20. అఖండత్వ మననము

ద్వాదశ వర్ణకము
20.అఖండత్వ మననము

            శ్లో||  అఖండత్వం సదా సచ్చిదానందానాం యథా భవేత్‌
                       భిన్న వద్గుణవద్భాసమానానాం వర్ణ్యతే తథా

           పూర్వమందాత్మకు సచ్చిదానందత్వమును నిరూపించి, యిప్పుడా సచ్చిదానందస్వరూపుఁడైన యాత్మకు నఖండత్వమును నిరూపించు చున్నారము. అఖండత్వ మనఁగా, దేశ కాల వస్తువుల వలన నపరి చ్ఛిన్నత్వము. ఆ యఖండత్వమున కీమూడు విశేషణంబులు నేల చెప్పవలయును? ఒక విశేషణమైనను లేక రెండు విశేషణములైనను చాలవా? అనిన, చాలవు. ఎందుచేత ననఁగా, ఆత్మకు దేశముచేత నపరిచ్ఛిన్నత్వమే అఖండత్వమని చెప్పుదమనిన ఆకాశము వ్యాపకమయి యున్నది గాన, నా యాకాశమునకు దేశముచేత నపరిచ్ఛిన్నత్వమున్నందున నాకాశంబునకును అఖండత్వము వచ్చును. ఆయాకాశంబునకు అఖండత్వంబు నిరాకరించుట కొఱకు కాలముచేతను అపరిచ్ఛినత్వ మఖండత్వమని చెప్పితిమి. ఆ యాకాశమునకు కాలముచేత నపరి చ్ఛిన్నత్వము లేదా ? యనిన, లేదు. అది యెటులనఁగా ఆకాశము ఉత్పత్తి నాశవంతమై యున్నది. కనుక దానికి కాలముచేత నపరిచ్ఛిన్నత్వము చెప్పఁగూడదు. కాఁబట్టి కాలముచేతను అపరిచ్ఛిన్నత్వ మనెడి రెండవ విశేషణమును కావలెను. అయితే యీ రెండు విశేషణములే చాలునని చెప్పుద మనిన, కాలము విభువై యున్నది. కనుక దేశము చేత నపరిచ్ఛిన్న మయి యుండుటచేతను తనచేత తనకు పరిచ్ఛేదము కూడకుండుట చేతను కాలముచేత నపరిచ్ఛిన్నమై యున్నది గనుక, దానికిని అఖండత్వము వచ్చును. కాఁబట్టి కాలమునకు అఖండత్వము నివర్తించుట కొఱకు వస్తువు చేతను అపరిచ్ఛిన్నత్వమనెడి మూఁడవ విశేషణమును కావలెను. కాలమునకు వస్తువు చేత నపరిచ్ఛిన్నత్వము లేదా? అనిన, కాలము ఆకాశము కాదు గనుక, కాలమునకు వస్తువుచేత నపరిచ్ఛిన్నత్వము లేదు. కనుక ఆత్మ వినాగా నా కాలాకాశాదులకు త్రివిధ పరిచ్ఛేదశూన్య రూపమగు నఖండత్వము కూడదు. అయితే ఈ దేశమం దున్నాఁడ, నా దేశమందు లేనని, దేశము చేతను, నేను ప్రభవ సంవత్సరమందుఁ బుట్టితిని. కొంత కాలమునకు లేకపోవుదునని కాలము చేతను, నేను పృథ్వి వ్యాధులు కానని వస్తువు చేతను పరిచ్ఛిన్నుఁడై తోఁచునట్టి ఆత్మకు త్రివిధపరిచ్ఛేద శూన్యత్వమెటుల కూడుననిన, కూడును. నేనీ దేశమందున్నాఁడను, నేనీకాలమందుంటిని, ఈ వస్తువు నేను గానని ఈ త్రివిధ పరిచ్ఛేదములు నధ్యాసము చేతను మానము నపేక్షించుకొని వచ్చుచున్నది గనుక దేహవ్యతిరిక్తుండైన ఆత్మకు దేశ కాల వస్తువులచేత నపరిచ్చిన్నత్వము కూడును. అయితే ఆత్మకు దేశముచేత నపరిచ్ఛిన్నత్వ మెటులనిన ‘‘ఘటస్సన్‌, పటస్సన్‌ కుడ్యంసత్‌, పృథివీ సతీ, ఆపస్సత్యః, తేజస్సత్‌, వాయుస్సన్‌, ఆకాశస్సన్‌’’ అని భూత భౌతికమయిన సమస్త ప్రపంచంబునందును సద్రూపుఁడైన ఆత్మకు అనువృత్తి యున్నది గనుకను, ఆత్మ వ్యాపకుఁడై యున్నాఁడు గనుకను ఈ వ్యాపకుఁడయిన ఆత్మకు దేశముచేతను అపరిచ్ఛిన్నత్వమున్నది. కాలము వలన నపరిచ్ఛిన్నత్వ మెటులనిన, ఆత్మ యనాదియై యున్నాఁడు గనుక, భూతకాలము చేతను నిత్యుఁడై యున్నాఁడు గనుక, భవిష్యత్కాలము చేతను దేహవ్యతిరిక్తుఁడై యున్నాఁడు గనుక, వర్తమానకాలము చేతను ఆత్మకు పరిచ్ఛిన్నత్వము లేదు. ఆత్మకు వస్తువు చేత నపరిచ్ఛిన్నత్వ మెటులనిన ఆత్మ సర్వాత్మకుఁడై యున్నాఁడు గనుక వస్తువు చేతను ఆత్మకు పరిచ్ఛిన్నత్వము లేదు. వస్తువనఁగా సజాతీయ మని విజాతీయమని స్వగతమని మూఁడు విధములై యుండును. ఆ మూఁడు విధములగు సజాతీయ విజాతీయ స్వగతంబు లెవ్వి యనిన, దృష్టాంత పూర్వకముగఁ జెప్పుచున్నారము. వృక్షంబునకు వృక్షాంతరంబు సజాతీయంబు.శిలాదులు విజాతీయంబు, పత్ర పుష్పఫలాదులు స్వగతము. ఇవి యెటులో అటులే యాత్మకు సజాతీయ విజాతీయ స్వగతంబులు లేవు. ఈ మూఁడు లేకుండుట వలన ఆత్మకు సజాతీయ విజాతీయ స్వగతంబులు లేవు. అయితే ‘‘ఘటస్సన్‌, పటస్సన్‌, కుడ్యంసత్‌, కుసూలస్సన్‌, దేవదత్తాత్మా, చైత్రాత్మా, మైత్రాత్మా’’ అని సజాతీయ భేదంబును, పృథివ్యప్తేజో వాయ్వాకాశంబులని ఘట పట కుడ్య కుసూలంబులని విజాతీయ భేదంబును, ఇచ్ఛాద్వేష సుఖదుఃఖ సత్త్వరజస్తమంబులని స్వగత భేదంబును ఆత్మకు ఉండఁగా సజాతీయ విజాతీయ స్వగత భేదంబులును లేవని యెటుల చెప్పవచ్చు ననఁగా, ఆత్మకు సజాతీయ స్వగత భేదంబు లుపాధిచేత వచ్చినవి కాని పరమార్థతః సజాతీయ విజాతీయ స్వగత భేదంబు వలన లేవని చెప్పవచ్చును. ఆత్మకు సజాతీయభేద మెటువలె ననఁగా ఒక ఆకాశమే ఘటమఠ కుడ్యకుసూల వనవృక్షాద్యుపాధుల చేతను ఘటాకాశమనియు, మఠాకాశ మనియు, కుడ్యాకాశమనియు, కుసూలాకాశమనియు ననేకంబు లుగా నెటువలె వ్యవహరింపబడుచున్నవో అటువలెనే ఆత్మ ఉచ్ఛావచంబు లయిన శరీరోపాధుల చేతను దేవదత్తుఁడనియు, యజ్ఞ దత్తుఁడనియు, విష్ణుదత్తుఁడనియు, కృష్ణుఁడనియు, రాముఁడనియు ననేకాత్మలుగాఁ దోఁచుచున్నాఁడు. పరమార్థమును విచారించునపుడు ఆ యాకాశంబునకు సజాతీయ బేధంబు లేదు. విజాతీయ భేదం బెటువలెననిన, సద్రూపుఁడగు ఆత్మకు విజాతీయంబగు నసత్ప్రపంచము తాను అసత్తై యున్నది. గనుక ఆ యసత్తైన ప్రపంచంబు వలన ఆత్మకు శశ విషాణ వంధ్యాపుత్ర గగనారవిందంబులవలె విజాతీయ భేదంబు లేదు.  స్వగతభేదం బెటువలె ననిన, ఇచ్ఛాద్వేష సుఖదుఃఖంబు లెల్లను అంతఃకరణ విషయమై తోఁచుచున్నది గావున నాత్మ గుణంబులు గావు. అట్లగుట వలన నాయిచ్ఛా ద్వేషాదిగుణంబులచేత సచ్చిదానందస్వరూపుఁడయిన ఆత్మకు స్వగత భేదంబును లేదు.

            అయితే భిన్నంబులగు సచ్చిదానందములచేత ఆత్మకు భేదంబు లేదా యనిన, సచ్చిదానందంబు లన్యోన్యభిన్నంబు లయ్యెనని భేదంబును గలదు. అవి యభిన్నము లగుటవలన నాసచ్చిదానందంబుల చేత ఆత్మకు భేదంబు లేదు. సత్తనియును, చిత్తనియును, ఆనంద మనియును, శబ్ద భేదంబు అర్థ భేదంబు నున్నవి గనుకను హస్తకరపాణిశబ్దంబులవలె పర్యాయశబ్దంబులు గావు గనుకను, మఱియును లోహితోష్ణ ప్రకాశంబులు దీపంబునకువలె స్వరూపంబులై యున్నవి గనుకను, ఈ లోహితోష్ణ ప్రకాశంబు లెటుల పరస్పర భిన్నంబులు గావో, అటులే సచ్చిదానందంబులు శబ్దార్థంబుల వలన  భిన్నంబులవలె వ్యవహరింపఁ బడినప్పటికిని ఆత్మకు స్వరూపంబై యున్నవి గనుక, సచ్చిదానందంబులకు పరస్పర భేదంబు లేదు. ఈ సచ్చిదానందంబులకు భేదంబు లేదేని, శ్రుతి ఆత్మ సద్రూపుఁడని మాత్రమే చెప్పవలెను. అటుల చెప్పక చిద్రూపుఁడనియు ఆనంద రూపుఁడనియు నెందుకుఁ జెప్పెను? భేదము లేకున్న నటువలె చెప్పునా? యనిన, చెప్పును. అది యెటువలె ననఁగా, ఆత్మనిష్ఠంబగు నానందము దుఃఖరూపమయిన పుత్రాదినిష్ఠముగాఁ దోఁచి జగన్నిష్ఠంబగు నసద్రూపత్వం బును బుద్ధ్యాదినిష్ఠంబగు జడరూపత్వంబును పుత్రభార్యాదినిష్ఠంబగు దుఃఖరూపత్వంబును నేను చచ్చిపోవుచున్నాఁడను నేను దుఃఖినని యాత్మ నిష్ఠమయి తోఁచుచున్నది. కాఁబట్టి ఆ విపరీత భ్రాంతిని పోఁగొట్టుటకై ఆత్మ సద్రూపుఁడు చిద్రూపుఁడు ఆనంద రూపుఁడని చెప్పుటయే కాని, ఆత్మ రూపంబులగు సచ్చిదానందంబుల కన్యోన్య భేదము చెప్పుటయందు శ్రుతికి తాత్పర్యము లేదు. ఇంతమాత్రమే కాదు, ఈ ముందు చెప్పఁబడిన విపరీతార్థవాదులైనవార లాత్మ జడస్వరూపుఁడని యంగీకరించి అతనికి సత్తు ధర్మమనియును, చిత్సుఖంబులు గుణంబులనియును జెప్పిరి గావున, నామతమును పోఁద్రోయుట కొఱకు ఆత్మ సచ్చిదానంద స్వరూపుఁడని శ్రుతి చెప్పుచున్నది. ఇంతియ కాని, వీనికి అన్యోన్య భేదమును జెప్పుట యందు తాత్పర్యము లేదు గనుక, సత్తే చిత్తు చిత్తే ఆనందమని శ్రుతితాత్పర్యా లోచన చేత సిద్ధించెను. అయితే శ్రుతి మాత్రము చేతనే కదా, సత్తే చిత్తు చిత్తే ఆనందమనుట సిద్ధించెను. యుక్తిచేత సిద్ధింప లేదు గదా యనిన, సిద్ధించియున్నది.

            అది యెట్టులనిన, సత్తు తానే తోఁచుచున్నదో లేక మఱియొకటి చేత తోఁపింపఁబడి, తోఁచుచున్నదో యనిన, తానే తోఁచుచున్నదని చెప్ప వలయును. ఇటువలె చెప్పుటచేత సత్తే చిత్తనుట సిద్ధించుచున్నది. అన్యము చేత తోఁపింపఁబడుచున్నదని చెప్పుదమనిన సద్విలక్షణంబు వలనం దోఁపింపఁబడుచున్నదియో, సదంతరంబువలన తోఁపింపఁబడుచున్నదియో యని శంక రాఁగా, సద్విలక్షణంబు చేతనే తోపిఁపఁబడుచుండునని చెప్పుద మనిన, అటుల చెప్పఁగూడదు. చెప్పినట్టయితే, సద్విలక్షణమనఁగా నసత్తు గావున, అసత్తైన సద్విలక్షణంబుచేత సత్తు తోఁపింపబడుచున్నదని చెప్పఁగూడదు. అటువలె చెప్పినట్టయితే అసత్తైన శశవిషాణాదులచేత సత్తైన ఘటాదులు తోఁపింపఁబడవలెను. అటువలె తోఁపింపఁబడలేదు. కాఁబట్టి సద్విలక్షణంబగు నసత్తు వలన సత్తు తోఁపింపఁబడుచున్నదని చెప్పఁగూడదు. అయితే సత్తు సదంతరంబుచేత తోఁపింపఁబడుచున్నదని చెప్పుద మనిన, ఆ సదంతరము తాను దోఁచుచుండి సత్తును తోఁపింపఁజేయు చున్నదో లేక తాను తోఁచకయే సత్తును తోపింపజేయుచున్నదో యనిన, తాను తోచకయే ఆసత్తును తోఁపింపఁజేయనేరదు గనుక, తాను దోఁచుచు సత్తునుం దోపింపఁజేయుచున్నదని చెప్పవలెను. ఆ సదంతరముచేత సత్తు తోఁచుచు ఆ సత్తును తోఁపించుచున్నదని చెప్పిన నెందుచేత తోపిఁపఁబడుచున్నదని అనవస్థా దోషము వచ్చును. కాఁబట్టి ఆ సదంతరము తాను స్వతః తోఁచుచు నుండి సత్తును తోపింపఁజేయుచున్నదని చెప్పవలెను. కనుక వేదాంతమందు సత్తాద్వయంబు లేదు గాన, నేసత్తు తాను స్వతః తోఁచుచున్నదో ఆ సత్తునకే చిత్త్వము సిద్ధించెను. ఇట్లు చెప్పుటచేత సత్తుకే చిత్త్వము సిద్ధించినఁ జిత్తైనసత్తునకు ఆనందత్వంబు సిద్ధింప లేదే యనిన, సిద్ధించి యున్నది. అది యెటువలె ననిన, ఆ చిత్తైన సత్తున కద్వితీయత్వంబు సదంతరంబువలన వచ్చుచున్నదో, లేక సద్విలక్షణంబు చేత వచ్చుచున్నదో యనిన, ఆ సత్తునకు ఉపాధి వినాగా స్వతః సదంతరము లేదు గనుక, సదంతరంబుచే సద్వితీయత్వంబు వచ్చెనని చెప్పఁగూడదు. అయితే సద్విలక్షణంబువలన సద్వితీయత్వంబు వచ్చెనని చెప్పుదమనఁగా, సద్వి లక్షణ మనఁగా, రజ్జు సర్పములవలె నసత్తు గనుక, దానివలనం జిత్తైన సత్తున కద్వితీయత్వంబు చెప్పనే కూడదు. కాఁబట్టి అసత్తునకు సదంత రంబును సద్విలక్షణంబును వినాగా, సద్వితీయత్వమును సంపాదించునట్టి పదార్థంబు లేదు గాన, నాసత్తున కద్వితీయత్వంబు సిద్ధించెను. అద్వితీయత్వ మెప్పుడు సిద్ధించెనో అప్పుడే ఆనందరూపత్వము సిద్ధించెను. ఈ ప్రకారంబున యుక్తిచేతను సత్తే చిత్తు, చిత్తే ఆనందమని సిద్ధించెను. అయితే శ్రుతి యుక్తులచే మాత్రము సత్తే చిత్తు, చిత్తే ఆనంద మనుట సిద్ధించెను. అనుభవముచేత సిద్ధింపలేదు గదా ! యనిన, అనుభవము చేతను సిద్ధించి  యున్నది.

            అది యెటువలె ననిన, సుషుప్తియందు సర్వప్రాణుల చేతను ఒక సుఖంబనుభవింపఁబడినదిగాఁ దోఁచుచున్నది. ఆ సుఖంబు జాగ్రత్స్వప్నం బులయందు తోఁచెడి సుఖమువలె నానా రూపంబులై యుండక సర్వ సుషుప్తులయందు నేకరూపంబై యున్నది గాన, నాసుషుప్తి సుఖంబునకు చిద్రూపత్వం బెటువలె ననిన, తానునుం దోఁచుచు, తనయం దారోపింపఁబడిన సర్వపదార్థంబులనుం దోఁపించుచున్నది గాన, నాసుషుప్తి సుఖం బునకు చిద్రూపత్వం బున్నది. అది యెటువలె ననిన సుషుప్తినొంది లేచిన పురుషునిచేత నేను సుఖంబుగ నిదురపోయితిని, ఏమియు నెఱుంగ కుండితి నని యొక్క సుఖంబు నజ్ఞానంబును స్మరింపఁబడుచున్నవి. ఆ స్మరణం బనుభవంబు లేక రానేరదు. కాఁబట్టి ఈ సుఖంబును అజ్ఞానంబును సుషుప్తి కాలంబునం దనుభవింపఁబడినదై తోచుచుండుట వలన నా సుఖ స్వరూపంబే సుఖంబు అనుభవింపబడుచున్నదనెడి మోహం బజ్ఞానంబు. ఈ యనుభవింపఁబడిన అజ్ఞానం బెవరివలనఁదోఁచుచున్న దనిన, సుషుప్త్య వస్థయందు ప్రకాశసాధనంబులగు నాదిత్య చంద్ర నక్షత్ర విద్యుద్వహ్నీ చక్షురాదులు లేకయే సుఖమాత్రంబున్నది గాన, నా సుఖంబువలన నజ్ఞానంబు తోపింపఁబడుచున్నదని చెప్పవలయును. ఆ యజ్ఞానంబు వలననే సుఖము తోపింపఁబడుచున్నదని చెప్పుదమనఁగా, అజ్ఞానంబు జడంబుగాన దానివలన సుఖంబు తోపింపఁబడుచున్న దని చెప్పఁగూడదు. అయితే సుషుప్తి సుఖము సత్తయ్యెను. సత్తయిన సుషుప్తి సుఖమును తోఁపకయే అజ్ఞానమును తోపింపనేరదు గనుక, తాను తోఁచి అజ్ఞానంబును దోపింపు చున్నది. ఆ యజ్ఞానంబునందు సమస్త ప్రపంచంబును లీనంబయి యున్నది. గాన నా యజ్ఞానమును తోఁపించుటచేత నా సుఖంబునకు సకల పదార్థావభాసకత్వంబు సిద్ధించెను. ఇది ఆత్మకు సర్వజ్ఞత్వము. కాఁబట్టి సుషుప్తవ్యస్థయందు సత్తైన సుఖంబునకు చిద్రూపత్వము సిద్ధించెను. దీనికి ఆనందస్వరూపత్వ మెటువలె ననిన, నిరూపాధిక నిరతిశయ సుఖ స్వరూపత్వము ఈసుఖమునకు నున్నది గనుక, దీనికి ఆనంద స్వరూపత్వము సిద్ధించెను. కాఁబట్టి అనుభవము చేతను సత్తే చిత్తు, చిత్తే ఆనంద మనుట సిద్ధించెను. కాఁబట్టి సచ్చిదానందంబు లాత్మకు స్వరూపంబయ్యె. అట్లగుట వలన స్వకీయంబులగు సచ్చిదానందంబుల వలన ఆత్మకు స్వగత భేదము లేదు. ఆత్మకు విజాతీయంబగు ననాత్మ అసత్తు గావున నాయనాత్మ వలన ఆత్మకు విజాతీయ భేదంబు లేదు. ఆత్మకు ఆత్మాంతరము లేదు గావున, సజాతీయ భేదంబును లేదు. ఈ ప్రకారముగా నీ మూటిచేతను ఆత్మకు భేదము లేదు. ఆత్మ సర్వాత్మకుఁడై యున్నాఁడు గనుక, సజాతీయ విజాతీయ స్వగత రూపంబగు వస్తువు చేతను విభుడై యున్నాఁడు. కావున దేశము చేతను నిత్యుఁడై యున్నాఁడు గనుక కాలముచేతను పరిచ్ఛేదము లేదు. ఈ ప్రకారముగా ఆత్మ దేశ కాల వస్తువుల వలనం ద్రివిధపరిచ్ఛేద శూన్యుఁడై యున్నాఁడు. కాఁబట్టి సచ్చిదానంద స్వరూపుఁడైన ఆత్మకు అఖండత్వము సిద్ధించెను. అయితే ఈ విచారంబునకు ఫలంబేమి యనిన, సమస్త ప్రాణులకును తమ దేహమే తా మనెడి ధృఢనిశ్చయ మెటువలె నున్నదో అటువలెనే దేహము తా నని దేహమందాత్మబుద్ధి గాక అఖండ సచ్చిదానంద రూపుఁడగు నాత్మ తాఁనని ధృఢ నిశ్చయము కలుగుటయే యీ విచారమునకు ఫలము. ఈ ప్రకారముగా విచారించి ఆత్మ స్వరూపమే తానని యెవఁ డెఱుఁగుచున్నాఁడో వాఁడే సర్వసంసార విముక్తుండును కృతకృత్యుండును పరిపూర్ణ బ్రహ్మంబునని స్మృతీతిహాస పురాణాగమ శ్రుత్యాచార్యవచనంబులు ఘోషించుచున్నవి. ఈ యర్థంబునందు సంశయంబు లేదు. సిద్ధము.

                       శ్లో||  భూతభౌతిక భావేషు సర్వకార్యే సదాత్మనా
                                వ్యాపీ దృష్ట స్తతో హ్యాత్మా దేశాన్నా న్యపరిచ్ఛితిః
                                అదేహిత్వాదనాదిత్వా దబాఢ్యత్వౌ న్న విద్యతే
                                వర్తమానగతాగామి కాలేభ్యో న పరిచ్ఛితిః
                                సర్వభిన్న స్వరూపేణ సర్వాత్మత్వాత్సదాత్మనః
                                సర్వేభ్యో వస్తుజాతేభ్యః పరిచ్ఛిత్తిర్న విద్యతే
                                న వ్యాపిత్వాద్దేశతోంతో నిత్యత్వాన్నాపి కాలతః
                                న వస్తుతోఽపి సర్వాత్మా భావత్వం బ్రహ్మణి త్రిధా
                                అఖండాత్మానమేవాయ మిత్యేవం యో విజజ్ఞివాన్‌
                                స సర్వసంసృతేర్ముక్తో బ్రహ్మానందం సమశ్నుతే
                                కిమనేన బహూక్తేన నిర్జితాదౌ మహాత్మభిః
                                అవిచారాద్ధి సంసారో విచారాన్మోక్ష ఇష్యతే
                                ప్రమదాచ్చ ప్రమాదాద్వా యదజ్ఞానా న్మయేరితమ్‌
                                తత్‌ క్షమ్యం తు సమాలోక్య పండితాస్సమదర్శినః

ఇది ద్వాదశ వర్ణకము.