4. అపవాదము

4.   అపవాదము

            అపవాద మనఁగా కారణ వ్యతిరిక్తముగా కార్యము లేదని యెఱుంగుట అది యేలాగనఁగా మృత్తువలనఁ బుట్టిన ఘటశరావాదులు మృద్వ్యతిరిక్తము లెట్లు గావో, స్వర్ణంబువలనం బుట్టిన కటక మకుటాదులు స్వర్ణ వ్యతిరిక్తంబు లెట్లు గావో, అయస్సు వలనఁ బుట్టిన ఖడ్గ శరాదులు అయోవ్యతిరిక్తంబు లెట్లుగావో అటులనే ఆత్మవలనఁ బుట్టిన ప్రపంచ మాత్మవ్యతిరిక్తంబు గాదని యెఱుంగుట. అటులనే పంచీకృత పంచమహా భూతంబుల వలనఁ బుట్టిన బ్రహ్మాండంబును, ఆ యండంబులో పదు నాలుగు లోకంబులును, ఆ యాలోకంబుల కుచితమయిన చతుర్విధ భూత గ్రామాదులును, వీనికి కారణంబైన పంచీకృత పంచమహాభూతంబులకంటె వేఱు గాదని యెఱుంగుట. పంచీకృత పంచమహాభూతంబులును సమష్టి వ్యష్ట్యాత్మకంబైన లింగ శరీరంబును, అపంచీకృత పంచమహా భూతంబుల కంటె వ్యతిరిక్తంబు గాదని యెఱుంగుట. జలంబువలనఁ బుట్టిన పృథివి జలవ్యతిరిక్తంబు గాదని యెఱుంగుట. తేజస్సు వలనఁ బుట్టిన జలంబు తేజోవ్యతిరిక్తంబు గాదని యెఱుంగుట. వాయువువలనఁ బుట్టిన తేజస్సు వాయువ్యతిరిక్తంబు గాదని యెఱుంగుట. ఆకాశంబువలనఁ బుట్టిన వాయువు ఆకాశ వ్యతిరిక్తంబు గాదని యెఱుంగుట. మాయవలనఁ బుట్టిన యాకాశంబు మాయకు వ్యతిరిక్తంబు గాదని యెఱుంగుట.

            మాయ యనఁగా సత్తని చెప్పఁగూడదు. కాలత్రయంబునందును బాధ్యరూపకమయి యున్నది. కనుక అసత్తనియునుం జెప్పఁగూడదు. అహమజ్ఞఃఅని యనుభవంబున్నది. కనుక సదసత్తనియునుం జెప్పఁగూడదు. విరుద్ధ ధర్మము గనుక, మఱియేమనవలయు నన అనిర్వచ నీయమని చెప్పవలయును. అనిర్వచనీయమనఁగా ఇట్టిది అట్టిది యని జెప్పశక్యము గానిది. అనఁగా మిథ్యాస్వరూపము. అది యెట్లనఁగా అవయవోత్పత్తి చేతఁ దోఁచినను, ‘యా మా, సా మాయా, యా న విద్యతే సా అవిద్యా’ (ఏది లేనిదో అది మాయ, ఏది తెలియబఁడదో అది అవిద్య) కనుక మాయా అవిద్యలు రెండును లేనివేయై చిన్మాత్రము శేషించుచున్నది. ఆ చిన్మాత్ర స్వరూపంబు నే నని యెవఁడెఱుంగుచున్నాఁడో వాఁడే. ముక్తుండని శ్రుతులు చెప్పుటచే నాచార్యులగు వారును జెప్పుచున్నారు. 

            శ్లో||  స్థూలసూక్ష్మాది దేహానా మాత్మన్యారోప ఏవ చ
                       అపవాద స్తతో ఽప్యేషాం సమ్య గత్ర ప్రదర్శితః
  
ఇది ప్రథమ వర్ణకము