదని చెప్పినాఁడు. కాఁబట్టి న్యాయమును విచారించి నా బాకీదారుని వల్ల నాకు రావలసిన ధనమును నిప్పింపవలసిన దని విన్నవింపఁగా ఆ న్యాయాధిపతి ఋణముఁబుచ్చుకొనిన మనుష్యుని పిలువంబనిచి నీకు అప్పు యిచ్చినవాఁడు తన పైకమిమ్మని యడుగ న్యాయ ప్రకార మియ్యక యతని నేలకొట్టితి వని యడిగిన నా ఋణస్థుఁడు న్యాయాధిపతికి నెదురుగా నిలిచి అయ్యా ! నేనితనిం గొట్టలేదు. యితఁడే నన్నుఁగొట్టి నేను తన తప్పిదమును బయలుపరతునను శంకచేత ఫిర్యాదు చేసినాఁడని జవాబుఁ జెప్పెను. అప్పుడు ఆ న్యాయాధితిపతి యావాది ప్రతి వాదుల వాఙ్మూలములు అన్యోన్య విరుద్ధములయి యుండుటను చూచి ‘‘యిందుకు సాక్షు లెవ్వరం గలరా’’ యని యడిగెను. అప్పుడు వారు ఉభయులును సాక్షులు కలరని చెప్పినట్లయిన నే సాక్షివలన వారి యొక్క యాథార్థ్యము బయలుపడునో ఆ సాక్షియందు పూర్వము చెప్పఁబడిన సాక్షిత్వమున్నది. అది యెట్లనిన ఆ వాది ప్రతివాదు లిద్దఱును ఎంత పర్యంతము మౌనంబుగా నుండిరో అంత పర్యంతంబును సుషుప్త్యవస్థకు దృష్టాంతము. ఆ యవస్థయందు వ్యాపార త్రయంబును లేదు. ఆ మౌనంబుగా నుండిన యిరువురును అవస్థావాసులు. ఆ వాది ప్రతివాది లెంతవఱకు సౌజన్యంబుగా మాటలాడు కొనుచుండిరో అంతవఱకును స్వప్నావస్థకు దృష్టాంతము. ఆ స్వప్నావస్థ యందు వ్యాపారత్రయంబును గలదు. ఆ మూఁడు వ్యాపారంబులు నెయ్యవి యనిన (హస్త చలనాదులు, కాయిక వ్యాపారములు  అన్యోన్య సంభాషణంబులు, వాచిక వ్యాపారములు, ఉత్తర ప్రత్యుత్తరంబులకు చింతించుట మానసిక వ్యాపారములు) మృధుభాషులగు వారు ఉభయులు నవస్థావాసులు. ఆ వాది ప్రతివాదులు ఎంతసేపు కలహంబు సేయుచుండిరో అంతసేపటి వరకు జాగ్రదవస్థకు దృష్టాంతము. ఆ యవస్థయందు వ్యాపార త్రయంబును గలదు. ఆ మూఁడు వ్యాపారంబులు నెయ్యవి యనిన అన్యోన్య తాడనాదులు కాయిక వ్యాపారంబులు. పరస్పర పౌరుషోక్తులు, వాచిక వ్యాపారములు. అన్యోన్య మర్మ చింతనంబులు, మానసిక వ్యాపారములు. కలహించుచున్న వారిరువురును అవస్థావాసులు. వీరల కలహమును చూచుచుండిన మధ్యస్థుండయిన దేవదత్తుఁడు అస్థాత్రయ యుక్తులగు వారలకు సహాయంబుగా నొక్క మాటయైన నాడలేదు గాన, అవస్థాత్రయముతోఁ గూడుకొని యుండి యా మూఁడవస్థలను వాటియొక్క వ్యాపారంబులను ఆ యవస్థాత్రయ వాసులను నెఱుగుచున్నాఁడు. కనుక ఆమధ్యస్థుఁడయిన దేవదత్తునియందు సాక్షిలక్షణంబున్నది. కాఁబట్టి సాక్షియైన ఆత్మయందిన్ని విశేషంబులు నున్నవి అది యెట్లనిన, అవస్థాత్రయముతోఁ గూడుకొని యుండుటయును, అవస్థాత్రయంబును, అవస్థాత్రయవ్యాపారంబులును నెఱుంగుటయును ఈ నాలుగు విశేషణంబులును సాక్షియైన ఆత్మయందిన్ని విశేషంబులు నున్నవి. అది యెట్లనిన, అవస్థాత్రయముతోఁ గూడుకొని యుండుటయును, అవస్థాత్రయంబును, అవస్థాత్రయ వ్యాపారంబులును నెఱుంగుటయును ఈ నాలుగు విశేషణంబులును సాక్షియైన ఆత్మయం దున్నవి. దాష్ట్రాంతికంబునం దవస్థాత్రయంబేమి యనిన, జాగ్రత్స్వప్న సుషుప్తులని మూఁడు విధంబులు. అందు జాగ్రత్త యనఁగా నిదురపోయి లేచినది మొదలుకొని తిరుగా నిదురవచ్చునంత పర్యంతంబును జాగ్రత్త యని చెప్పఁబడును. ఇందుకు దృష్టాంతము: విశాలమైన పట్టణమువలె జాగ్రదవస్థ. ఆ పట్టణంబునందు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రవీధులవలె జాగ్రదవస్థయందు కాయిక వాచిక మానసిక వ్యాపారంబులున్నవి. ఆ పట్టణము యొక్క హానివృద్ధులకు అభిమానియైన ప్రభువువలె జాగ్రదవస్థ యందు వచ్చెడి సుఖ దుఃఖములచేత తపించు చుండెడిది విశ్వుండవస్థా వాసుఁడు. స్వప్నావస్థయనిన, నిద్రాకాలంబునందు జాగ్రద్వాసనామ యంబయిన మనస్సు చేత కల్పింపఁబడిన ప్రపంచంబునందు ప్రాతిభాసిక జీవుం డెంతపర్యంతము వ్యవహరించుచున్నాఁడో అంత పర్యంతంబును స్వప్నావస్థయని చెప్పఁబడును. ఇందుకు దృష్టాంతము: పైనఁ జెప్పిన పట్టణములోపలి కోటవలె స్వప్నావస్థ. ఆ కోట లోపలి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్ర వీధులవలె నీ స్వప్నావస్థయందు కాయిక వాచిక మానసిక వ్యాపారంబులున్నవి. ఆ కోటయొక్క హాని వృద్ధులకు అభిమానియైన ప్రభువువలె నీ స్వప్నావస్థయందు వచ్చెడి సుఖదుఃఖములచేత తపించు చుండెడి తైజసుఁడు స్వప్నావస్థావాసుఁడు. సుషుప్త్యవస్థయనఁగా, బాహ్య వ్యాపారంబును, అంతర్య్వాపారంబును, దేహేంద్రియాదిస్మరణయును లేక జీవుఁడు నిశ్చేష్టుఁడై యెంత పర్యంతము నిద్రపోవుచున్నాఁడో అంత పర్యం తంబును సుషుప్త్యవస్థయని చెప్పఁబడును. ఇందుకు దృష్టాంతము: ఆ కోటయందుండు నగరువలె సుషుప్త్యవస్థ. ఆ నగరునందు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రవీధులెటుల లేవో అటుల సుషుప్త్యవస్థయందు కాయిక వాచిక మానసిక వ్యాపారంబులు లేవు. ఆ నగరుయొక్క హానివృద్ధుల కభిమాని యయిన ప్రభువువలె సుషుప్త్యవస్థయందు నిజానందముననుభవించు చుండెడి ప్రాజ్ఞుఁడు సుషుప్త్యవస్థావాసుఁడు.

            ఆత్మకు అవస్థాత్రయమును గూర్చి సాక్షిత్వ మెట్లనిన, నిన్నటి జాగ్రద వస్థయును, జాగ్రదవస్థయందు చేయఁబడిన కాయిక వాచిక మానసిక వ్యాపారంబులును, ఆ యవస్థావాసుఁడును, నిన్నటి స్వప్నావస్థయును, ఆ స్వప్నావస్థయందు చేయఁబడిన కాయిక వాచిక మానసిక వ్యాపారంబు లును, ఆ యవస్థావాసుండును, నిన్నటి సుషుప్త్యవస్థయును ఆ సుషుప్త్యవస్థ యందు ఏ వ్యాపారంబునుం జేయకుండుటయును ఆ యవస్థావాసుఁడును ఇవియన్నియు నేఁడు దోఁచుచున్నవి గనుక, ఇది స్మరణమో అనుభవమోయనిన, స్మరణమని చెప్పవలెను. అనుభవమని చెప్పుదమనిన ఇప్పుడా విషయసన్నికర్షణము లేదు గనుక, అనుభవమని చెప్పఁగూడదు. స్మరణమని చెప్పవలెను. అయితే ఈ స్మరణంబనుభూతవస్తు విషయమై వచ్చుచున్నదా యనిన, అనుభూతవస్తువిషయమయ్యే వచ్చుచున్నది. అయిన ననుభూతవస్తు విషయమై వచ్చుచున్నదని చెప్పదమనిన, ప్రపంచ వ్యాపారంబంతయును మనస్సుచేత స్మరింపబడవలయును. అటుల స్మరింప బడలేదు గాన, స్మరణంబనుభూతవిషయమని చెప్పవలెను. అయినచో అనుభూత విషయమై యెవరిచేత ననుభవింపబడినదనిన, మనచేతనే అనుభవింపఁబడినది. అట్లయిన మనము కూడియుండి యనుభవించితిమో కూడియుండక యనుభవించితిమో యనిన, కూడి యనుభవించితిమి. కూడి యుండి యనుభవించితిమని చెప్పుదమనిన, స్వర్గాదులయందుండెడి విషయానుభవములను మనమిప్పుడే యనుభవింపవలెను. అటుల యను భవింపలేదు గాన, కూడుకొనియుండి విషయాదులననుభవించితిమని చెప్పఁగూడదు. చెప్పిన యెడల అవస్థలను అవస్థావ్యాపారంబులను అవస్థా వాసులను అనుభవించితిమని చెప్పవలెను. అయినను కూడక యుండుట యెట్లనిన, నిన్నటి జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలును ఆ యవస్థా వ్యాపారములును అవస్థావాసులును నశించిపోయి మనము ఉన్నాము గనుక మనమాయవస్థా వాసులతోఁ గూడలేదు. అటుల కూడినట్లయిన ఆ యవస్థాదులు నశించిపోయినట్లు మనము నశించిపోదుము. కూడి యుండిన నశించిపోవలెనని నియమము కలదు. అది యెట్లనిన, వస్త్రముతోఁ గూడుకొనియుండెడి చిత్ర విశేషములు వస్త్రములు నశించి నప్పుడు వానితోఁగూడ నెటుల నశించి పోవుచున్నవో అటులనే మనము ఆ యవస్థాత్రయముతో కూడియుండినట్లయితే  అవి నశించినప్పుడే నశించి పోదుము. కాఁబట్టి అవస్థాత్రయములతో మనము కూడక ఆ యవస్థలను, అవస్థావ్యాపారములను, అవస్థావాసులను నెఱుఁగుచున్నాము. అందువలన సాక్షిలక్షణము మనయందు ఉన్నది. కనుక మనమే అవస్థాత్రయసాక్షియని యెఱుంగునది. అయితే యిప్పుడు చెప్పిన ప్రకారము అవస్థాదుల నెఱింగెడి వాఁడు సాక్షియని సెలవిచ్చితిరి. అవస్థలను, అవస్థావ్యాపారములను ఎఱుఁగుచున్న వాఁడు అవస్థావాసుఁడు గదా యనిన, ఆ యవస్థావాసునికి సాక్షిత్వము సిద్ధించియుండఁగా నతనికి సాక్షిత్వము లేదనుటయు, ఆ యవస్థావాసునికంటె వ్యతిరిక్తుఁడైన వానికి సాక్షిత్వము కలదనుటయు కూడును. అది యెట్లనిన, అవస్థావాసుఁడు బాహ్యములయిన వృక్షాదులవలె ఆంతరమయిన దేహాదులవలె వికారియై యున్నాఁడు గనుక, ఆ వృక్షాదులకు దేహాదులకు అన్య పదార్ధావభాసక రూపమయిన సాక్షిత్వము ఎట్లు లేదో అటులే వికారియైన యవస్థావాసునికిని, అవస్థలకు, అవస్థావ్యాపారము లకును అవభాసక రూపమయిన సాక్షిత్వము లేదు. అయిన అవస్థావాసుఁడు వికారియగును. అది యెట్లన, అవస్థావాసుఁడు నిన్న ఎటువంటి సుఖదుఃఖములచేత తపించుచుండెనో అటుల నేఁడును తపించుచుండక అంతకంటె నతిశయముగా నయినను కొద్దిగా నయినను సుఖదుఃఖములచేత తపింపు చున్నాఁడు. కనుక వీఁడు వికారియగును. కనుక వీనికి సాక్షిత్వము కూడదు. అయితే వీనికంటె వ్యతిరిక్తమయిన సాక్షియని యొకటి కానమే; కలదని యెటుల యెఱుఁగ వచ్చుననిన, యెఱుఁగవచ్చును. ఎటులనిన, ఈ యవస్థా వాసుఁడు నిన్న ఏ సుఖదుఃఖములతోఁ గూడుకొని యుండెనో ఆ సుఖదుఃఖములలో నేఁడును కూడుకొని యుండక అంతకంటె న్యూనాధికములగు సుఖదుఃఖములతో కూడుకొనియున్నాఁడని ఈ యవస్థావాసుని యొక్క వికారముల నెవఁడెఱుంగుచున్నాఁడో, వాఁడు యవస్థావాసునికంటె వ్యతిరిక్తుఁడయిన సాక్షియని యెఱుంగవచ్చును. అయితే నిర్వికారియైన ఆత్మ నేను సాక్షియని యెఱుంగదు. వికారియైన యవస్థావాసుఁడుకదా, నేను సాక్షియని యెఱుంగుచున్నాఁడు? ఆ పక్షమందు నిర్వికారుఁడయిన ఆత్మను ఎటుల సాక్షియని చెప్పవచ్చును? ఇందుకు దృష్టాంతము : దర్పణా లోకంబునందు గ్రీవస్థమయిన ముఖము దర్పణంబు నందు ప్రతిబింబింప నా ప్రతిబింబము ద్వారా తనయొక్క సౌందర్య కురూపత్వాదుల నెటుల యెఱుంగుచున్నాఁడో అటుల నిర్వికారుఁడయిన ఆత్మ అంతఃకరణంబు నందు ప్రతిబింబించి యా ప్రతిబింబ రూపమయిన వాఁడు కర్తయై శ్రుత్యర్థ విచారముచేసి యావికారము లయిన ప్రతిబింబ రూపమే తాను నిర్వికారుఁడును, పరిపూర్ణుఁడయిన బ్రహ్మంబును, సాక్షియునని యెఱుంగుచున్నాడు. ఈ దృష్టాంతంబునందలి దృశ్యమైన దర్పణంబును, ఆదర్పణంబునందు దృశ్యమై తోఁచెడి యాభాసమును, గ్రీవస్థ ముఖంబునందుండెడి సౌందర్య కురూపత్వాదుల నెటుల నెఱుంగలేదో అటుల దృశ్యమయి వికారియైన అంతఃకరణంబును ఆ యంతఃకరణంబు నందు ప్రతిబింబించి దృశ్యుఁడును వికారియునైన చిదాభాసుఁడును తనకు పరమార్థ స్వరూపమయి అధిష్ఠానాత్మనిష్ఠమయిన సాక్షిత్వ నిర్వికారత్వ పరిపూర్ణత్వాదులను నెఱుఁగలేదు గాన, నిర్వికారుఁడయిన ఆత్మ నేను సాక్షినని యెఱుఁగకున్నను వికారియైన యవస్థావాసుఁడు నేను సాక్షినని యెఱిఁగినట్లుగా నున్నప్పటికిని వికారులగు నవస్థాత్రయ వాసులకు సాక్షిత్వము కూడదు. ఆ నిర్వికారుఁడయిన ఆత్మకే సాక్షిత్వము చెప్పవలెను. ఆ సాక్షిలక్షణము మనయందే యున్నది గనుక, మనమే సాక్షియనుటకు సందేహము లేదు. అయితే మనయందు ఈ సాక్షిత్వము పూర్వమే సిద్ధించి యున్నదా లేక యిప్పుడు సాధనముచేత సిద్ధింపవలసి యున్నదా ? యనిన, వివాదకర్తృత్వ సాక్షియం దుండునట్టి సాక్షిత్వము సాధనములచేత సిద్ధింపక పూర్వమే యెటుల సిద్ధించియున్నదో అటులే మనయం దుండెడి సాక్షిత్వంబును సాధనములచేత సిద్ధింపక పూర్వమే సిద్ధించి యున్నది. అయితే సాక్షిత్వ మెందుచేత తోఁపలేదనిన విచారింపలేదు గనుక తోఁపలేదు. విచారించినచో మనకే సాక్షిత్వము నిత్యసిద్ధమయి యున్నది. ఈ విచారమునకు ఫలంబేమనిన, పైన చెప్పిన వివాదకర్తృ సాక్షియైన దేవదత్తుని కంటె నన్యులయిన సంవాదులయొక్క అవస్థలును అవస్థావ్యాపారములును అవస్థా వ్యాపారత్వములును వివాదకర్తృసాక్షియైన దేవదత్తునికి లేదు గనుక, ఈ యవస్థాది వికారములు వానినెటువలె స్పృశింప లేవో ఈ యవస్థాదులనెల్ల నుదాసీనుఁడై చూచుచున్నాఁడు గనుక, ఈ యవస్థాదులకు సాక్షియయి యెటువలె నున్నాఁడో అటులనే మనకంటె నన్యమయిన సాభా సాహంకారము యొక్క అవస్థాత్రయంబును ఆ యవస్థాత్రయ వ్యాపారంబులును ఆ యవస్థాత్త్వంబును మనకు లేదు. కనుక ఆ యవస్థాది వికారములు సాక్షియయిన మనలను స్పృశించలేవు. మన మీయవస్థాదుల నెల్ల నుదాసీనులమయి చూచుచున్నాము గనుక, ఈ యవస్థాదులకెల్లను కాలత్రయంబునందును సాక్షియై యున్నారము అనుటయే ఈ విచారమునకు ఫలము. ఇటుల లెస్సగా విచారణచేసి నేనే సాక్షి స్వరూపుడనని యెవఁడెఱుఁగుచున్నాఁడో వాఁడే కృతార్థుండును జీవన్ము క్తుండునని వేదాంత సిద్ధాంతము.

            శ్లో||  ఇంద్రియైరుపలబ్ధస్స్యా దర్థానాం జాగ్రదాత్మనః
                       నిద్రాయాం మనసై వార్థోపలబ్ధిస్స్వప్న ఉచ్యతే
                       సర్వేషాం జ్ఞానరహితా సుషుప్తి స్స్యా త్సుఖాత్మికా
                       తద్వ్యాపారాః కాయికాద్యా స్తథా విశ్వాదినామకః
                       అవస్థాద్యై స్సుసంయుక్త సదా జ్ఞాతృత్వా దయం భవేత్‌
                       అవస్థాద్యై రయుక్తశ్చ తన్నా శే ఽప్యన్యసంస్థితేః
                       యథా విదాకర్తౄణాం సాక్ష్షీ చైత్రరథ స్తథా
                       అవస్థాదివికారాణాం సాక్షీవ్యక్తా స్వయం యథా
                       అహం సాక్షీతి యోవిద్వాన్వివిచ్యైవ పునఃపునః
                       స ఏవ ముక్త స్సో విద్వా నితి వేదాంతడిండిమః

ఇది నవమ వర్ణకము