44. ముక్తిపంచక నిరూపణము

షట్త్రింశద్వర్ణకము
44. ముక్తిపంచక నిరూపణము

            పంచవిధంబులైన ముక్తులను నిరూపించుచున్నారము : అది యెటువలె ననిన, సాలోక్యమనియును, సారూప్యమనియును, సామీప్యమని యును, సార్షి ్టకమనియును, కైవల్యమనియును అయిదు విధంబులు. సామీప్యమనఁగా, ఉపాసన వలన బ్రహ్మలోకంబునకు పోయి బ్రహ్మదేవుని యొక్క సముఖంబు లేకయే ఒక ప్రదేశమందుండి సమస్త భోగంబులు ననుభవించుట సామీప్యముక్తి. సారూప్యమనఁగా, బ్రహ్మదేవునికి నేరూపంబు కలదో ఆ రూపంబును పొంది సమస్త భోగంబుల ననుభవించుట సారూప్య ముక్తి. సార్షి ్టకమనఁగా బ్రహ్మదేవుని కేయైశ్వర్యంబుగలదో అట్టి యైశ్వర్యంబు గలిగి సమస్త భోగంబుల ననుభవించుట సార్షి ్టక ముక్తి. సాలోక్యమనఁగా బ్రహ్మదేవుని యొక్క సమీపమందుఁ జేరి ఆయన యెటువంటి భోగంబులను భవించునో ఆలాంటి భోగంబులను బొందుచు నా బ్రహ్మదేవుని యెల్లప్పుడును చూచుచుండుట సాలోక్యముక్తి. ఈ నలుగురికిని ముక్తి యేకరూపమై యున్నప్పటికిని ఉపాసనా తారతమ్యంబు వలన నవాంతర ఫల తారతమ్యంబు కలదు. కైవల్యమనఁగా, ముముక్షువు లైనవారు శమద మాదులతోఁ గూడుకొని గురువులయొద్ద శ్రవణమననాదులను చేసి జ్ఞానంబును సంపాదించి సచ్చిదానందస్వరూపుడైన యాత్మనేనని యెఱింగిన తర్వాత స్వరూప మాత్రంబు నుండుట కైవల్యము. ఇది విచారంబు వలన పుట్టిన జ్ఞానంబు చేతనే రావలెను. కర్మోపాసనాయోగంబుల చేత వచ్చునట్టిది కాదు. కనుక బ్రహ్మలోకముననుండెడి వారును, బ్రహ్మదేవుని యొద్ద విచారంబుచేసి జ్ఞానంబు సంపాదించి బ్రహ్మదేవుని తోడ ముక్తినొందుదురు. ఇందువలన నేమి చెప్పఁబడియె ననిన, సమస్త ప్రాణులకును జ్ఞానంబుచేతనే ముక్తి. ర్మోపాసనాయోగంబుల చేతను ముక్తి లేదనుట చెప్పఁబడెను.

ఇది షట్త్రింశద్వవర్ణకము.