5. సాధనచతుష్టయ ప్రకరణము

ద్వితీయ వర్ణకము
5.   సాధనచతుష్టయ ప్రకరణము

           శ్లో||  యశ్చ సాధనసంపన్న ఈశ్వరస్య ప్రసాదతః
                   యజ్ఞాదికర్మ కరణా త్సోఽధికారీ నిరూప్యతే

            వేదాంత విచారణయందు సాధన చతుష్టయ సంపన్నుఁడే అధికారి. అది యెటులనగా, బృహస్పతి సవనంబునందు బ్రాహ్మణుం డెటుల నధికారియో, క్షత్రియ వైశ్యులెటుల యధికారులు కారో, రాజసూయ మందు క్షత్రియు లెటుల అధికారులో, బ్రాహ్మణులు వైశ్యులు నెటుల యధికారులు కారో, సోమమందు వైశ్యుఁడు ఎట్లు అధికారియో, బ్రాహ్మణ క్షత్రియులు ఎట్లు అధికారులు కారో, అటులే వేదాంత విచారణ యందును సాధన చతుష్టయ సంపన్నుఁడే అధికారి.

            (1) నిత్యానిత్య వస్తు వివేకము (2) ఇహాముత్రార్థఫలభోగ విరాగము (3) శమాదిషట్కసంపత్తియు (4) ముముక్షుత్వము ననునవియే సాధన చతుష్టయము.

1. నిత్యానిత్య వస్తు వివేకము: పరబ్రహ్మము సత్యము, ప్రపంచము మిథ్య. అది యున్నట్లు తోఁచుటయే కాని వాస్తవముగ లేదు. బ్రహ్మ భిన్నము కాదు అనెడి నిశ్చయము.

2. ఇహాముత్రార్థఫలభోగ విరాగము: ఈ ప్రపంచమునందుఁగల సర్వ విషయము లందును వాంతియైన అన్నమునందువలెను, మూత్రపురీషాదు లందువలెను, ఇచ్ఛలేకుండుట, ఇహలోక ఫలభోగ విరాగము. ఇట్లే స్వర్గాది పరలోకములయందుఁగల రంభాసంభోగాది భోగములందు సయితము ఐహిక భోగములందువలెనే యిచ్ఛ లేకుండుట ఆముత్రార్థఫల భోగ విరాగము. ఈ రెండునుంగూడి ఇహాముత్రార్థఫలభోగ విరాగమనఁబడును.

3. శమాదిషట్క మనఁగా: శమము, దమము, ఉపరతి, తితీక్ష, సమాధానము, శ్రద్ధ యనునీయాఱును.

శమ మనఁగా : అంతరింద్రియ నిగ్రహము. అనఁగా మనస్సును జయించి దానిని శ్రవణ మనన నిధిధ్యాసముల యందుఁ దప్ప నితర విషయములందుఁ బోనీయకుండుట.

దమ మనఁగా : బాహ్యేంద్రియ నిగ్రహము. మనస్సును బాహ్య విషయములను చింతింపకుండ సర్వదా శ్రవణ మనన నిధిధ్యాసముల యందే నిలుపుట.

ఉపరతి యనగా : వేదమునం దుపదేశింపఁబడిన కర్మల సన్యాసాశ్రమవిధిచేఁ బరిత్యజించి సర్వదా శ్రవణాదులనే ఆచరించు చుండుట (విధ్యుక్త కర్మలను ఫలాపేక్షగాని, కర్తృత్వాద్యభిమానము గాని లేకుండ నివర్తించుటయు) ఉపరతి యని కొందరి మతము. మనస్సు స్త్రీ గాను, ప్రత్యగాత్మ పురుషుఁడుగాను భావించి, ఆ మనస్సును సర్వదా ప్రత్యగాత్మయందు లక్ష్యముంచి వివశతనుండుట ఉపరతి యని కొందరి మతము.

తితీక్ష యనఁగా : శీతోష్ణాది సహనము (చలికిని, యెండకును నోర్చుట) తనకు నెవఁ డెట్టియపకార మొనరించినను, తన హస్తపాదాదుల నఱికినను, వానిని నిగ్రహించు శక్తియుండియు, వాని యపరాధమును సహింపఁగల మనో నిగ్రహము.

సమాధాన మనఁగా : శ్రవణాదులయందు నిలుపఁబడిన మనస్సు పూర్వ సంస్కార వశమున నితర విషయములను గూర్చి పరుగిడునేని, ఆ విషయ దోషములను విమర్శించి, వైరాగ్యమును బుట్టించి, మనస్సును మఱలించి, శ్రవణాదులయందు నిలుపుట.

శ్రద్ధ యనఁగా : గురు వాక్యములందును, వేదాంత వాక్యము లందును అత్యధికమగు నమ్మకము.

4. ముముక్షుత్వ మనఁగా: సమస్త ప్రాణులును మోక్షము కావలెనని చెప్పుచున్నారు. అది మోక్షేచ్ఛ కానేరదు. గృహము దగ్ధమగుచుండఁగా నట్టి గృహంబునందుండు పురుషుండు పుత్ర మిత్ర కళత్రాదులేమయి పోయిరో యని విచారింపక, అగ్ని చేత తప్తుఁడై ఆ పుత్రమిత్రాదులను విడిచిపెట్టి శీతలంబునం బ్రవేశించినట్లు సంసారంబునందు ఆధ్యాత్మిక, ఆధి భౌతిక, ఆధి దైవిక తాపత్రయాదు లనెడి అగ్ని చేత తప్తుఁ డైనపురుషుఁడు ఈ సంసార తాపంబు నెవరు పోఁగొట్టుదురో ? సద్గురువు లెక్కడఁగలరో ? దీనికి సాధనంబు లేవేవి కావలెనో యని తపించుకొనుచు నుండు వాని చిత్తవృత్తికే మోక్షేచ్ఛయని పేరు. మఱియును, మనస్సనెడి బెబ్బులియును, ఆశ యనెడి కృష్ణసర్పమును, కామాదు లనుదొంగలును వీనిని నిరాకరించుటకై పై నాలుగు సాధనంబులును గలవాఁడే అధికారి.  శ్రవణంబునకు మునుపే సాధన చతుష్టయమును సంపాదించుకొని శ్రవణంబునందుఁ బూనుకొనవలయు. లేనిపక్షమునకు ఆ జన్మంబునందు జ్ఞానము పుట్టదు. గురువులైనవారు అనధికారులకు ఉపదేశము చేయనే చేయరు. అది యెటులనగా శూద్రునిచే యాగము చేయించినను, వానికి స్వర్గఫలంబు లెట్లు సిద్ధింపవో, అట్టి శూద్రునకు ఉపనయనాది సంస్కారం బులు చేయించినను వానికి బ్రాహ్మణత్వ మెటువలె సిద్ధింపదో అటువలె సాధన చతుష్టయము లేనివానికి శ్రవణాదుల వలన జ్ఞానఫలంబు సిద్ధింపదు. అయితే యీ శ్రవణాదులు వ్యర్ధంబులై పోవునా ? యనిన పోఁజాలవు. దానివలన నొక యదృష్టంబు పుట్టును. ఆ సాధన చతుష్టయము శ్రవణంబునకుఁ బూర్వంబున లేకున్నను, శ్రవణకాలంబునం దైనను గురుముఖముగా సంపాదించుకొనవలయును.

            అధికారికి నాలుగు విశేషణంబు లేల చెప్పవలె ? నిత్యానిత్య వస్తు వివేకమే చాలు నని చెప్పుదమన, అది చాలదు. లోకంబునందు శాస్త్రజ్ఞులకు నిత్యానిత్య వస్తు వివేకము కలదు. వారు విషయంబులయం దాసక్తి గలిగి కామ్యకర్మంబులే చేయుచున్నారు.కనుక వారల కధికారము లేదు. కాఁబట్టి రెండవ సాధనంబునుం గావలయును. అయితే రెండు సాధనములే చాలు నని చెప్పుద మన అవి చాలవు. కొందఱు ఋషీశ్వరులకు నిత్యానిత్య వస్తువివేకంబును, ఇహాముత్రార్థ భోగవిరాగంబునుం గలదు గాని, వారలకు కోపతాపంబు లధికంబై శమాదిషట్కసంపత్తి లేనందున వారల కధికారము కానము. కాఁబట్టి మూఁడవ సాధనంబునుఁ గావలయును. అట్లైన మూఁడు సాధనంబులు చాలునా ? అవియునుం జాలవు. లోకంబునం దీచెప్పఁబడిన మూఁడు సాధనంబులును గలవారే కొందఱు గలరు. వారెవరనఁగా కృష్ణాజినంబులం జంకఁబెట్టుకొని, తలలు పెంచుకొని, యోగుల మని పేరు పెట్టుకొని, సంసారమును విడిచి, విరక్తులై, ఉపశాంతులై, ప్రతి గ్రహాదులు లేకయే సంచరించుచు నుండువారు శ్రవణము గలచోటనే చేరరు గనుక, వారికిని అధికారము లేదు. కాఁబట్టి నాలుగవ సాధనంబు గావలయును. ఈ నాలుగు సాధనంబులుంగలవాఁడే వేదాంత విచారంబున కధికారి. ఈ సాధనచతుష్టయ సంపత్తి కాయికవాచికేంద్రియ వ్యాపారంబు గాదు. మనో వ్యాపారము గనుక విషయంబులయందు దోషదృష్టి గలవారు సులభంబుగ సంపాదించుకొనవచ్చును.

            శ్లో||  యావ దన్య దసత్త్యక్తం తావత్సామాన్యమేవ చ
                       వస్తు వా సాధ్యతే లోకే స్వాత్మలాభేతు కా కథా ||
                       సహేతు సఫలం కర్మానర్థమూల మశేషతః
                       త్యజతైవ హి తే దేయం త్యక్తుః ప్రత్యక్పరంపదమ్‌ ||

ఇది ద్వితీయ వర్ణకము