1. మోక్షోపాయము

1.   మోక్షోపాయము

ధర్మార్థ కామమోక్షములనెడి పురుషార్థ చతుష్టయములో ‘‘న స పునరావర్తతే, న స పునరావర్తతే’’ యను శ్రుతి ప్రమాణముగ నిత్యమైనదగుట వలన మోక్షమే పరమపురుషార్థము. ధర్మార్థకామము లనిత్యములు. ఏలయన, ‘‘తద్యథేహ కర్మచితో లోకః క్ష్షీయతే’’ ‘‘ఏవమేవాముత్ర పుణ్యచితో లోకః క్షీయతే’’ ఇత్యాది శ్రుతుల వలన నీలోకమున కర్మములు క్షీణించిన లోమును క్షీణించునట్లు పుణ్యము క్షీణింపఁగాఁ బరలోకమును క్షీణించునని తెలియుచున్నది. మోక్షము బ్రహ్మజ్ఞానము చేతనే సిద్ధించును. ఇందుకు ‘‘తమేవం విదిత్వాఽతిమృత్యుమేతి’’, ‘‘నాన్యః పంథా విద్యతేఽయనాయ’’ ‘‘బ్రహ్మవిదాప్నోతి పరమ్‌’’ ఇత్యాదిశ్రుతులు ప్రమాణము. మఱియు ‘‘న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకేఽమృతత్వమానశుః’’ అనెడి శ్రుతి ప్రకారము అమృతత్వము (జనన మరణ ప్రవాహవర్జితమగు ముక్తి) యజ్ఞ యాగాది పుణ్యర్మములు చేయుటవలనఁగాని, గుణవదాయుష్మత్పుత్ర ప్రాప్తివలనఁ గాని, దానభోగ సహిత ధనప్రాప్తి వలనఁగాని లభింపదు. కావున ధర్మార్థ కామముల నుపేక్షించి, మోక్షము కొఱకు ప్రయత్నించుటయే పరమపురషార్థము నరజన్మమునకు ఫలమును. ఆ మోక్షము బ్రహ్మాను భవము వలననే లభించును. ఆ పరబ్రహ్మతత్త్వము అధ్యారోపాపవాదముల వల్లఁ దెలిసికొనవలెను.